సాక్షి, నెల్లూరు: నగరంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా.. విజేతల ఎంపికలో అన్యాయం జరిగిందని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేస్తూ కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కళాకారులు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
దీంతో సభలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక దశలో మంత్రి సోమిరెడ్డి ‘యూజ్‌లెస్ ఫెలోస్. సర్దుకోమని చెబుతుంటే వినరా’ అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో యువకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకు దిగిన యువతీ యువకులను కళాక్షేత్రం నుంచి బలవంతంగా బయటకు పంపించివేశారు. దీంతో పలువురు రోడ్డుపై బైఠాయించగా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
వారిని నియంత్రించడం కష్టతరంగా మారడంతో ముగ్గురు కళాకారులను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. మంత్రి వేదిక దిగివచ్చి యువతకు వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది. నెల్లూరు ఆతిథ్యం బాగుంటుందని యువజనోత్సవాలకు వస్తే చేదు జ్ఞాపకాలు మిగిలాయని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళంలో పరిస్థితుల నడుమ మంత్రి సోమిరెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు.
విజేతలు వీరే
జానపద నృత్యం : దయాబృందం (పశ్చిమ గోదావరి )
జానపద గీతం : పాపరత్నం (విజయనగరం)
ఏకాంక నాటకం : శివకుమారి బృందం (కృష్ణాజిల్లా)
వ్యక్తిగత విభాగంలో..
భరతనాట్యం : అన్నానేహాథామస్ (విజయనగరం)
కూచిపూడి : వి.శ్రావణి (పశ్చిమగోదావరి)
కథక్ : పి.దుర్గ (చిత్తూరు)
మణిపురి నృత్యం : ఎన్.శివప్రసాద్ (చిత్తూరు)
ఒడిస్సీ నృత్యం : వైశాలి దత్ (విశాఖపట్నం)
కర్ణాటక సంగీతం : పి.శ్రీహంసిని (కృష్ణా)
హిందుస్థానీ సంగీతం : కె.యశ్వంత్‌సిన్హా (కర్నూలు)
హార్మోనియం : ఎల్.అశ్వంత్‌కుమారి (కర్నూలు)
మృదంగం : కె.పవన్‌కుమార్ (గుంటూరు)
గిటార్ : ఎస్.బాలాజీస్వామి(విజయనగరం)
తబల : ఎం.సాయిముత్యాలు (గుంటూరు)
ఫ్లూట్ : ఆర్.ఫణితేజ (గుంటూరు)
వీణ : ఏవీ రమణసాయి (విశాఖపట్నం)
వక్తృత్వం : ఎన్.నూరిషాబా (అనంతపురం)
Comments
Please login to add a commentAdd a comment