చౌదరి ధనలక్ష్మి... జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని చేపట్టడంతో గ్రామస్థాయి నుంచి ఒక్కసారిగా జిల్లా స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆమె విద్యార్హత పదో తరగతి లోపే! అందుకే జెడ్పీలో అధికారిక, అనధికారిక రాజకీయ వ్యవహారాలన్నీ ఆమె భర్త చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) కనుసన్నల్లోనే సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి!
ఆమె ఒక్కరే కాదు జిల్లాలో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్పటికీ వారి వెనుక షాడో నాయకులు వ్యవహారాలు నడిపిస్తున్నారు. కార్యాలయాల్లో కుర్చీల్లో కూర్చొని సెటిల్‌మెంట్‌లు చేస్తున్నవారూ ఉన్నారు. దీనికి కుటుంబ, సామాజిక, ఆర్థిక కారణాలే కాదు విద్య కూడా ప్రధాన కారణమవుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక మార్గం తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇకపై పోటీ చేయాలంటే పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే జిల్లాలో సగానికి సగం మంది ప్రజాప్రతినిధులకు మళ్లీ పోటీ చేసే అవకాశం లేకపోయినా, వారి వెనుకనున్న షాడో నేతలకు మాత్రం చెక్ పడుతుందనడంలో సందేహం లేదు.
సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: జిల్లాలో 1099 మంది సర్పంచులు, 675 మంది ఎంపీటీసీ సభ్యులు, 38 మంది జెడ్పీటీసీలు, వివిధ మున్సిపాలిటీల్లో 91 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో చాలామంది విద్యార్హత పదో తరగతి లోపే. దీంతో అధికారిక వ్యవహారాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు, నియమ నిబంధనలపై పూర్తిగా అవగాహన చేసుకోవడం వారికి కాస్త కష్టమైన విషయమే. దీన్ని ఆసరాగా తీసుకొని కుటుంబసభ్యులో, లేదంటే స్థానిక నాయకులో షాడో నేతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అందుకే కేంద్ర ప్రభుత్వం నియమించిన లోక్‌సభ అంచనాల కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇకపై స్థానిక సంస్థలకు పోటీ చేసేవారికి కనీస విద్యార్హత ఉండాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈమేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి కొన్ని ప్రతిపాదనలతో నివేదిక సిద్ధమైంది. దీనిపై కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడనుంది. ఈ ప్రకారం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ సభ్యులు కావాలంటే పదో తరగతి చదవి ఉండాల్సిందే.
మిశ్రమ స్పందనలు...
గ్రామస్థాయిలో ఈ నిబంధనపై మిశ్రమ స్పందన ఉంది. కానీ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ స్థాయి నాయకులకు మాత్రం ఇది మిండుగు పడని విషయమే. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల అధికారాలు ఇప్పటికే నామమాత్రమైపోయాయి. జన్మభూమి కమిటీల పేరుతో పూర్తిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే అధికారం చెలాయిస్తున్నారు. సర్పంచ్‌కు ఉండే చెక్‌పవర్‌ను కూడా వారే దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ ఆ కమిటీలతో ఆధిపత్యం. అదే ఉన్నత విద్యార్హత ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారంలో ఉన్నచోట మాత్రం ఆ కమిటీల ఆటలు సాగట్లేదు. కొంతమంది న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.
స్థానిక సంస్థల్లో విద్యార్హత ఇలా..
∙ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి సిగడాంలు వీటిలో 115 పంచాయితీలు ఉండగా, వీటిలో 41 మంది సర్పంచ్‌లు పదోతరగతి లోపు చదువు ఉన్నవరే ఉన్నారు. అలాగే ఎంపిటీసీల విషయంలోనూ అదే తీరు 87 మంది ఉండగా వీరిలో 45 మంది పదోతరగతి లోపు చదువు గలవారే,∙ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 95 మంది సర్పంచ్‌లలో 48 మందికి పది తరగతి లోపుచదువు కలవారే, ఎంపీటీసీ సభ్యులు మొత్తంగా 79 మంది ఉండగా 41 మంది కనీస అర్హత లేని వారే,∙నరసన్నపేట నియోజకవర్గలో 105 మంది సర్పంచ్‌లు ఉండగా వీరిలో 54 మందికి కనీస విద్యార్హతలు లేవు. ఎంపీటీసీలు 58 మంది ఉండగా వీరిలో 33 మందికి పదో తరగతి పాస్ కాలేదు.
∙పాలకొండ నియోజకవర్గంలో మొత్తం సర్పంచ్‌లు 78 మంది ఉండగా, వీరిలో 36 మంది పదో తరగతి పాస్‌కాలేదు. ఎంపీటీసీలు 38 మంది ఉండగా, 25 మంది పదోతరగతి లోపే చదువులు ఆపివేశారు. ∙టెక్కలి నియోజకవర్గంలో 136 మంది సర్పంచ్‌లకు గాను 20 మంది పదోతరగతి పాస్‌కాలేదు. 77 మంది ఎంపీటీసీలకు గాను 52 మంది పదిలోపే చదువులు నిలిపివేశారు.∙రాజాం నియోజకవర్గంలో 120 మంది సర్పంచ్‌ల్లో 64 మందికి పదో తరగతి అర్హత లేదు. ఎంపీటీసీలు 67 మంది ఉండగా, వీరిలో 33 మందికి కనీస విద్యార్హతలు లేవు.
షాడో నేతలకు.. సిక్కొచ్చి పడింది!
Published Sun, Jun 4 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
Advertisement