
స్నేహితునిపై హత్యాయత్నం
ఆర్ధిక లావాదేవీలే కారణం
పోలీసులు అదుపులో నిందితుడు
అల్లిపురం: ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీలు చిచ్చుపెట్టాయి. ఏకంగా హత్యాయత్నానికి దారితీశాయి. అల్లిపురంలో శుక్రవారం జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీహరిపురానికి చెందిన గల్లా పోలిపల్లి అలియాస్ చిన్నా, రామ్‌నగర్‌కు చెందిన గుడేల్ జగదీష్‌లు స్నేహితులు, వీరి మధ్య వ్యాపారలావాదేవీలు ఉన్నాయి. అల్లిపురంలోని నారాయణవీధిలో గల అశోకారెసిడెన్సీలో గుడేల్ జగదీష్ తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం జగదీష్ తన కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో చిన్నా అక్కడే ఉన్నాడు. ఆఫీస్‌లో కూర్చుందాం రా అని చిన్నాను ఆహ్వానించి, కార్యాలయంలోకి వెళుతుండగా అప్పటికే చిన్న తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో వెనుక నుంచి జగదీష్ తలపై బలంగా వేటు వేయడంతో అక్కడికక్కడే కూలిపోయాడు. అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి చిన్నాను పట్టుకుని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ఎస్‌ఐ రామదాసు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.
బాధితుడు జగదీష్‌ను వారి కుటుంబసభ్యులు కేర్ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పిందని బాధితుని కుటుంబసభ్యులు తెలిపారు. బాధితుని సోదరుడు గుడేల బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.