
గుంటూరు ఈస్ట్: ప్రియురాలికి బహుమతులు ఇచ్చేందుకు ఏటీఎం వద్ద అమాయకుల్ని మోసం చేసి దోచుకుంటున్న కేటుగాడిని లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణలు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వేల్పుల రాజేష్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు గుంటూరులోని ఓ నర్సింగ్ కళాశాలలో సీటు రావడంతో చేరింది. దీంతో రాజేష్ గుంటూరు మంగళదాస్ నగర్‌లో అద్దె గదిలో ఉంటూ ప్రేమాయణం కొనసాగించాడు. తన ఖర్చులకు, ప్రియురాలికి బహుమతులు అందించేందుకు అడ్డదారులు తొక్కాడు. అక్టోబర్ మొదటి వారంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేసేందుకు ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తిని గుర్తించి మాయమాటలు చెప్పి కార్డు కాజేశాడు.
అతని ఖాతాలో రూ.8 వేలు డ్రా చేశాడు. అక్టోబర్ 10వ తేదీ ఆర్టీసీ బస్టాండ్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె కార్డుతో రూ. 64 వేలు డ్రా చేశాడు. నవంబర్ 4వ తేదీన చందన బ్రదర్స్ పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వృద్ధుడికి డబ్బులు డ్రా చేసేందుకు సహాయపడినట్లుగా నటించి తన వద్ద ఉన్న నకిలీ కార్డు ఇచ్చి మోసం చేశాడు. అనంతరం వృద్ధుడి ఖాతాలోని రూ. 72 వేలు లాగేశాడు. వరుస సంఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి, వేల్పుల రాజేష్‌ను అరెస్టు చేశారు. చోరీ చేసిన రూ. 1.36 లక్షలతో అతడు 23 గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. వాటితో పాటు రూ. 40 వేల నగదు, 7 నకిలీ ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment