సాక్షి ప్రతినిధి, తిరుపతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ 18న ప్రారంభమై.. శనివారం ముగిశాయి. శాసనసభ సమావేశాలు 15 రోజులుగా, 60.37 గంటల పాటు జరిగాయి. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో 117 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ప్రజాసమస్యలపై సంధించిన 117 ప్రశ్నాస్త్రాల్లో అధికశాతం విపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సంధించినవే కావడం గమనార్హం. అందులోనూ మన జిల్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అత్యధికంగా ప్రశ్నాస్త్రాలను సంధించారు.
వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాసమస్యలే ప్రశ్నాస్త్రాలుగా ప్రభుత్వా న్ని నిలదీశారు. ఎన్నికల్లో వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. నాలుగు గంటలు కూడా కరెంట్‌ను సరఫరా చేయకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే అంశంపై పెద్దిరెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జతకలిశారు. వ్యవసాయానికి కనీసం ఏడు గంటలు కూడా విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
వర్షా కాలంలోనే విద్యుత్ పరిస్థితి ఇలా ఉంటే.. వేసవిలో రైతులను మరింత ఇబ్బంది పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టింది. ఏడు గంటల విద్యుత్‌ను సేద్యానికి సరఫరా చేసేం దుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం నుంచి హామీని రాబట్టడంలో పెద్దిరెడ్డి, చెవిరెడ్డి సఫలమయ్యారు. చె రకు రైతులకు టన్నుకు రూ.మూడు వందల చొప్పున ప్రభుత్వం పోత్సాహకం చెల్లించకపోవడంపై శాసనసభలో చెవిరెడ్డి నిలదీశారు. జిల్లాలో శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం, చిత్తూరు సహకార చక్కె ర కర్మారాలకు చెరుకును సరఫరా చేసిన 27 వేల మంది రైతులకు రూ.18.50 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందు కు ఆర్థికమంత్రి సమాధానమిస్తూ బకాయిలను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
వైఎస్సార్‌సీపీ పోరుబాట
తిరుపతిలో స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి భవన వి వాదం.. జూనియర్ డాక్టర్ల ఆందోళనపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. రాయలసీమలో మెటర్నిటీ ఆస్పత్రి కోసం నిర్మించిన 300 పడకల భవనాన్ని ఆ ఆస్పత్రికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రోజా వాదనతో ఏకీభవించిన ప్రభుత్వం.. 300 పడకల భవనాన్ని మెటర్నిటీ ఆస్పత్రికే కేటాయించేందుకు అంగీకరించింది. ఎన్నికల్లో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు రూ.లక్ష వంతున కార్ఫస్ ఫండ్ ఇస్తామంటూ సీఎం చంద్రబాబు వంచిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలను నమ్మించి నట్టేట ముంచారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.
తమ మనోభిప్రాయాలను ప్రతిబింబించేలా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా శాసనసభలో వ్యవహరించడంపై మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తల వేతనాల పెంచుతామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.
చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీ అమలుకు వీలుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓటు దాటాక హామీలను తగలేస్తున్న సీఎం చంద్రబాబుపై రోజా విరుచుకుపడటం అధికార పక్షాన్ని ఇబ్బందులకు గురిచేసింది. ఆశా వర్కర్ల వేతనాలను చెల్లించకపోవడం.. వేతనాలను పెంచకపోవడంపై పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, డాక్టర్లు, మౌలిక సదుపాయాల కొరత వల్ల నిరుపేద రోగులు ఇబ్బందులు పడుతుండటాన్ని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సభలో ప్రస్తావించారు. నిరుపేద రోగులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వ ఆస్పతుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం
తిరుమల శ్రీవారికి భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతమవుతుండటాన్ని సభలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డిలు ప్రస్తావించారు. టీటీడీకీ విస్తృతమైన యంత్రాంగం ఉన్నా ఆస్తులను పరిరక్షించకపోవడంలో విఫలమవడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు దేవాదాయశాఖ మంత్రి ిపీ.మాణిక్యాలరావు సమాధానం ఇస్తూ.. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతమైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ.. సభా సంఘం వేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించలేదు.
ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాల లేమి వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమానికి మంత్రి పదవిని ఇవ్వడంతో రాష్ట్రంలో విద్యారంగంలో ప్రైవేటు మాఫియా ప్రజలను దోచుకుంటోందని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. ప్రైవేటు మాఫియాపై చర్యలు తీసుకుని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న చెవిరెడ్డి డిమాండ్‌ను ఉపాధ్యయవర్గాలు స్వాగతిస్తున్నాయి.
ఇలా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సభలో ప్రశ్నాస్త్రాలను సంధించారు. బడ్జెట్ చర్చల్లోనూ.. స్వల్ఫకాలిక చర్చల్లోనూ.. ప్రశ్నోత్తరాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొన్నారు. కానీ.. జిల్లాలో ఆరు శాసనసభ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. సీఎం చంద్రబాబు, అటవీశాఖ మంత్రి బొజ్జల మినహా సభలో తక్కిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా సభలో నోరు తెరిచేందుకు కూడా సాహసించకపోవడం గమనార్హం.
ప్రతిపక్షం..ప్రజాపక్షం
Published Sun, Sep 7 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM