సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
- నేడు రేపు జిల్లాలో టూర్
- అనకాపల్లి అగ్రిపాలిటెక్నిక్‌లో బస
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు జిల్లాలో ఏర్పాటు పూర్తయ్యాయి. తొలిరోజు శుక్రవారం అనకాపల్లి, చోడవరం ప్రాంతాల్లో పర్యటించి రాత్రికి అనకాపల్లి వ్యవసాయపరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్)లో బస చేస్తారు.
ఈమేరకు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. సీఎం రాత్రికి బస చేసే అగ్రి పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితులు, అందులో సదుపాయాలను మంత్రులిద్దరూ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో 8.30 గంటలకు సీఎం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.45 వరకు అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 9.30 వరకు రిజర్వులో ఉంటారు.
విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10 గంటలకు అనకాపల్లి నూకాంబిక దేవాలయానికి వెళతారు. దర్శనానంతరం ఉదయం 10.15 నుంచి 11గంటల వరకు రిజర్వులో ఉంటారు. తిరిగి 11 గంటలకు తుమ్మపాల, 11.40కి గంధవరం,12.25గంటలకు గజపతినగరం గ్రామాలకు వెళ్లి స్థానికులతో ముచ్చటిస్తారు. 12.55 గంటలకు చోడవరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో లంచ్ చేసి 2.30 వరకు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 వరకు చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రైతులు, ఉపాధిహామీ కార్మికులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం 5.30కు అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్)కు వెళ్లి శాస్త్రవేత్తలు, విద్యార్థులతో సమావేశమవుతారు. సాయంత్రం 6.30 నుంచి 8గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 8.30గంటల వరకు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.