ప్రశ్నిస్తే జైలే!
బరితెగించిన అధికార పార్టీ
సమస్యపై ప్రశ్నించాలనుకుంటున్నారా? అక్రమాలపై వేలెత్తి చూపాలని భావిస్తున్నారా? అయితే మీరు జైలుకు వెళ్లేందుకు సిద్ధపడాల్సిందే. జిల్లాలో అధికార టీడీపీ ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. ప్రజల పక్షాన మాట్లాడేందుకు.. వారి కష్టాలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వినిపించేందుకు యత్నించిన భూమాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాను మాట్లాడే మాటలు వినండని గట్టిగా కోరడం రెండు హత్యాయత్నం కేసులు సహా అట్రాసిటీ కేసుకు దారి తీసింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్రమ కేసులతో అధికార టీడీపీ ప్రతిపక్ష పార్టీ నేతల గొంతు నొక్కేందుకు యత్నిస్తోంది. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో గోరంతను కొండంత చేస్తోంది. సైగలు చేసినందుకు హత్యాయత్నం కేసులు ఎలా బనాయించాలో తెలియక పోలీసుల్లోనే సందిగ్ధం నెలకొందంటే పరిస్థితి అర్థమవుతోంది. మొదట తటపటాయించినా.. ఉదయం సంఘటన జరి గితే సాయంత్రానికి పోలీసులు ఒక ‘కారణాన్ని’ కనుగొన్నారు.
తన ప్రసంగం వినాలని... అం దుకోసం కౌన్సిలర్లు బయటకు పోకుండా గేటు వేయమని సైగ చేసినందుకే దాడులు జరిగాయని కథ అల్లారు.అదే సైగతో దాడులకు ప్రోత్స హించాడంటూ హత్యాయత్నం కేసు బనాయించారు. ఇంతటితో ఆగక.. పురపాలక సంఘం కార్యాలయానికి వెలుపల జరిగిన గొడవకు కూడా కార్యాలయంలోని భూమా నాగిరెడ్డే కారణమంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కులం రంగు పులమడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ రూపంలో మూడో కేసు నమోదయింది.
ఇదంతా ఒక ఎత్తయితే.. అధికార పార్టీ బరితెగింపునకు పాల్పడినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు చిన్నపాటి ఘర్షణకు తావివ్వకుండా తమ పంథా చాటుకున్నారు. అధికార పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. ఒకరికొకరు తోడుగా నిలుస్తామని రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నేతలు, అభిమానులు భూమాకు అండగా నిలవడం అధికార పార్టీలో కలవరం రేపుతోంది.
అండగా మేమున్నామని భరోసా : భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి, ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేద్దామని శుక్రవారం రాత్రి పోలీసులు యత్నించారు. అయితే, ఆయన ఇంట్లో లేకపోయే సరికి కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసు స్టేషన్లకు పిలిపించి అర్ధరాత్రి వరకూ విచారణ పేరుతో వేధించారు.
మరికొందరిపై కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో తన వెంట ఉన్న కార్యకర్తలకు ఇబ్బందులు కలగనివ్వకూడదని భావించిన భూమా నాగిరెడ్డి... చివరకు డీఎస్పీ ఆఫీసులో మకాం వేసిన ఎస్పీ ఆకె రవికృష్ణను కలిసి తనపై బనాయించిన అక్రమ కేసులపై ప్రశ్నించారు. కేవలం సైగ చేసినందుకే హత్యాయత్నం కేసులు ఎలా పెడతారని... ఇవన్నీ అక్రమ కేసులని వాదించారు.
రాజకీయ కక్షతో కేసులు పెడితే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కార్యకర్తలకు అండగా నిలిచి.. వారిని ఇబ్బందులు పాలు చేయకూడదని వచ్చిన భూమాకు పార్టీ నేతలు, కార్యకర్తలూ సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, గౌతంరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశాన్ని వాయిదా వేసుకుని నంద్యాలకు తరలివెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివెళ్లి భూమాకు మద్దతు ప్రకటించారు. మీకు అండగా మేమున్నామని భరోసానిచ్చారు.