కొనసాగుతున్న స్మగ్లర్ల వేట !
- మరో ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
- అందరిపై పీడీ యాక్టు నమోదు
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్జాతీయ స్మగ్లర్లపై పోలీసుల వేట కొనసాగుతోంది. ఇటీవల ఆరుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు గురువారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. నగరి, పెద్దపంజాణి సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో చిత్తూరు టాస్క్‌ఫోర్స్, స్థానిక ఎస్‌ఐలు దాడి చేసి మణిపూర్ రాష్ట్రానికి చెందిన మార్కొండన్ లక్ష్మణ్ (35), బెంగళూరు వాసి హమీద్(47), చెన్నై వాసి సయ్యద్ ఫీరాన్ మహమ్మద్ రఫీ(43)ని గురువారం అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు.
మార్కొండన్ లక్ష్మణ్:
మణిపూర్ రాష్ట్రంలోని మోరె గ్రామవాసి. ప్రస్తుతం కోల్‌కత్తాలో ఉంటున్నారు. ఇతను ఇండియాలో మోస్ట్‌వాంటెడ్ స్మగ్లర్. కుటుంబం చైన్నైకి వలస వచ్చింది. ప్లస్-2 వరకూ చదివిన లక్ష్మణ్ తనమామ చిన్నదొరై వద్ద గుమస్తాగా చేరి విదేశాల నుంచి వస్తువులను అక్రమ రవాణా చేసేవాడు. చెన్నై, ముంబయి, కోల్‌కతా ఓడరేవుల నుంచి కంటైనర్ల ద్వారా ఎర్రచందనం ఎగుమతిని పర్యవేక్షించేవాడు. 1998లో స్వయంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ మొదలుపెట్టాడు.
కర్నూలు, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని అడవుల్లో సరుకును స్వయంగా కొని బర్మా బార్డర్ వరకూ తీసుకెళ్లేవాడు. బెంగళూరు, విజయవాడ, వైజాగ్, కోల్‌కతాలో తన గోడౌన్‌లకు సరుకు చేర్చి అక్కడి నుంచి అస్సోం, మణిపూర్, మిజోరాంల మీదుగా బర్మాకు చేర్చేవాడు. నేపాల్, బర్మా, దుబాయ్, చైనా వారికి నేరుగా సరుకు విక్రయిస్తాడు. సంపాదించిన డబ్బును ఎక్కువగా ‘జల్సాల’కు అధికంగా ఖర్చు చేసేవాడు. ఇప్పటి వరకూ 1200 టన్నులు ఎగుమతి చేసి ఉంటాడు. ఇతని నెలసరి ఆదాయం 20 కోట్ల రూపాయలు. ఇతనిపై వైఎస్సార్‌జిల్లా మైదుకూరు, ఖాజీపేట పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోనే 16 కేసులున్నాయి.
ఎర్రచందనం స్మగ్లర్ల గురువు...హమీద్ ఖాన్
ఇతను బెంగళూరు వాసి. సౌత్‌ఇండియాలో పేరుమోసిన స్మగ్లర్. రెండోతరగతి వరకూ చదివాడు. బెంగళూరులో బీరువాలు తయూరీ కూలీ. ఆపై స్టార్ హోటల్లో చెఫ్‌గా చేరాడు. ఫయ్యూమ్ అనే వ్యక్తితో కలిసి కొద్దిరోజులు ఎముకల వ్యాపారం చేశాడు. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇద్దరికీ చైనా వాసులు పరిచయమయ్యారు. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను మొదలెట్టారు. రియాజ్, ఫయాజ్ లాంటి స్మగ్లర్ల వద్ద సరుకుకొని విదేశాలకు తరలిస్తాడు. ఎర్రచందనం స్మగ్లర్లకు ఇతను గురువులాంటి వాడు. ఇతనికి కటికనహల్లి, ఢిల్లీలో గోడౌన్లు ఉన్నాయి. ఇతని నెలసరి ఆదాయం సుమారు 50లక్షల రూపాయలు. ఇతనిపై పది కేసులున్నాయి. ఇప్పటి వరకూ అరెస్టు కాలేదు.
మహమ్మద్ రఫీ
ఇతను చైన్నైలోని టీనగర్ వాసి. నాలుగో తరగతి వరకూ చదువుకున్నాడు. స్టీల్ ఫ్యాక్టరీలో కూలీగా చేరాడు. తర్వాత సెల్వరాజ్ అనే స్మగర్ వద్ద డ్రైవర్‌గా చేరాడు. సెల్వరాజ్ శ్రీగంధం స్మగ్లింగ్ చేసేవాడు. ఆపై ఎర్రచందనం వ్యాపారంలోకి దిగాడు. ఈ క్రమంలో రఫీకి స్మగ్లర్లంతా పరిచయమయ్యారు. దుబాయ్‌లోని మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ సాహుల్ హమీద్ కూడా పరిచయమయ్యాడు. ఇతనికి ముఖ్య అనుచరుడు కూడా! ఇండియాలో మొత్తం లావాదేవీలు ఇతనే చూస్తాడు. ఇతని నెలసరి ఆదాయం 10లక్షల రూపాయలు. ఇప్పటి వరకూ ఇతనిపై 10 కేసులున్నాయి. ఇప్పటి వరకు అరెస్టు కాలేదు.