MPTS
-
షాడో నేతలకు.. సిక్కొచ్చి పడింది!
చౌదరి ధనలక్ష్మి... జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని చేపట్టడంతో గ్రామస్థాయి నుంచి ఒక్కసారిగా జిల్లా స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆమె విద్యార్హత పదో తరగతి లోపే! అందుకే జెడ్పీలో అధికారిక, అనధికారిక రాజకీయ వ్యవహారాలన్నీ ఆమె భర్త చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) కనుసన్నల్లోనే సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి! ఆమె ఒక్కరే కాదు జిల్లాలో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్పటికీ వారి వెనుక షాడో నాయకులు వ్యవహారాలు నడిపిస్తున్నారు. కార్యాలయాల్లో కుర్చీల్లో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తున్నవారూ ఉన్నారు. దీనికి కుటుంబ, సామాజిక, ఆర్థిక కారణాలే కాదు విద్య కూడా ప్రధాన కారణమవుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక మార్గం తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇకపై పోటీ చేయాలంటే పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే జిల్లాలో సగానికి సగం మంది ప్రజాప్రతినిధులకు మళ్లీ పోటీ చేసే అవకాశం లేకపోయినా, వారి వెనుకనున్న షాడో నేతలకు మాత్రం చెక్ పడుతుందనడంలో సందేహం లేదు. సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: జిల్లాలో 1099 మంది సర్పంచులు, 675 మంది ఎంపీటీసీ సభ్యులు, 38 మంది జెడ్పీటీసీలు, వివిధ మున్సిపాలిటీల్లో 91 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో చాలామంది విద్యార్హత పదో తరగతి లోపే. దీంతో అధికారిక వ్యవహారాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు, నియమ నిబంధనలపై పూర్తిగా అవగాహన చేసుకోవడం వారికి కాస్త కష్టమైన విషయమే. దీన్ని ఆసరాగా తీసుకొని కుటుంబసభ్యులో, లేదంటే స్థానిక నాయకులో షాడో నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అందుకే కేంద్ర ప్రభుత్వం నియమించిన లోక్‌సభ అంచనాల కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇకపై స్థానిక సంస్థలకు పోటీ చేసేవారికి కనీస విద్యార్హత ఉండాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈమేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి కొన్ని ప్రతిపాదనలతో నివేదిక సిద్ధమైంది. దీనిపై కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడనుంది. ఈ ప్రకారం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ సభ్యులు కావాలంటే పదో తరగతి చదవి ఉండాల్సిందే. మిశ్రమ స్పందనలు... గ్రామస్థాయిలో ఈ నిబంధనపై మిశ్రమ స్పందన ఉంది. కానీ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ స్థాయి నాయకులకు మాత్రం ఇది మిండుగు పడని విషయమే. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల అధికారాలు ఇప్పటికే నామమాత్రమైపోయాయి. జన్మభూమి కమిటీల పేరుతో పూర్తిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే అధికారం చెలాయిస్తున్నారు. సర్పంచ్‌కు ఉండే చెక్‌పవర్‌ను కూడా వారే దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ ఆ కమిటీలతో ఆధిపత్యం. అదే ఉన్నత విద్యార్హత ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారంలో ఉన్నచోట మాత్రం ఆ కమిటీల ఆటలు సాగట్లేదు. కొంతమంది న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో విద్యార్హత ఇలా.. ∙ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి సిగడాంలు వీటిలో 115 పంచాయితీలు ఉండగా, వీటిలో 41 మంది సర్పంచ్‌లు పదోతరగతి లోపు చదువు ఉన్నవరే ఉన్నారు. అలాగే ఎంపిటీసీల విషయంలోనూ అదే తీరు 87 మంది ఉండగా వీరిలో 45 మంది పదోతరగతి లోపు చదువు గలవారే,∙ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 95 మంది సర్పంచ్‌లలో 48 మందికి పది తరగతి లోపుచదువు కలవారే, ఎంపీటీసీ సభ్యులు మొత్తంగా 79 మంది ఉండగా 41 మంది కనీస అర్హత లేని వారే,∙నరసన్నపేట నియోజకవర్గలో 105 మంది సర్పంచ్‌లు ఉండగా వీరిలో 54 మందికి కనీస విద్యార్హతలు లేవు. ఎంపీటీసీలు 58 మంది ఉండగా వీరిలో 33 మందికి పదో తరగతి పాస్ కాలేదు. ∙పాలకొండ నియోజకవర్గంలో మొత్తం సర్పంచ్‌లు 78 మంది ఉండగా, వీరిలో 36 మంది పదో తరగతి పాస్‌కాలేదు. ఎంపీటీసీలు 38 మంది ఉండగా, 25 మంది పదోతరగతి లోపే చదువులు ఆపివేశారు. ∙టెక్కలి నియోజకవర్గంలో 136 మంది సర్పంచ్‌లకు గాను 20 మంది పదోతరగతి పాస్‌కాలేదు. 77 మంది ఎంపీటీసీలకు గాను 52 మంది పదిలోపే చదువులు నిలిపివేశారు.∙రాజాం నియోజకవర్గంలో 120 మంది సర్పంచ్‌ల్లో 64 మందికి పదో తరగతి అర్హత లేదు. ఎంపీటీసీలు 67 మంది ఉండగా, వీరిలో 33 మందికి కనీస విద్యార్హతలు లేవు. -
రాజుకుంటున్న థర్మల్ కుంపటి
పొందూరు:పొందూరు-ఎచ్చెర్ల మండలాల సరిహద్దులో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలన్న ప్రతిపాదన ఆ ప్రాంతంలో ఉద్యమ కుంపటి రాజేస్తోంది. స్థలపరిశీలనకు జపాన్‌కు చెందిన సుమిటోమో సంస్థ ప్రతినిధులు రానున్నారన్న వార్తలతో కలవరపాటుకు గురైన స్థానికులు థర్మల్ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆదివారం ముక్తకంఠంతో నినదించారు. పొందూరు మండలం తోలాపి సత్యసాయి సేవా మందిరం వద్ద ధర్మపురం, పిల్లలవలస, దళ్లవలస, తోలాపి, కనిమెట్ట గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు సమావేశమయ్యారు. ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల్లో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడంపై వారంతా చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల త మ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పంట భూము లు నాశనమవుతాయని, వ్యవసాయం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. తమ మనోభావాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు ఏర్పాటుకే నిర్ణయిస్తే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పంట భూముల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, గురుగుబెల్లి మధుసూదనరావు, పప్పల దాలినాయుడు, పప్పల అప్పలనాయుడు, యతిరాజుల జగన్నాథం, చల్లా ముఖలింగం, బొనిగి రమణమూర్తి, గురుగుబెల్లి శ్రీరామ్మూర్తి, పాత్రుని శ్రీనివాసరావు, మొదలవలస మురళీ, పాపారావు, వావిలపల్లి తిరుమలరావు, వజ్జాడ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కింతలి, కనిమెట్ట, తోలాపి, దళ్లవలస గ్రామాల్లో చాలావరకు నారాయణపురం కాలువ ద్వారా పంటలు పండిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీఆర్‌గూడెం, తండ్యాం, రాపాక, పొందూరు, తోలాపి, కింతలి, కనిమెట్ట, పిల్లలవలస, ధర్మపురం, బురిడి కంచరాం, ఎస్ఎంపురం పరిధిలోని పలు గ్రామాల్లో మెట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రూ. 47 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఇప్పటికే అరిణాం అక్కివలస డిస్ట్రిబ్యూటరీ నిర్మించి నీరు విడుదల చేశారు. ధర్మపురం డిస్ట్రిబ్యూటరీ పనులు చిన్న ఇబ్బందుల కారణంగా నిలిచిపోయాయి. వీటిని మళ్లీ చేపట్టేందుకు మడ్డువలస ప్రాజెక్టు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో థర్మల్ ప్రతిపాదన పిడుగుపాటులా రైతులను తాకింది. పచ్చదనం పోతుంది థర్మల్ ప్రాజెక్టుతో పచ్చదనం కనుమరుగవుతుంది. గాలి విషతుల్యమవుతుంది. ఈ ప్రాంతం ఏడారిగా మారిపోతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోతాయి. వేసవికాలంలో రెట్టింపు స్ధాయిలో పెరిగిపోతాయి. -గురుగుబెల్లి మధుసూదనరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ థర్మల్ ప్రతిపాదన విరమించాలి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలి. వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్నాం. భూమి సారం దెబ్బతింటాయి. రైతు శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న ప్రభుత్వం పంట భూముల్లో పవర్ ప్రాజెక్టు పెట్టడం అన్యాయం. - చల్లా ముఖలింగం, సర్పంచ్, ధర్మపురం ప్రాణాలైనా అర్పిస్తాం... ప్రాణాలు అర్పించైనా పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను అడ్డుకుం టాం. సోంపేట, కాకరాపల్లి పోరాటాల స్ఫూర్తితో ఇక్కడా ఉద్యమాలుచేపడతాం. రైతాం గాన్ని, పంట భూములను కాపాడుకుంటాం. అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ మంటలు రేపడం తగదు. -సువ్వారి గాంధీ, ఎంపీపీ ప్రతినిధి, వీఆర్‌గూడెం -
ఫిరాయిస్తే అనర్హత వేటే
సాక్షి, కాకినాడ :స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి ఎన్నికై... వేరే పార్టీ వైపు చూస్తున్నారా...? తస్మాత్ జాగ్రత్త. ఎన్నికైన పార్టీ ఆదేశాలను, విప్‌లను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎన్నికైన పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ మరుక్షణమే వారిపై అనర్హత వేటు వేయడం ఖాయమని చట్టాలు చెబుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టే చర్యలు తెరవెనుక సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం, ఫిరాయింపు నిరోధక చట్టాలను నిపుణులు ఉటంకిస్తున్నారు. పార్టీ మారే వారికి చట్టంలోని పగడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించకమానవని స్పష్టం చేస్తున్నారు. అనర్హత వేటు వల్ల అప్రతిష్ట పాలవ్వడంతో పాటు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతో అక్కడితోనే రాజకీయ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ తప్పదంటున్నారు. గతంలో ఇలా పార్టీలు మారినవారు రాజకీయంగా తెరమరుగైన సందర్భాలు అనేకమున్నాయని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికసంస్థల్లో పార్టీల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్నవారే ఆ తరువాత కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లగలిగారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారితే ఆ తరువాత దీర్ఘకాలంగా రాజకీయంగా చాలా నష్టపోకతప్పదు. ఇలాంటి తరుణంలో జెడ్పీ స్థానాలను కైవసం చే సుకోవడానికి అధికార పారీ ్టనేతలు స్థానిక సంస్థల ప్రతినిధులను అనేకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నా నేతలు మాత్రం పునరాలోచనలో పడుతున్నారు. ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టడం పలువురు నేతలకు రుచించడం లేదు. పార్టీని ధిక్కరిస్తే వెంటనే వేటు పడడం, ఆపై ప్రజలు నిరాదరించడం ఇవన్నీ ఎందుకు? బంగారు భవిష్యత్తును వదులుకోవడమెందుకు? అన్న ఆలోచనలో పడుతున్నారు. అయినా కొన్నిచోట్ల కొంతమంది అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అధికారపక్షం వారు చట్టాన్ని వక్రీకరిస్తున్నారు. వారెన్ని చెప్పినా చట్టం పగడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసే విప్‌నకు అనుకూలంగా ఓటు వేయాలే తప్ప, ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే.. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1985 కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చింది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అటు తరువాత 2003లో అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు జరిగాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా కూడా తన పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి తేడా ఉందని, ఈ రెండూ పదాలు కూడా సమనార్థాకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల్లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాక ఏ పార్టీ టిక్కెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరితే ఆ వ్యక్తి తన పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2003లో తీసుకువచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించడానికి వీల్లేదు. చట్టసభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. -
ఆపరేషన్ ఆకర్ష్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్..టీడీపీ.. కమ్యూనిస్టు పార్టీలు ఏవైనా సరే... నేతలు, కేడర్ సుముఖంగా ఉన్నారా..? ఉంటే సరి.. ఆహ్వానించడమే తరువాయి. వారిని పార్టీలో చేర్చుకుని బలహీనతను అధిగమించే పనిలో పడింది టీఆర్ఎస్. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడంతోపాటు, ఒక ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని జిల్లాపై పట్టు పెంచింది. కానీ, ఇదంతా కేవలం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికే పరిమితమైంది. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలోని నియోజకవర్గాల్లో సరైన పట్టు చేజిక్కలేదు. దీంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి నోముల నర్సింహయ్య నకిరేకల్ నుంచి వలస వెళ్లడంతో అక్కడ నాయకత్వ కొరత తీరినట్టే కనిపిస్తున్నా, గ్రామస్థాయి నుంచి పార్టీని నిలబెట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది. హుజూర్నగర్ నియోజకవర్గంలో తెలంగాణ అభిమానమున్నా, స్థానిక నాయకత్వం బలంగా లేదు. ఈ కారణంగానే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ మలి ఉద్యమ తొలిఅమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. ఆమె రెండో స్థానంలో నిలిచారు. కానీ, ఇక్కడ స్థానికంగా ఉండి రాజకీయం చేయలేని పరిస్థితి. దీంతో ఇక్కడ స్థానికంగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే వ్యూహంలో టీఆర్ఎస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాలు అన్న తేడా లేకుండా ఆయా పార్టీల నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సుముఖంగా ఉన్నారని తెలిసిన వెంటనే కండువాలు కప్పేస్తున్నారు. కాంగ్రెస్‌కు దీటుగా తయారుకావడం, టీడీపీ ఆనవాళ్లు లేకుండా చేయడం అనే ద్విముఖ వ్యూహంతో టీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. టీడీపీ... ఖాళీ ఆయా పార్టీల కంటే టీఆర్ఎస్లో చేరడానికి ఎక్కువగా టీడీపీ నాయకులు, కేడరే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే నల్లగొండ నియోజకవర్గం నుంచి బోయపల్లి కృష్ణారెడ్డి వంటి సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు నల్లగొండ టౌన్లో పార్టీకి అండగా ఉన్న వారూ మారిపోయారు. నకిరేకల్ నియోజకవర్గంలో సైతం ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ కూడా టీడీపీకి చెందిన నాయకుడు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి సైతం ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ముందే టీఆర్ఎస్లో చేరిన వేనేపల్లి వెంకటేశ్వరావు మిగిలిన టీడీపీ కేడర్‌నూ టీఆర్ఎస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల నల్లగొండలో టీఆర్ఎస్ జిల్లా ఇన్ చార్జ్ , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో భారీగానే చేరికలు జరిగాయి. నల్లగొండకు చెందిన కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి, మైనారిటీ నాయకులు సైతం టీఆర్ఎస్లో చేరిపోయారు. జిల్లావ్యాప్తంగా మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు, కోఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆయా పదవుల్లో మెజారిటీగా సొంతం చేసుకునే వ్యూహం టీఆర్ఎస్ది. కాగా, వచ్చే ఐదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పాలకపక్షంలో చేరిపోయి, రాజకీయ భవిష్యత్‌ను పునర్నిర్మించుకోవడం కోసం పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్లో చేరడానికి ఎదురుచూస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మొత్తానికి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తిస్థాయిలో బలోపేతం కావడంపై గులాబీ నేతలు బాగానే దృష్టి సారించారు. -
తల్లీకూతురు @ ఎంపీటీసీ
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలంటే ఎన్నో తమాషాలు, ఎన్నో వింతలు ఉంటూనే ఉంటాయి. అలాగే నరసన్నపేటలోనూ చోటుచేసుకుంది. వేరు వేరు చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన తల్లీ, కూతురు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేగాక ఇద్దరి మోజార్టీ కూడా ఒకటే కావడం మరో విశేషం. ఈ తల్లీ కూతురు ఇద్దరూ 375 మోజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాకివలస, నరసన్నపేట నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీచేసిన తల్లి శిమ్మ పార్వతమ్మ, కూతురు నేతింటి భారతి ఇద్దరూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు.