వచ్చే పండగ నాటికి పర్యాటకాభివృద్ధి
సూళ్లూరుపేట: వచ్చే ఫ్లెమింగో ఫెస్టివల్ నాటికి సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాలతో పాటు పులికాట్ సరస్సును అభివృద్ధి చేస్తామని రాష్ర్ట పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2015 పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, సాంకేతిక శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాతలు లాంఛనంగా ప్రారంభించారు.
సూళ్లూరుపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పక్షుల పండగ వేడుకలను ఫ్లెమింగో బెలూన్ ఎగురవేసి ప్రారంభించారు. వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వరుసగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముందుగా జిల్లా కలెక్టర్ జానకి మాట్లాడారు. అ తర్వాత సభకు అధ్యక్షుడుగా స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 2001 నుంచి ప్రతి ఏటా మూడురోజుల పాటు పక్షులు పండగను నిర్వహించేసి ఆ తర్వాత పులికాట్‌ను గాని, నేలపట్టు చెరువును గాని, భీములవారిపాళెం పడవల రేవునుగాని పట్టించుకోవడం లేదన్నారు.
పండగ నిర్వహణతో పాటు ప్రకృతి ప్రసాదించిన రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. సముద్ర ముఖద్వారాలు పూడిపోయి ఫిబ్రవరి నెలకంతా పులికాట్ ఎండిపోయే పరిస్థితికొచ్చిందన్నారు. ఏన్నో వేల కిలోమీటర్లు నుంచి సంతానోత్పత్తి చేసుకోవడానికి వస్తున్న పక్షులకు ఆశ్రయం కల్పించాలంటే ఇటు పులికాట్‌ను, అటు నేలపట్టును అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా భీములవారిపాళెం పడవల రేవులో నిరంతరాయంగా పడవ షికార్ ఉండే విధంగా అభివృద్ధి చేయాలన్నారు.
పర్యాటక పరంగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ది చేయడానికి టూరిజం హబ్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం మంత్రులు పీతల సుజాత, పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ ఎంతో అందమైన విదేశీ వలసపక్షులు వచ్చే ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా చేసి అభివృద్ధి చేయడానికి సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ముఖ్య అతిథి మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ మూడు ప్రాంతాలను పర్యాటకరంగంలో అభివృద్ధి చేసి స్థానికంగా యువతకు ఉపాధి లభించేటట్లు చేస్తానమని చెప్పారు.
టూరిజం హబ్‌గా ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. పులికాట్‌కు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు షార్ సహకారంతో ముఖద్వారాలు పూడిక తీయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పరసా, సుబ్రమణ్యం, బల్లి దుర్గాప్రసాద్, బీద మస్తాన్‌రావు, జేసీ ఇంతియాజ్, డ్వామా పీడీ గౌతమి పాల్గొన్నారు.
సీఎం సహాయనిధికి రూ.10 వేలు విరాళం..
ఏపీ సీఎం సహాయనిధికి మునిరత్నం అనే వ్యక్తి పదివేలు చెక్కును ఫ్లెమింగో ఫెస్టివల్ సభలో జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.అదేవిధంగా నెల్లూరుకు చెందిన కృష్ణారెడ్డి సూళ్లూరుపేట డాట్‌కాం అనే వెబ్‌సైట్‌ను ఐటీ మంత్రి చేతులు మీదుగా ప్రారంభం చేశారు.