పొందూరు:పొందూరు-ఎచ్చెర్ల మండలాల సరిహద్దులో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలన్న ప్రతిపాదన ఆ ప్రాంతంలో ఉద్యమ కుంపటి రాజేస్తోంది. స్థలపరిశీలనకు జపాన్‌కు చెందిన సుమిటోమో సంస్థ ప్రతినిధులు రానున్నారన్న వార్తలతో కలవరపాటుకు గురైన స్థానికులు థర్మల్ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆదివారం ముక్తకంఠంతో నినదించారు. పొందూరు మండలం తోలాపి సత్యసాయి సేవా మందిరం వద్ద ధర్మపురం, పిల్లలవలస, దళ్లవలస, తోలాపి, కనిమెట్ట గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు సమావేశమయ్యారు. ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల్లో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడంపై వారంతా చర్చించారు.
ఈ ప్రాజెక్టు వల్ల త మ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పంట భూము లు నాశనమవుతాయని, వ్యవసాయం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. తమ మనోభావాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు ఏర్పాటుకే నిర్ణయిస్తే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పంట భూముల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, గురుగుబెల్లి మధుసూదనరావు, పప్పల దాలినాయుడు, పప్పల అప్పలనాయుడు, యతిరాజుల జగన్నాథం, చల్లా ముఖలింగం, బొనిగి రమణమూర్తి, గురుగుబెల్లి శ్రీరామ్మూర్తి,
పాత్రుని శ్రీనివాసరావు, మొదలవలస మురళీ, పాపారావు, వావిలపల్లి తిరుమలరావు, వజ్జాడ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా కింతలి, కనిమెట్ట, తోలాపి, దళ్లవలస గ్రామాల్లో చాలావరకు నారాయణపురం కాలువ ద్వారా పంటలు పండిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీఆర్‌గూడెం, తండ్యాం, రాపాక, పొందూరు, తోలాపి, కింతలి, కనిమెట్ట, పిల్లలవలస, ధర్మపురం, బురిడి కంచరాం, ఎస్‌ఎంపురం పరిధిలోని పలు గ్రామాల్లో మెట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రూ. 47 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఇప్పటికే అరిణాం అక్కివలస డిస్ట్రిబ్యూటరీ నిర్మించి నీరు విడుదల చేశారు. ధర్మపురం డిస్ట్రిబ్యూటరీ పనులు చిన్న ఇబ్బందుల కారణంగా నిలిచిపోయాయి. వీటిని మళ్లీ చేపట్టేందుకు మడ్డువలస ప్రాజెక్టు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో థర్మల్ ప్రతిపాదన పిడుగుపాటులా రైతులను తాకింది.
పచ్చదనం పోతుంది
థర్మల్ ప్రాజెక్టుతో పచ్చదనం కనుమరుగవుతుంది. గాలి విషతుల్యమవుతుంది. ఈ ప్రాంతం ఏడారిగా మారిపోతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోతాయి. వేసవికాలంలో రెట్టింపు స్ధాయిలో పెరిగిపోతాయి.
-గురుగుబెల్లి మధుసూదనరావు, విశ్రాంత ప్రిన్సిపాల్
థర్మల్ ప్రతిపాదన విరమించాలి
థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలి. వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్నాం. భూమి సారం దెబ్బతింటాయి. రైతు శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న ప్రభుత్వం పంట భూముల్లో పవర్ ప్రాజెక్టు పెట్టడం అన్యాయం.
- చల్లా ముఖలింగం, సర్పంచ్, ధర్మపురం
ప్రాణాలైనా అర్పిస్తాం...
ప్రాణాలు అర్పించైనా పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను అడ్డుకుం టాం. సోంపేట, కాకరాపల్లి పోరాటాల స్ఫూర్తితో ఇక్కడా ఉద్యమాలుచేపడతాం. రైతాం గాన్ని, పంట భూములను కాపాడుకుంటాం. అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ మంటలు రేపడం తగదు.
-సువ్వారి గాంధీ, ఎంపీపీ ప్రతినిధి, వీఆర్‌గూడెం
రాజుకుంటున్న థర్మల్ కుంపటి
Published Mon, Dec 29 2014 1:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement