తల్లిదండ్రులు సి.పద్మాజీ రావు, సి.హేమతో భారతి
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో ఓ అటెండర్ కుమార్తె రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు. టెట్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కర్నూలు నగరంలోని పూలబజార్‌కు చెందిన సి.పద్మాజీరావు, హేమ దంపతుల కుమార్తె సి.భారతి పేపర్–1లో 150 మార్కులకు 141 సాధించారు. తద్వారా మొదటిర్యాంకు కైవసం చేసుకున్నారు. పద్మాజీరావు చేనేత, జౌళి శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నారు.
ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె సి.భారతి 2014–16 విద్యా సంవత్సరంలో డీఎడ్ పూర్తి చేశారు. టెట్ పరీక్షకు మొదటిసారి హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే అత్యుత్తమ ఫలితాన్ని రాబట్టారు. ఈమె ప్రాథమిక, సెకండరీ విద్య అంతా కర్నూలులోని కింగ్ మార్కెట్ దగ్గర ఉన్న ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ హజీరా కాలేజీలో పూర్తి చేశారు. పద్మాజీరావు తనలా పిల్లలు ఉండకూడదని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూస్తున్న భారతి చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్నారు. ఎప్పటికైనా సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు. టెట్ కోచింగ్‌ను స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ప్రతిభా కోచింగ్ సెంటర్‌లో తీసుకున్నారు. ఆరు నెలల పాటు రోజుకు పది గంటల పాటు ప్రిపేర్ అయ్యారు.
టెట్ ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు..
పేపర్–1లో జిల్లా అభ్యర్థులు సి.అష్మా (136 మార్కులు), సన శైలజ (133), బోయ శివ (133), కంబహం రోహిణి (132), కురువ హరిప్రసాద్ (132) అత్యుత్తమ మార్కులు సాధించారు.
విశ్వవాణి విజయభేరి
టెట్ ఫలితాల్లో విశ్వవాణి కోచింగ్ సెంటర్ అభ్యర్థులు విజయభేరి మోగించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎన్‌కే మద్దిలేటి తెలిపారు. టెట్–3లో ఆర్.ప్రసన్న లక్ష్మి (118 మార్కులు), పి.వెంకటేశ్వరి (118), మైమున్సీ (116), రామకృష్ణ (115), గోపీనాథ్ (118), సుజాత (116), ప్రసాదరావు (115)తో పాటు మరో పది మంది రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించారని ఆయన వెల్లడించారు.
టీచర్స్ అకాడమీ...
టీచర్స్ అకాడమీలో టెట్ శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 90 శాతం అర్హత సాధించారని ఆ సంస్థ డైరెక్టర్ పి.శ్రీరామ్ తెలియజేశారు. 400 మందికి పైగా 125 మార్కులు సాధించారన్నారు. ఎంతో అనుభవం ఉన్న అవనిగడ్డ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం వల్లే సంస్థ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు.
విజేత కోచింగ్ సెంటర్...
స్థానిక విజేత స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్‌లో టెట్ శిక్షణ తీసుకున్న వారిలో పేపర్–1లో 130 నుంచి 140 మార్కుల మధ్య 8 మంది, 100 నుంచి 130 మార్కుల మధ్య వంద మందికి పైగా సాధించినట్లు ఆ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఎం.వి.రమణ, అకడమిక్ డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. తమ వద్ద శిక్షణ పొందిన వారిలో 92 శాతం మంది అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment