అశోక్ నెత్తిన భస్మాసుర హస్తం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆ పార్టీ దయనీయ పరిస్థితుల మధ్య ఎదురీదుతున్న టీడీపీ సీనియర్ నేత, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి పూసపాటి అశోక్‌గజపతిరాజును అంతర్గతంగా దెబ్బకొట్టే యత్నం జరుగుతోంది. విజయనగరంలో కాంగ్రెస్ నుంచి చేరిన ఓ వర్గం అదే పనిలో నిమగ్నమైందని సమాచారం. ఎమ్మెల్యే ఓటు టీడీపీకి వేయాలని, ఎంపీ ఓటు బొత్స ఝాన్సీలక్ష్మికి వేయాలని లోపాయికారీగా విసృ్తత ప్రచారం చేస్తోంది. తమ సామాజిక వర్గాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అక్కసుతో అశోక్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టే యోచనలో ఉన్నారు. మీసాల గీత చేరికను టీడీపీ నేతలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అందుకు అశోక్ గజపతిరాజు కూడా వత్తాసు పలికారన్న వాదన ఉంది. అశోక్‌కు ఇష్టం లేకుండా చేరడం వల్లే టీడీపీ
శ్రేణులు పూర్తిగా సహకరించడం లేదన్న అభిప్రాయం గీత అనుచరుల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే పార్టీలో సహాయ నిరాకరణ ఎదురవుతోందన్న అభద్రతాభావం వారిలో నెలకొంది. దీంతో గీత వర్గమంతా కాంగ్రెస్‌పై ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. లోపాయికారీగా వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అటొక ఓటు- ఇటొక ఓ టు అన్న నినాదంతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. అందుకు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారన్న సాకును చూపుతున్నట్టు భోగట్టా. తమను ఎదగనివ్వకుండా అశోక్ ప్రయత్నిస్తున్నారని, అలాంటప్పుడు ఆయనకెందుకు సహకరించాలనే భావనతో ఆ వర్గం ఉన్నట్టు తెలిసింది.
ఎంతైనా మనమంతా ఒక్కటేనని, పార్టీలు వేరైనా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులమని ప్రచారం చేస్తూ అశోక్ కు దెబ్బకొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే క్రాస్ ఓటింగ్ ప్రచారం మొదలు పెట్టేశారు. ఇప్పుడీ విషయం విజయనగరంలో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ బుద్ధి చూపిస్తున్నారని, వాళ్లకి మొదటి నుంచీ మ్యాచ్ ఫిక్సింగ్ అలవాటేనని టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నట్టు భోగట్టా. ఇష్టం లేకపోయినా నెత్తినెక్కించుకున్నామని, పార్టీ కోసమని మనసు చంపుకుని పనిచేస్తున్నామని, అయినా వారిలో విశ్వా సం లేదని, ఏకు మేకై కూర్చొన్నారని మధనపడుతున్నట్టు తెలిసింది. అదే రీతిలో బుద్ధి చెప్పేందుకు టీడీపీ నాయకులు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇవన్నీ గమనిస్తున్న ఆ రెండు పార్టీల యత్నాలను ప్రజలు ఛీకొడుతున్నారు.