సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షడు అశోక్‌బాబు వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు సంతకాలు పోర్జరి చేసి తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాడని ఆరోపించారు. శాఖ పరమైన చర్యల్లో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో 2018వరకు విచారణ చేయకుండా జాప్యం చేశారని మండిపడ్డారు. డిగ్రీ ఉన్నట్టు సర్వీసు రిజిష్టర్‌లో అశోక్ బాబు దొంగ ఎంట్రీ చేశారని తెలిపారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం అశోక్‌బాబు క్లీన్ చీట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఇదే రకమైన అభియోగాలు ఉద్యోగులందరికీ క్లీన్ చిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశోక్‌బాబు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకువచ్చి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారని విమర్శించారు. స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలంటే మూడు నెలల ముందు శాఖకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవని.. బ్రోకర్, భజన సంఘాలు మాత్రమే ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం అపాయింట్‌మెంట్ కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రమే లభిస్తోందని తెలిపారు. విలువలు లేని అశోక్‌బాబును ఏ పార్టీలో చేర్చుకున్న వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
అశోక్‌బాబు వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అమోదం..
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వీఆర్‌ఎస్ గురువారం ఏపీ ప్రభుత్వం అమోదించింది. ప్రస్తుతం సహా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పురుషోత్తం నాయుడు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, త్వరలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. నూతన అధ్యక్షుడిగా ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment