
తిరుమలలో పోలీసులపై దాడికి యత్నం
టీటీడీ చైర్మన్ బంధువులమంటూ సీఐ, ఎస్‌ఐలపై ఫైర్
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రిస్తున్న పోలీసులపై టీటీడీ చైర్మన్ బంధువులమంటూ కొందరు దాడికి యత్నించారు. ఆదివారమిక్కడ స్థానిక శంకుమిట్ట కూడలి ప్రాంతంలో తిరుమల ట్రాఫిక్ కానిస్టేబుల్ వర ప్రసాద్, కడపకు చెందిన శ్రీరాములు, రేణిగుంట ఎస్‌ఐ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఎంసీ నుంచి ఎస్వీ గెస్ట్‌హౌస్‌కు వెళ్లేందుకు రెండు కార్లు అక్కడికి వచ్చాయి. ట్రాఫిక్ ఆంక్షలున్నందున ఈ మార్గంలో వెళ్లేందుకు వీలులేదంటూ ఆ కార్లను కానిస్టేబుల్ వరప్రసాద్ అడ్డుకు న్నాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌తో కారులోని ఇద్దరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు.
ఇంతలో సీఐ, ఎస్‌ఐలు జోక్యం చేసుకోగా.. నిగ్రహం కోల్పోయిన కారులోని వ్యక్తులు ‘‘రేయ్.. ’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వారి మాటల్ని సెల్‌ఫోన్లతో రికార్డు చేస్తుండటంతో వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. ‘‘రేయ్.. వీడియో కాదు.. ఏమైనా తీసుకో’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఘటన కారణంగా ఎస్‌ఎంసీ కూడలిలో పది నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఐ, ఎస్‌ఐలు వెనక్కి తగ్గకతప్పలేదు. అనంతరం ఆ వాహనాలు అక్కడ్నుంచి వెళ్లిపోయాయి.
చైర్మన్ బంధువులమని బెదిరించారు: ట్రాఫిక్ ఆంక్షలుండటంతో వాహనాలను అడ్డుకున్నామని, కానీ వారు తమపై దాడికి ప్రయత్నించారని సీఐ శ్రీరాములు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘టీటీడీ చైర్మన్ బంధువులం. ఏం చేస్తావ్’ అంటూ బెదిరించారని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.