హైదరాబాద్ : శాసనసభ రెండోవిడత సమావేశాలు ప్రారంభం అయిన మూడు నిమిషాలకే అరగంటపాటు వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రారంభం కాగానే రాష్ట్ర విభజనను తిరస్కరిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తెలంగాణ, సమైక్య నినాదాలతో ఆందోళనకు దిగారు.
సభ సజావుగా జరగడానికి సహకరించాల్సిందిగా స్పీకర్ సభ్యులను కోరారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు తమ ఆందోళనలను కొనసాగించారు. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించగా వైఎస్ఆర్ సీపీ సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ప్రారంభమైన మూడు నిమిషాలకే అసెంబ్లీ అరగంటపాటు వాయిదా పడింది. కాగా రెండవ దఫా శీతాకాల సమావేశాలు తొలిరోజే వాడివేడిగా.... నినాదాలు, నిరసన మధ్య ప్రారంభమయ్యాయి.
వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తిస్తూ నిరసనలు తెలిపారు. దాంతో అసెంబ్లీ మరోసారి గంట పాటు వాయిదా పడింది.