
అవసరమైతే సుప్రీంకోర్టుకు : అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: కొద్ది మంది ఎంపీలే సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించారని, మిగతా ఎంపీలు, కేంద్ర మంత్రుల తీరు బాగా లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఎంపీలు రాజీనామాలు చేస్తారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. వారు ఏం చేస్తారో, వారి కార్యాచరణ ఏమిటో స్పష్టంగా తెలియాలి’’ అని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై హైకోర్టు ఈ నెల 16న ఇవ్వనున్న తీర్పు ఎలా ఉన్నా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆయన బుధవారమిక్కడ ఏపీఎన్జీవో కార్యాలయంలో మాట్లాడారు. ‘‘తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. తీర్పు వ చ్చాక సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై జేఏసీ కార్యవర్గ భేటీలో చర్చిస్తాం. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లడానికి వెనకాడం’’ అని చెప్పారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైన తర్వాత రాష్ట్ర రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని, పార్లమెంట్‌లో బిల్లును ఓడించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తెస్తామని, దీనికోసం కార్యాచరణ రూపొందించనున్నామని తెలిపారు. ఈ నెల 16న పూర్తిస్థాయిలో జేఏసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం నిర్వహిస్తే తెలంగాణ న్యాయవాదులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.
14న భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం: సీమాంధ్ర న్యాయవాదులు
హైదరాబాద్ అందరికీ రాజధాని అని, ఇక్కడ ఇరు ప్రాంతాల ప్రజలు తమ వాదనలు వినిపించడానికి అవకాశం ఉంటుందని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈనెల 14న అనంతపురంలో జరిగే జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని బుధవారమిక్కడ చెప్పారు. ‘మీరు నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు మేం అడ్డుకోలేదు. ఇప్పుడు మేం చేస్తున్నప్పుడు మీరు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు’ అని తెలంగాణ న్యాయవాదులకు మోహన్‌రెడ్డి సూచించారు.