ఆలంపల్లి, న్యూస్‌లైన్: ప్రపంచం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రగతి దిశగా పయనిస్తోందని, దీనికనుగుణంగానే విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదునుపెట్టేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్. సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టంపల్లిలోని హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ క్యాంపస్ పారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా అడుగుజాడలను అనుసరించి మరింత అభివృద్ధి చెందాల్సిన బాధ్య త మన అందరిపై ఉందన్నారు. ధనార్జనే ధ్యేయం కాకుండా సేవా దృక్పథంతో విద్యా వ్యవస్థల్ని ఏర్పాటు చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశ ప్రగతి కోసం దృఢ సంకల్పంతో పాటుపడాలన్నారు. లక్ష్యసాధన దిశగా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
చదువుకు పేదరికం అడ్డుకాదు ..
చదువుకు పేదరికం ఎలాంటి ఆటంకం కాదని.. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ అన్నారు. విద్యార్థులు దేశ ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎ.హుడా మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే బీజాలను పాఠశాలల్లో నాటాల్సిన అవసరం ఉందన్నారు. సబ్జెక్టుపై పట్టు వచ్చేంత వరకూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలన్నారు. హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థ చైర్మన్ గియాసుద్దీన్ బాబూఖాన్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్ జీఎం లింగ్డో, ఎడ్యుకేట్ ఇండియా ఫండ్ డెరైక్టర్ తస్నీంఉస్మానీ, హైదరాబాద్ జకత్ ట్రస్ట్ సభ్యులు, ఎయిర్ కమాండర్ నసీం అక్తర్, ఖలీల్ అహ్మద్, విద్యావేత్త అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చైనా ఆదర్శంగా ప్రగతి సాధించాలి
Published Mon, Jan 6 2014 1:09 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement