ప.గో: 'మీ ఓట్లతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పండి. మీ ఓట్లతోనే మంచి నాయకుడిని ఎన్నుకోండి'. అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. గురువారం భీమవరంలో జరిగిన ప్రజా గర్జన సభలో అశోక్ బాబు ప్రసంగించారు. వర్షంలో సాగిన ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణం రాష్ట్ర రాజకీయ నాయకులేనని ఆయన దుయ్యబట్టారు.
ఎంపీలు దద్దమ్మలు కాబట్టే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని తీవ్రంగా మండిపడ్డారు. 2014 ఎన్నికలు చాలా కీలకమని, ఈ అంశాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుని నాయకుల్ని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై ఆయన మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు విభజనవాదో..? సమైక్యవాదో చెప్పకుండా ప్రజలను గందరగోళంలో నెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన వైఖరిని చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.