కుప్పకూలిన కోటలు | Ashok Gajapathi Raju Defeat By Bellani Chandrasekhar | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన కోటలు

Published Fri, May 24 2019 5:41 AM | Last Updated on Fri, May 24 2019 5:41 AM

Ashok Gajapathi Raju Defeat By Bellani Chandrasekhar - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనంతో రాజుల కోటలు కుప్పకూలాయి. రాజ వంశాలకు చెందిన పలువురు సామాన్యుల చేతిలో మట్టి కరిచారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన విజయనగర రాజవంశానికి చెందిన అశోకగజపతి రాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అదితి, అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కురుపాం రాజు వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్, బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగిన బొబ్బిలి రాజ వంశానికి చెందిన సుజయకృష్ణ రంగారావు ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో బొబ్బిలి రాజవంశానికి చెందని సుజయకృష్ణ రంగారావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున విజయం సాధించారు. విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య వైరం ఈనాటి కాదు. కానీ సుజయకృష్ణా రంగరావును టీడీపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. మంత్రి వర్గంలో సైతం చేర్చుకుని గనుల శాఖను కట్టబెట్టారు.

చంద్రబాబు సూచనల మేరకు బొబ్బిలి రాజులతో శతాబ్ధాల వైరాన్ని అశోక్‌గజపతిరాజు పక్కన పెట్టారు. బొబ్బిలి, విజయనగర రాజ వంశాలకు చెందిన కుటుంబాలు టీడీపీ తరఫున ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి అశోక్‌గజపతి రాజును టీడీపీ మళ్లీ బరిలోకి దించింది.  బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సుజయకృష్ణ రంగారావు పోటీ చేయగా, అశోక్‌గజపతి రాజు కూతరు అదితి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దిగారు. కురుపాం రాజా వైరిచర్ల ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరి అరకు లోక్‌సభ స్థానం టికెట్‌ సాధించుకున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం ముందు రాజులు నిలబడలేకపోయారు. విజయనగరం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజును వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్‌ చిత్తు చిత్తుగా ఓడించి.. జెయింట్‌ కిల్లర్‌గా అవతరించారు. అరకు లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్లపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గొడ్డేటి మాధవి భారీ మెజార్టీతో విజయం సాధించారు. బొబ్బిలి శాసనసభ స్థానంలో సుజయకృష్ణ రంగారావును శంబంగి అప్పలనాయుడు, విజయనగరం శాసనభ స్థానంలో అదితిని కోలగట్ల వీరభద్రస్వామి మట్టికరిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement