‘అత్తారింటికి దారేది’ పైరసీ కలకలం | 'Attarintiki daredi' piracy outrage | Sakshi
Sakshi News home page

‘అత్తారింటికి దారేది’ పైరసీ కలకలం

Published Tue, Sep 24 2013 1:22 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

‘అత్తారింటికి దారేది’ పైరసీ కలకలం - Sakshi

‘అత్తారింటికి దారేది’ పైరసీ కలకలం

సాక్షి (మచిలీపట్నం/పెడన), న్యూస్‌లైన్ : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు సమైక్య సెగ ఇబ్బందికరంగా మారిన తరుణంలో పైరసీ భూతం మరింత కలవరపెడుతోంది. ఈ సినిమా రూ.50లకే పైరసీ సీడీలు పెడనలో దొరుకుతున్నాయని, ఒక టీవీ చానల్‌కు  అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం రేగింది. విడుదలకు ముందే  ఈ సినిమా పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయన్న ప్రచారం జరగడంతో చిత్ర నిర్మాత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. కాగా, సదరు టీవీ చానల్ దీనికి మరింత మసాలా దట్టించి, పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడనలో దొరుకుతున్నట్లు ప్రత్యేక కథనాన్ని ప్రచారం చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియా వ్యాన్లు సోమవారం పెడనలో చక్కర్లు కొట్టాయి.

ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాలతో డీఎస్పీ కేవీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ ప్రత్యేక బృందాలు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లు, సీడీ షాపులపై  దాడులు చేశారు. ఎక్కడా పైరసీ సీడీలు దొరక్కపోయినప్పటికీ పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గుమిగూడారు. ర్యాలీలు చేస్తూ పెడన బస్టాండ్ సెంటర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పైరసీని అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే..

 అత్తరింటికి దారేదీ సినిమా సీడీ పెడనలోని మొబైల్ షాపుల్లో దొరుకుతోందని రెండు రోజుల క్రితం ఒక టీవీ చానల్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సినిమా నిడివి (1.5 మెగా బైట్స్) 65 నిమిషాలు పాటు ఉంటుందని, దాన్ని సీడీలు, సెల్ మెమరీ కార్డుల్లోకి కాపీ చేసి రూ.50కి అమ్ముతున్నట్టు చెప్పాడు. తాను వడ్లమన్నాడు గ్రామానికి చెందిన రమేష్ అని,  పెడనలోని గూడూరు రోడ్డులో దేవీ మొబైల్ షాపులో కొనుగోలు చేశానన్నాడు.  కాగా, పైరసీ సీడీల్లో ఆ సినిమా మొదట నుంచి చివరి వరకు ఉందని మధ్య మధ్యలో కొన్ని బిట్లు లేవని సీడీలు చూసిన  కొంత మంది తెలిపారు.  

దీనిపై ఓ చానల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావుకు సీడీని అందజేశారు. ఆయన ఆదేశంతో బందరు డీఎస్సీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ పల్లంరాజు పలువురు ఎస్సైలు  మొబైల్ షాపులను తనిఖీ చేశారు. తొలుత దేవీ మొబైల్స్ షాపును పరిశీలించగా అక్కడేమి దొరకలేదు. దీంతో సీఐ పల్లంరాజు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, ఇంటర్నెట్ కంప్యూటర్ షాపులను తనిఖీ చేసి షాపుల్లో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా టీవీ చానల్‌కు ఫోన్ చేసి సమాచారం  ఇచ్చిన వ్యక్తి  నంబరు మనుగడలో లేదని  విచారణలో తేలింది.  

 యూ ట్యూబ్ ద్వారా వచ్చిందా?

 ఇటీవలే అత్తారింటికి దారేదీ సినిమా అడియో ఫంక్షన్ హైదరాబాదులో జరిగింది. ఆ సమయంలో కొన్ని ైట్రెలర్స్‌ను విడుదల చేశారు. అలాంటి వాటినన్నింటినీ కలిపి యూట్యూబ్‌లో పెట్టి ఉండవచ్చని, పలువురు యువకులు నెట్ సహాయంతో డౌన్‌లోడ్ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సినిమా విడుదల కాకుండనే సినిమా సీడీ బహిరంగ మార్కెట్‌లోకి వచ్చిందని పుకార్లు వచ్చి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

 లోతుగా దర్యాప్తు : డీఎస్పీ

 ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. పెడనలో పలు మొబైల్ షాపులను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు దొరక లేదన్నారు. పలు షాపుల యజమానులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు, మెమరీ కార్డులను  ఐటీ నిపుణులు  పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  సమాచారం అందించిన వ్యక్తి వడ్లమన్నాడు గ్రామానికి చెందినతనుగా  చెప్పడంతో అక్కడ ఉన్న నాలుగు మొబైల్ షాపులను పరిశీలించి అక్కడ వారిని కూడా అదుపులోకి తీసుకున్నటుల తెలియజేశారు. టీవీ చానల్‌కు వచ్చిన ఫోన్ నంబరును సేకరించామని, ఆ నంబరు రెండు రోజులుగా పనిచేయడం లేదని తెలిపారు.  అయితే ఆ నంబరు కాల్స్ లిస్టును సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 భగ్గుమన్న పవన్ ఫ్యాన్స్..

 పైరసీ సీడీల విషయమై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. వందల సంఖ్యలో అభిమానులు బస్టాండ్ ఎదుట  గంట సేపు చిలంకుర్తి పృద్వీ ప్రసన్న నేతృత్వంలో  రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న విలేకరులతో మాట్లాడుతూ ఏ హీరో సినిమాను పైరసీ చేస్తే ఊరుకునేది లేదన్నారు. కోట్లాది రుపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తే..  థియేటర్‌లోకి వెళ్లి చూడకుండా పైరసీ సీడీలు కొనుగోలు చేసి చూడటం దౌర్భాగ్యం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు ఉద్యమిస్తారని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement