
కావలి: పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఏఎస్సై సుబ్రహ్మణ్యం మద్యం మత్తులో సోమవారం రాత్రి వీరంగం చేశారు. వివరాలు.. కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్లో మూడేళ్ల నుంచి ఏఎస్సైగా సుబ్రహ్మణ్యం విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఈయన దెబ్బకు స్టేషన్లోని ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు హడలిపోయేవారు. సీఐగా రోశయ్య బాధ్యతలు స్వీకరించాక ఇవేవీ కుదరలేదు. ఈ క్రమంలో తుఫాన్ హెచ్చరికలతో కావలి సముద్ర తీరంలో పోలీసులకు ప్రత్యేక డ్యూటీలు వేశారు. ఏఎస్సై సుబ్రహ్మణ్యానికి సైతం డ్యూటీ వేశారు.
ఈ క్రమంలో సీఐ రోశయ్య గదిలోకి వెళ్లి అసభ్య పదజాలంతో దూషించారు. ఇది గమనించిన పక్క గదిలో ఉన్న ఎస్సై గుంజి అంకమ్మ హుటాహుటిన అక్కడికి చేరుకొని ఏఎస్సైను నిలువరించే యత్నం చేశారు. దీంతో ఏఎస్సై ఎస్సై గొంతుపై చేయి వేసి తోసేసి దూషించారు. అక్కడి సిబ్బంది దీనిని తమ సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం సీఐ రోశయ్య ఏఎస్సైను ప్రభుత్వ ఆస్పత్రికి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి బలవంతంగా తీసుకెళ్లారు. ఘటనపై ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, ఏఎస్పీ శరత్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సై గుంజి అంకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఏఎస్సైపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment