అయ్యో...అశోక్!
అయ్యో...అశోక్!
Published Fri, Mar 14 2014 1:52 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM
పార్టీలో పట్టుకోల్పోతున్న నంబర్-2
చేరికల విషయంలో విలువివ్వని చంద్రబాబు
ఆయనకు తెలియకుండానే నిర్ణయాలు
అభ్యంతరాలను సైతం పట్టించుకోని వైనం
టీడీపీలో విసృ్తత చర్చ
టీడీపీలో నంబర్-2గా కార్యకర్తలు చెప్పుకొంటున్న పూసపాటి అశోక్ గజపతిరాజు పరిస్థితి అయోమయంగా ఉంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘటనలో చంద్రబాబు పక్షాన ఉండి, కీలకపాత్ర పోషించిన ఆయన మాటకు పార్టీలో ఒకప్పుడు ఉన్న విలువ నేడు కనిపించడం లేదు. సొంత జిల్లా విషయంలోనే ఆయనకు ఇష్టంలేకున్నా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. మీసాల గీత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకునే విషయంలో అశోక్ అభిప్రాయానికి చంద్రబాబు విలువ ఇవ్వలేదు. అలాగే టిక్కెట్ల కేటాయింపు, చివరకు అశోక్ పోటీ చేసే విషయంలోనూ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోలేదంటే పార్టీలో పట్టెంతో తేలిపోతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:సీనియర్ టీడీపీ నేతగా, రాష్ట్రపార్టీలో నంబర్-2 స్థానంలో ఉన్న అశోక్ మాట...సొంత జిల్లా విషయంలోనే చెల్లబాటుకాలేదు. శత్రుచర్లను పార్టీలో చేర్చుకునే విషయంలో ఆయన అభిప్రాయాన్ని అసలు పట్టించుకోలేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే పార్టీలో ఆయన స్థానం దిగజారుతున్నట్టు స్పష్టమవుతోంది. మాజీ మంత్రి, సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడైన అశోక్ గజపతిరాజుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విలువివ్వడం లేదు. పార్టీ నిర్ణయాల్లో ఆయన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. కీలక నిర్ణయాల్లో అభిప్రాయం తెలుసుకోలేదన్నది పక్కన పెడితే అశోక్ కాదన్న దానికి భిన్నంగా అధినేత వ్యవహరిస్తున్నారు. కనీసం పట్టించుకోవడం లేదు. తాను చెప్పిందే వేదమని, ఆ మేరకు నడుచుకోవాలని తన చర్యల ద్వారా బాబు చెప్పకనే చెబుతున్నారు. దీంతో అశోక్ గజపతి రాజుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా అన్న అనుమా నం వ్యక్తమవుతోంది. ఈ తరహా నాయకుడు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే రాజకీయం చేయలేమన్న ఆలోచనకొచ్చారో, వేదాంత ధోరణితో మాట్లాడే అశోక్‌తో ముందుకెళ్లడం కష్టమని భావిస్తున్నారో తెలియదు గాని మునుపటి ప్రాధాన్యం ఇవ్వడంలేదన్నది మాత్రం స్పష్టమవుతోంది. జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. దీనిపై పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా చర్చించుకుంటున్నాయి.
విజయనగరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలంతా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కార్యకర్తల మనోభావాల మేరకే నడుచుకునే అశోక్ ఏ రోజూ వారి అభిప్రాయాన్ని కాదనలేదు. నిర్ద్వందంగా తోసిపుచ్చిన దాఖలాల్లేవు. కానీ, అకస్మాత్తుగా అధినేత హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి విజయనగరం ఎంపీగా అశోక్ పోటీ చేస్తారని ప్రకటించేశారు. మనసులో మాట తెలుసుకోకుండానే ఏకపక్షంగా వెల్లడించేశారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీ కేడర్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్న దృష్ట్యా అశోక్‌కు బెస్టాప్ లక్ చెప్పేందుకు ఆయన బంగ్లాకొచ్చిన జిల్లా నాయకులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇంత జరిగినా అశోక్ కనీసం ఖండించలేదు. నియోజకవర్గ కేడర్ వాదన సరైందే అన్నట్టుగా మౌనం దాల్చారు. ఇదంతా అయిందనుకుంటే ఆయనతో సంప్రదింపులు చేయకుండానే మీసాల గీతను పార్టీలోకి ఆహ్వానం పలికారన్న వాదన కూడా ఉంది. అందుకనే గీత రాకపై అశోక్ అసహనంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆమె అభ్యర్థిత్వాన్ని అశోక్ వర్గం వ్యతిరేకిస్తోంది.
అదేదో జరిగిందనుకుంటే అరకు పార్లమెంట్ అభ్యర్థిత్వం విషయంలో కూడా అశోక్ అభిప్రాయాన్ని చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. పార్టీని నమ్ముకుని పదేళ్లుగా డీవీజీ శంకరరావు పనిచేస్తుంటే గడిచిన ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కారణంగాా టిక్కెట్ ఇవ్వలేకపోగా, ఈసారి శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణి కోసం పక్కన పెడుతూ చంద్రబాబు సూచనప్రాయ సంకేతాలు ఇచ్చారు. ఆ మేరకు స్వాతిరాణి నియోజకవర్గంలో పర్యటించడం ప్రారంభించారు. ఇవన్నీ అశోక్‌కు తెలియకుండా జరిగాయన్న వాదనలు ఉన్నాయి. అంతటితో కూడా ఆగలేదు. అశోక్ విభేదిస్తున్నా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, వి.టి.జనార్దన్ థాట్రాజ్‌ను పార్టీలోకి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకుని అశోక్ అసహనం వ్యక్తం చేశారు.
మనసులో మాటను ఉంచుకోలేక శత్రుచర్ల చేరిక విషయమై చంద్రబాబుతో సంప్రదింపులు చేసేందుకు వెళ్లిన జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ వద్ద ఆవేదన వెల్లగక్కారు. గతంలో మన పార్టీ తరఫున ఎంపీగా గెలిచి కాంగ్రెస్ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటేసి మచ్చ తెచ్చారని, అలాంటి వ్యక్తిని ఎలా తీసుకువస్తారని, ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేయమని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. జగదీష్‌తో ఈ మాటలు అన్నప్పుడు అక్కడే ఉన్న పలువురు ఒక్కసారి నివ్వెరపోయారు. శత్రుచర్లపై అశోక్ అసంతృప్తిగా ఉన్నారని పార్టీ నాయకులకు అప్పుడే స్పష్టమైంది. ఇంత జరిగినా శత్రుచర్ల రాక ఆగలేదు. వి.టి.జనార్దన్ థాట్రాజ్‌తో కలిసి వస్తున్నా నిలువరించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ విధంగా అశోక్ అభిప్రాయాన్ని చంద్రబాబు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీన్నిబట్టి అశోక్ మాటకు అధిష్టానం విలువ ఇవ్వడం లేదని, మునుపటి పట్టు లేదని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
Advertisement
Advertisement