ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల నిర్మాణ సమయంలో నిర్మించిన కార్యాలయాలు శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాల నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర్ కాల్వల ఆధునికీకరణలో భాగంగా నూతన కార్యాలయాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నెస్పీ పరిధిలో నాలుగు సర్కిల్ కార్యాలయాల నిర్మాణానికి కృష్ణాజిల్లా లింగంగుంట్ల ఎస్‌ఈ కార్యాలయంలో నూతన తరహాలో డిజైన్‌లు రూపొందిస్తున్నారు. డిసెంబర్‌లో వీటి నిర్మాణానికి టెండర్లు నిర్వహించి ఏడాదిలోపు నూతన భవనాలు నిర్మించేందుకు శరవేగంగా కసరత్తు చేస్తున్నారు.
ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాల నిర్మాణానికి రూ. 35 కోట్లు వెచ్చించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఖమ్మంలోని టేకులపల్లి సర్కిల్ కార్యాలయంతో పాటు నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం, లింగంగుంట్ల, ఒంగోలు సర్కిల్ కార్యాలయాలను నిర్మించనున్నారు. ఎస్‌ఈ కార్యాలయాలు నిర్మించే క్యాంపస్‌లోనే డివిజన్, సబ్ డివిజనల్ కార్యాలయాలు కూడా నిర్మించి, మౌలిక వసతులు కల్పిస్తారన్నారు. సాగర్ కాల్వల ఆధునికీకరణ కోసం ప్రపంచబ్యాంక్ నుంచి విడుదలైన 4,444 కోట్ల నిధుల్లో నుంచే కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తారు. కాల్వల ఆధునికీకరణలో భాగంగానే కార్యాలయాలను కూడా నిర్మించుకుంటామని అప్పట్లో ప్రపంచబ్యాంకుకు అంచనాలు పంపి అనుమతులు పొందామని సంబంధిత అధికారి తెలిపారు.
ఖమ్మంలో ఎనిమిది ఎకరాల్లో కార్యాలయాల నిర్మాణం
కాల్వల తవ్వకాల సమయంలో ఖమ్మంలోని టేకులపల్లి సర్కిల్ కార్యాలయాన్ని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్మించారు. ప్రస్తుతం ఆ భవన సముదాయం శిథిలావస్థకు చేరింది. అయితే ఈ భవన సముదాయాన్ని ఇల్లెందు క్రాస్‌రోడ్‌లోని డిగ్రీ కళాశాల మైదానంలో కాకుండా ఎన్నెస్పీ క్యాంప్‌లోని 8 ఎకరాల స్థలంలో నిర్మించేందుకు అనుమతులు కోరుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 94 ఎకరాల విస్తీర్ణం ఉన్న క్యాంప్ భూమిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అవసరాలకు 44 ఎకరాల వరకు కేటాయించారు. మిగిలిన 50 ఎకరాల స్థలంలో క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో మంచిగా ఉన్న క్వార్టర్లను వదిలేసి శిథిలమైన క్వార్టర్ల స్థానంలో సర్కిల్ కార్యాలయాలను నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే క్యాంప్‌లో రెండుచోట్ల స్థలాలను పరిశీలించారు. మూడురోడ్ల కూడలిలోని స్థలాన్ని గుర్తించారు. టెండర్లు పూర్తవగానే పనులు ప్రారంభిస్తామని ఎన్నెస్పీ ఎస్‌ఈ అప్పలనాయుడు తెలిపారు.
ఎన్నెస్పీ సర్కిల్ కార్యాలయాలకు గ్రీన్‌సిగ్నల్!?
Published Sat, Nov 16 2013 4:42 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement
Advertisement