The opposition party
-
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయండి
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ముందుంటుందని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని కోరారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మిట్టపల్లి రమేష్ శుక్రవారం మ్మెల్యే గోపిరెడ్డిని బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కలిసి పూలదండలు వేసి కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని రమేష్‌కు సూచించారు. రమేష్ మాట్లాడుతూ నమ్మకంతో తనకు పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి, సహకరించిన ఎమ్మెల్యే గోపిరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ నాయకులు కపలవాయి విజయకుమార్, జొన్నలగడ్డ సర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి, ఎమ్మెల్యే పట్టణ అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావులు హాజరయ్యారు. పలువురు పార్టీ నాయకులు మిట్టపల్లి రమేష్‌ను ఆయన స్వగృహంలో కలిసి అభినందించారు. రొంపిచర్ల మండల కన్వీనర్ పిల్లి ఓబుల్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి మద్దిరెడ్డి నరసింహారెడ్డి, సి.వి.రెడ్డి, మూరే రవీంద్రరెడ్డి, ఎన్‌కె.ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర తదితరులు రమేష్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
ప్రశ్నిస్తే జైలే!
బరితెగించిన అధికార పార్టీ సమస్యపై ప్రశ్నించాలనుకుంటున్నారా? అక్రమాలపై వేలెత్తి చూపాలని భావిస్తున్నారా? అయితే మీరు జైలుకు వెళ్లేందుకు సిద్ధపడాల్సిందే. జిల్లాలో అధికార టీడీపీ ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. ప్రజల పక్షాన మాట్లాడేందుకు.. వారి కష్టాలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వినిపించేందుకు యత్నించిన భూమాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాను మాట్లాడే మాటలు వినండని గట్టిగా కోరడం రెండు హత్యాయత్నం కేసులు సహా అట్రాసిటీ కేసుకు దారి తీసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్రమ కేసులతో అధికార టీడీపీ ప్రతిపక్ష పార్టీ నేతల గొంతు నొక్కేందుకు యత్నిస్తోంది. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో గోరంతను కొండంత చేస్తోంది. సైగలు చేసినందుకు హత్యాయత్నం కేసులు ఎలా బనాయించాలో తెలియక పోలీసుల్లోనే సందిగ్ధం నెలకొందంటే పరిస్థితి అర్థమవుతోంది. మొదట తటపటాయించినా.. ఉదయం సంఘటన జరి గితే సాయంత్రానికి పోలీసులు ఒక ‘కారణాన్ని’ కనుగొన్నారు. తన ప్రసంగం వినాలని... అం దుకోసం కౌన్సిలర్లు బయటకు పోకుండా గేటు వేయమని సైగ చేసినందుకే దాడులు జరిగాయని కథ అల్లారు.అదే సైగతో దాడులకు ప్రోత్స హించాడంటూ హత్యాయత్నం కేసు బనాయించారు. ఇంతటితో ఆగక.. పురపాలక సంఘం కార్యాలయానికి వెలుపల జరిగిన గొడవకు కూడా కార్యాలయంలోని భూమా నాగిరెడ్డే కారణమంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కులం రంగు పులమడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ రూపంలో మూడో కేసు నమోదయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. అధికార పార్టీ బరితెగింపునకు పాల్పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు చిన్నపాటి ఘర్షణకు తావివ్వకుండా తమ పంథా చాటుకున్నారు. అధికార పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. ఒకరికొకరు తోడుగా నిలుస్తామని రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నేతలు, అభిమానులు భూమాకు అండగా నిలవడం అధికార పార్టీలో కలవరం రేపుతోంది. అండగా మేమున్నామని భరోసా : భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు బనాయించి, ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేద్దామని శుక్రవారం రాత్రి పోలీసులు యత్నించారు. అయితే, ఆయన ఇంట్లో లేకపోయే సరికి కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ నేతలను పోలీసు స్టేషన్లకు పిలిపించి అర్ధరాత్రి వరకూ విచారణ పేరుతో వేధించారు. మరికొందరిపై కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో తన వెంట ఉన్న కార్యకర్తలకు ఇబ్బందులు కలగనివ్వకూడదని భావించిన భూమా నాగిరెడ్డి... చివరకు డీఎస్పీ ఆఫీసులో మకాం వేసిన ఎస్పీ ఆకె రవికృష్ణను కలిసి తనపై బనాయించిన అక్రమ కేసులపై ప్రశ్నించారు. కేవలం సైగ చేసినందుకే హత్యాయత్నం కేసులు ఎలా పెడతారని... ఇవన్నీ అక్రమ కేసులని వాదించారు. రాజకీయ కక్షతో కేసులు పెడితే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కార్యకర్తలకు అండగా నిలిచి.. వారిని ఇబ్బందులు పాలు చేయకూడదని వచ్చిన భూమాకు పార్టీ నేతలు, కార్యకర్తలూ సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, గౌతంరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశాన్ని వాయిదా వేసుకుని నంద్యాలకు తరలివెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివెళ్లి భూమాకు మద్దతు ప్రకటించారు. మీకు అండగా మేమున్నామని భరోసానిచ్చారు. -
ఇద్దరు విపక్ష సభ్యుల సస్పెన్షన్
► ఆర్.శివప్రసాదరెడ్డి, మణిగాంధీపై వేటు ► బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ ► తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి యనమల ► మూజువాణిఓటుతో ఆమోదం ► స్పీకర్ పోడియం వద్ద నిలబడి వైఎస్సార్సీపీ సభ్యుల నిరసన ► విపక్ష నేతకు మైక్ ఇచ్చినట్లే ఇచ్చి కట్ చేసిన స్పీకర్ ► వెల్‌లో నిలబడి నినాదాలు చేసిన విపక్ష సభ్యులు ► గందరగోళ పరిస్థితుల మధ్య సభ నేటికి వాయిదా హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర ఆరోపణలు, సవాళ్లతో బడ్జెట్ సమావేశాల్లో ఏడో రోజైన మంగళవారం కూడా అసెంబ్లీ నల్లబ్యాడ్జీలు, బైఠాయింపులు, నినాదాలు, అరుపులు కేకలతో దద్దరిల్లింది. బడ్జెట్‌పై చర్చను ముగించేందుకు తమ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసిన డిమాండ్‌ను స్పీకర్ కోడెల శివప్రసాదరరావు తోసిపుచ్చడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా జరిగిన గందరగోళంలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేశారు. ఇందుకు విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, మణిగాంధీని బాధ్యులను చేస్తూ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. దీనిపై మాట్లాడుతున్న జగన్‌కు మైక్ కట్ చేశారు. తమ నేతకు మైక్ ఇవ్వాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో 1.28 గంటలకు సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మంగళవారం 12.15గంటలకు సభ ప్రా రంభమైన వెంటనే.. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ దశలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేసినట్టు సిబ్బంది గుర్తిం చారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల ఉదయం 10.51 గంటల సమయంలో సభను రెండోసారి 15 నిమిషాలపాటు వాయిదా వేశా రు. అనంతరం సభ ప్రారంభం కాగా విపక్ష సభ్యులు తమ నిరసనను తెలియజేస్తున్న క్రమంలోనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘వైఎస్సార్సీపీ సభ్యులు రోజూ వెల్‌లోకి వస్తున్నారు. ఈరోజు స్పీకర్ మీద దాడి చేశారు. మైక్ విరగ్గొట్టారు. సభ ఆస్తులు విరగ్గొట్టిన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని తీర్మానం ప్రతిపాదించారు. సభ మూజు వాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందిందని, విపక్ష సభ్యులు ఆర్.శివప్రసాదరెడ్డి, ఎం.మణిగాంధీని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ కోరారు. ఆ వెంటనే టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. స్పీకర్ చర్యలకునిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. తమకు న్యాయం చేయాలని, విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తున్న సమయంలోనే మంత్రులు రావెల కిషోర్‌బాబు, పీతల సుజాత, టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడారు. వారు తీవ్ర పదజాలం, అన్‌పార్లమెంటరీ పదాలతో ప్రసంగాలు సాగించినా.. స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో 12.35 గంటలకు సభను 15 నిమిషాల పాటు వాయిదావేశారు. 1.15 గంటల కు సభ తిరిగి ప్రారంభమైంది. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘‘సస్పెన్షన్‌కు తావిచ్చే నిర్ణయాలు జరిగాయి. గత రెండు, మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరును దయచేసి గమనించండి. శాంతిభద్రతల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో... అధికార పక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామని చెబుతున్నా.. నిరసన తెలపడానికి ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వలేదు...’’ అని జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. సభను తప్పుదోవ పట్టించవద్దంటూ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పోడియం వద్ద నిలబడి తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండగానే.. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మం త్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ అవకాశం ఇచ్చా రు. తర్వాత కూడా విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో 1.28 గంటలకు సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ముగింపు వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వండి... ప్రశ్నోత్తరాల అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావును కోరారు. దీ నికి వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జగన్ ప్రారంభించిన చర్చ పూర్తి కాలేదని, మరో పది నిమిషాలు సమయమిస్తే దాన్ని ముగిస్తారని కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. బాధ్యత కలిగిన తమ నాయకుడు తన ప్రసంగాన్ని ముగించేం దుకు అవకాశం ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంలో స్పీకర్‌కు వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య వాగ్వా దం జరిగింది. ‘‘మీ నాయకుడు జగన్ గంటా 55 నిమిషాలు మాట్లాడారు. అందులో 21 నిమిషాల సమయం వృథా అయింది. అది పోయినా గంటా 34 నిమిషాలు మాట్లాడినట్టు. ప్రతిపక్షానికి ఇచ్చిన సమయం గంటన్నర. ఆ సమయం లో పూర్తి చేయలేకపోయారు. ముగించేందుకు పది నిమిషాల సమయం కావాలని పొద్దున నన్ను కలిసిన మీ పార్టీ నేతలు కోరారు. దానికి నేను సరే అన్నా’’ అని స్పీకర్ చెప్పారు. ప్రజాస్వామ్యం నిజంగా ఉందా?: జగన్ స్పీకర్ వ్యాఖ్యలపై జగన్మోహన్రెడ్డి మాట్లా డుతూ ‘‘బడ్జెట్ై పె ప్రతిపక్షం మాట్లాడేందుకు గంటన్నర సమయం ఇస్తారా? ప్రజాస్వామ్యం నిజంగా ఉందా? నేను మాట్లాడుతున్నప్పుడు గంటా ఆరు నిమిషాల పాటు అంతరాయం కల్పించారు. అందుకు మీరు బాధ్యత వహించాలి’’ అని చెప్పారు. ఇంతలో శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు లేచి విపక్షంపై విరుచుకుపడ్డారు. బీ ఏసీలో నిర్ణయం మేరకే సమయం కేటాయిస్తే తిరిగి మళ్లీ కావాలనడం తమ అవకాశాన్ని అ డ్డుకోవడమేనని ఎదురుదాడికి దిగారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత సమయం ఉం టే విపక్షనేతకు ఇవ్వాలే తప్ప ముందు ఇవ్వ డం తగదన్నారు. దీనికి స్పీకర్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యు లు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి అభ్యంత రం చెప్పారు. తమకు న్యాయం కావాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. తెలుగుదేశం సభ్యులు కూడా తమ సీట్లలో నుంచి లేచి నిలబడి ప్రతిపక్ష సభ్యులతో వాగ్వావాదానికి దిగారు. ఇవేవీ పట్టిం చుకోని స్పీకర్.. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేం ద్రను మాట్లాడమని కోరారు. ఓవైపు గందరగోళం, మరోవైపు నిరసన ధ్వనుల మధ్య నరేంద్ర విపక్షంపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వా త మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కాగిత వెంకట్రావ్, యనమల, కాలువ శ్రీనివాసులు కూడా ప్రతిపక్ష సభ్యుల నిరసనను తప్పుబట్టారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే వారిని సస్పెండ్ చేసైనా చర్చ కొనసాగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. మా సమయం తీసుకోండి: బీజేపీ బీజేపీ సభ్యుడు విష్ణుకుమారరాజు మాట్లాడుతూ తమకిచ్చిన సమయంలో పది నిమిషాలను వైఎస్సార్సీపీకి ఇచ్చయినా సభను సజావుగా నడిపించాలని స్పీకర్‌ను కోరా రు. ఇది సమ్మతమేనని స్పీకర్ చెప్పారు. ఈ దశలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేసినట్టు సిబ్బంది గుర్తించి స్పీకర్ దృ ష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం గందరగోళం మధ్య కోడెల ఉదయం 10.51 గంటలకు రెండోసారి 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమయ్యాక మంత్రి యనమల రా మకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, మణిగాంధీని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. -
ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు ఖాయం: హరీశ్
రామచంద్రాపురం: మెదక్ ఉపఎన్నికలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.మెదక్ ఉపఎన్నికలో నిలబెట్టేందుకు ఇతర పార్టీ లకు అభ్యర్థులే దొరకడం లేదని చెప్పారు. ఉప ఎన్నికలో తమ పార్టీ విజయం ఖాయమన్నారు. -
యథేచ్ఛగా హత్యాకాండ
చంద్రబాబు సీఎం అయిన 3 నెలల్లోనే టీడీపీ చేతిలో.. 11 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్య విపక్షం లేకుండాచేసే యత్నాలు అధికారపక్షం కొమ్ము కాస్తున్న పోలీసులు వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కరువు టీడీపీ కార్యకర్తలపై కేసులు లేవు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరిలో ఏడుగురి హత్య అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, విజయనగరం జిల్లాల్లో నలుగురి హత్య తాజాగా నరసరావుపేట నియోజకవర్గంలో ఆసుపత్రివద్ద దాడి రాష్ట్రంలో అధికార పక్షం బరితెగించింది... ప్రతిపక్ష పార్టీపై కక్ష పూనింది... ప్రశ్నించేవారే లేకుండా చేయాలనుకుంది... రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతోంది... అధికారపార్టీ నేతలు గ్రామస్థాయిలో కక్షలను ఎగదోస్తుండగా, దాడి చేసినవారిపై కేసులు పెట్టకుండా పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. దీంతో అధికారపార్టీ అరాచకాలకు, ఆగడాలకు అడ్డూఆపూ లేకుండా పోయింది. గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్యచేశారు. పోలీసుల దాష్టీకానికి మరో కార్యకర్త గుండెపగిలి మరణించాడు. అత్యధికంగా ప్రకాశంజిల్లాలో ముగ్గురిని కిరాతకంగా చంపేశారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరినీ టీడీపీ శ్రేణులు పొట్టన పెట్టుకున్నాయి. సాక్షి నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన ఈ మూడు నెలల్లోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 11 మంది కార్యకర్తలు, స్థానిక నాయకుల్ని టీడీపీ శ్రేణులు పొట్టనబెట్టుకున్నాయి. మరో సంఘటనలో అధికారానికి వత్తాసు పలికిన పోలీసుల దాష్టీకానికి మరో కార్యకర్త గుండెపగిలి మరణించాడు. ఎన్నికలకు ముందే టీడీపీ శ్రేణులు జరిపిన దాడిలో గాయపడిన మరో కార్యకర్త... ఈ మధ్యే మరణించాడు. ఈ హత్యలది ఒక్కో చోట ఒకో తీరు. ఫలితం... నిండు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. వారిపై ఆధారపడ్డవారు దిక్కులేని వాళ్లయ్యారు. ఆ సంఘటనల తీరును ఒక్కసారి చూస్తే... గుంటూరు జిల్లా వినుకొండ మండలం నీలగంగవరం గ్రామానికి చెందిన రావులపల్లి పెదమునయ్యను (40) మే 21న దాడిచేసి హతమార్చారు. టీడీపీకి చెందిన రావెల శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురు స్థానిక నాయకులు ఆయనపై కర్రలతో దాడిచేశారు. అయినా తను బతికాడని భావించారో ఏమో... మరుసటిరోజు మధ్యాహ్నం మరోసారి కర్రలతో దాడిచేసి ప్రాణం తీశారు. వేమూరు మండలంలోని పెరవలిపాలెం గ్రామంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన ఇరువర్గాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త పెరవలి ప్రభాకరరావు (53) మృతిచెందారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదాలు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన పుసులూరి సాంబశివరావు, సర్పంచ్‌గా పోటీ చేసిన ఓడిన పెరవలి ప్రభాకరరావు వర్గీయుల మధ్య మే నెల 26వ తేదీన దాడికి దారితీశాయి. ఈ దాడిలో ప్రభాకరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ జూన్ 9వ తేదీన ఆయన మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో... ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెద అలవాలపాడులో ఒక రేషన్ దుకాణం వివాదంతో ఎలాంటి సంబంధంలేని వైఎస్సార్సీపీ నేత గోగాడి సింగయ్య (48)పై కేసుపెట్టారు. తనపై ఎందుకు కేసు పెట్టారని అడిగేందుకు వెళ్లిన సింగయ్యపై జూన్ 12న తీవ్రంగా కర్రలతో, రాళ్లతో కొట్టి గాయపరచగా ఆయన చికిత్స పొందుతూ మర్నాడు మృతిచెందారు. దాడిలో సింగయ్య కుమారుడు సురేష్, అక్క కంచర్ల తిరుపతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ హత్యలకు పోలీసుల వత్తాసు తూర్పుగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల దాడుల్లో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు బలయ్యారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు మే 7న సీతానగరం మండలం ఇనగంటివారి పేటలో టీడీపీ నాయకుడు, ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడు మొగలపు వెంకటమోహన్ వైఎస్సార్సీపీ కార్యకర్త నెర్ల దశయ్య (75) గుండెలపై కాలితో తన్నాడు. దీంతో దశయ్య మరణించినప్పటికీ పోలీసులు వెంకటమోహన్పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి అధికార పార్టీకి కొమ్ముకాశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ పార్టీకి చెందిన గుర్రం చినవీరబాబు, యాడాల శివ, గారబోయిన పుష్ప, గుర్రం శ్రీను మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త వేపూరి వెంకటేశ్వరరావుపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు నాలుగు రోజులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం 11వ తేదీన చనిపోయాడు. ఇక కృష్ణాజిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో చెలరేగిన తెలుగు తమ్ముళ్ల దాష్టీకాలకు ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు బలయ్యారు. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో స్థానిక వైఎస్సార్సీపీ నేత ఆలోకం కృష్ణారావు (59) ఇంటిపై ఆగస్టు పదో తేదీ రాత్రి తెలుగు యువత నాయకులు దాడిచేశారు. ఆరోజు రాత్రి 8:30 గంటల సమయంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్సీపీ కార్యకర్త గుదే సెల్వరాజుపై దాడిచేసి తల పగులగొట్టారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సెల్వరాజును అడ్డుకున్నారు. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, తమ పార్టీ నాయకులకు భద్రత కల్పించాలని సర్పంచి గుదే రంగారావు ఫోన్ చేసినా కంచికచర్ల ఎస్ఐ దుర్గాప్రసాద్ పట్టించుకోలేదు. పోలీసులు తమకే కొమ్ముకాయడంతో తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న కృష్ణారావును అర్ధరాత్రి రోడ్డుపైకి లాక్కొచ్చి, రెక్కలు విరగదీసి, ఇనుపరాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై కూడా దాడిచేశారు. అయితే ఇంటి గేట్‌కు తాళం వేసి ఉండటంతో ఆయన తప్పించుకోగలిగారు. కృష్ణారావు హత్య గురించి రంగారావు సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదు. గొట్టుముక్కలలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ వారిపై వందసార్లు దాడులు పాల్పడినా పోలీసులు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు చేయడం, ఎస్ఐ వైఖరిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పోలీసుల ధోరణికి అద్దం పడుతుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో మరింత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అవనిగడ్డ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలుపొందారు. దీంతో ఆయన అనుచరులు మే 16న కోడూరు మండలం వి.కొత్తపల్లి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ కార్యకర్త రేపల్లె సురేష్ (30) ఇంటిముందు బాణసంచా కాల్చారు. ఇంట్లో పిల్లలున్నారు బాణసంచా కాల్చవద్దని సురేష్ అడ్డుచెప్పారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు సురేష్ తలపై బాంబు పెట్టి కాల్చడంతో సురేష్ తలపగిలి అక్కడికక్కడే మృతిచెందారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బురిడి సన్యాసిరావు (32)ను జూన్ 19న చంపావతి నదిలోని మొయిద కాజ్వేవద్ద దారుణంగా హత్యచేశారు. కానీ పోలీసులు అనుమానితులను ఒకసారి స్టేషన్‌కు పిలిపించి వదిలేశారు. రాయలసీమలో ముగ్గురి హత్య రాయలసీమలో అత్యధిక స్థానాల్లో పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నికల అనంతరం హత్యాకాండకు తెరలేపారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూర.ులో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎంపీటీసీ సూర.్యప్రకాశం శెట్టిని(58) జేసీ వర్గీయులు జూలై3 అర్ధరాత్రి సమయంలో దార.ుణంగా హత్య చేశార.ు. గ్రామంలో బ్రాందీషాపుకు ఇల్లు అద్దెకు ఇవ్వడమే ఇతను చేసిన నేరం. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త బలిజ బంగారురెడ్డి (70)ని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మే 21న దారుణంగా హత్య చేసి డోన్ పట్టణ శివార్లలోని పాతబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద పడేశారు. బంగారురెడ్డి కృషితో గ్రామంలో వైఎస్సార్సీపీకి 96 ఓట్లు మెజారిటీ రావడమే ఈ హత్యకు కారణం. ఈ హత్యవెనుక రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కేఈ ప్రతాప్ హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇక వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నాయకులు కిరాయి హంతకులను పురమాయించారు. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం మడూరు గ్రామ మాజీ సర్పంచ్ మర్రిబోయిన ఓబులేసును దారుణంగా హత్య చేశారు. గ్రామంలో అన్నింటికి అడ్డంకులుగా మారారనే కారణంతో టీడీపీ నేతలు తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన నలుగురు కిరాయిహంతకులను ఇందుకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు నుంచే... ప్రకాశంజిల్లా గిద్దలూరు పోలీసుల అమానుష ప్రవర్తనతో వైఎస్సార్సీపీ నేత, ప్రాధమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు అయిన వైజా భాస్కరరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఒక అపార్టుమెంట్లో పార్కింగ్‌కు సంబంధించి జూన్ 30వ తేదీ హీరోహోండా షోరూం యజమాని ఈమని సుబ్బారావుకు, డాక్టర్ హరనాధరెడ్డికి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు రాత్రిపూట ఇంటికి వచ్చి హరనాధరెడ్డిని అరెస్టుచేసి తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న అపార్టుమెంట్ ఓనర్, వైఎస్సార్సీపీ నాయకులైన వైజా భాస్కరరెడ్డి స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అతనిని నెట్టివేశాడు. పోలీసులు నెట్టివేయడం అవమానంగా భావించిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. మరోవైపు ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేశారన్న కోపంతో టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో మర్రిపూడి మండలం కెళ్లంపల్లి పంచాయతీ అగ్రహారం గ్రామానికి చెందిన తేలుకుట్ల వెంకయ్య (65) కన్నుమూశారు. తాజాగా సోమవారం గుంటూరుజిల్లా నరసరావుపేట మండటం యల్లమంద గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. గడచిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ను అడ్డుకున్నారనే కక్షతో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ముప్పాళ్ళ కృష్ణారావు, ముప్పాళ్ళ లక్ష్మయ్య, చల్లా వెంకటేశ్వర్లు తమ బంధువైన ములసా వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగే శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఉప్పుటూరి శంకరయ్య అనే టీడీపీ నాయకుని ఇంటి వద్దకు వెళ్ళగానే దాడి చేశారు. శంకరయ్యతో పాటు పాములపాటి వాసు, కడియాల శ్రీను, మానుకొండ నిరంజన్, మానుకొండ రామకృష్ణ, చుండూరి రాజు, మానుకొండ కోటయ్య, కొల్లా కిషోర్‌లు మూకుమ్మడిగా వారిని అడ్డుకుని పరుషపదజాలంతో దూషించారు. మారణాయుధాలతో దాడి చేశారు. కృష్ణారావు కాలిపై గొడ్డలితో నరికారు. ఇనుపరాడ్లతో ఇష్టారాజ్యంగా కొట్టారు. దాడిలో కృష్ణారావుకు తీవ్రగాయాలు కాగా ముప్పాళ్ల లక్ష్మయ్య, చల్లా వెంకటేశ్వర్లుకు స్వల్పగాయాలయ్యాయి. టీడీపీ దాడుల్లో హతమైన వారు వీరే.. 1. పెద మునయ్య (వినుకొండ) గుంటూరు 2. పెరవలి ప్రభాకరరావు (వేమూరు) గుంటూరు 3. గోగాడి సింగయ్య (కనిగిరి) ప్రకాశం 4. నెర్ల దశయ్య (సీతానగరం) తూర్పు గోదావరి 5. వేపూరి వెంకటేశ్వరరావు (గోకవరం) తూ.గో. 6. ఆలోకం కృష్ణారావు (కంచికచర్ల) కృష్ణా 7. రేపల్లె సురేశ్ (అవనిగడ్డ) కృష్ణా 8. బురిడె సన్యాసిరావు (నెల్లిమర్ల) విజయనగరం 9. బలిజ బంగారు రెడ్డి (బేతంచెర్ల) కర్నూలు 10. సూర్య ప్రకాశం శెట్టి (శింగనమల) అనంతపురం 11. మర్రిబోయిన ఓబులేసు (చాపాడు) కడప 12. తేలుకుట్ల వెంకయ్య (మర్రిపూడి) ప్రకాశం 13. వైజా భాస్కరరెడ్డి (గిద్దలూరు) ప్రకాశం వెంకయ్య ఎన్నికలకు ముందు టీడీపీ దాడిలో గాయపడి ఇటీవల మరణించారు. భాస్కరరెడ్డి పోలీసులు చేసిన అవమానాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందారు.