అటెన్షన్ ప్లీజ్ | Attention Please | Sakshi
Sakshi News home page

అటెన్షన్ ప్లీజ్

Published Fri, Jul 17 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

అటెన్షన్ ప్లీజ్

అటెన్షన్ ప్లీజ్

2004 కృష్ణా పుష్కరాల్లో ఐదుగురు మృతి
గోదావరి పుష్కరాల్లో 27మంది దుర్మరణం
ఆ అనుభవాలతో పాఠాలు నేర్వండి
కృష్ణా పుష్కర ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళిక అవసరం
ప్రజాప్రతినిధులు, అధికారులూ ఇప్పుడే మేల్కోండి

 
పరమ పవిత్రమైన పుష్కరస్నానం పాపాలు తొలగించే పుణ్యయాత్ర కావాలి గానీ.. చిన్నచిన్న మానవ తప్పి దాలకు కన్నీటి యాత్రగా మిగిలిపోకూడదు. గోదావరి పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో 27మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుణపాఠంగా నేర్చుకుని కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. కోట్లలో ఖర్చు చూపించి ప్రచారం ఆర్భాటంగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు సమన్వయంతో సౌకర్యాలు కల్పిస్తేనే పుష్కరాలు విజయవంతమవుతాయన్నది సత్యం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలపై ‘సాక్షి’ కథనం..
 
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల్లో తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా 27మంది భక్తుల ప్రాణాలు పోయాయి. మానవ తప్పిదంతో పాటు ప్రచార ఆర్భాటం.. సౌకర్యాల లేమి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో కృష్ణానదికి పుష్కరాలు జరగనున్నాయి. నూతన రాజధానిలో జరిగే తొలి పుష్కరాలు కావడంతో భారీ అంచనాలే ఉంటాయి. కాబట్టి అధికారులు స్పందించి ఇప్పటి నుంచే కృష్ణా పుష్కర ఏర్పాట్లపై దృష్టిసారిస్తే బాగుంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 ఆ దుర్ఘటనను మరిచిపోకండి
 2004వ సంవత్సరంలో జరిగిన కృష్ణా పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ఐదుగురు చనిపోయారు. తొలిరోజు తెల్లవారుజామునే కృష్ణానది అప్రాన్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 15మంది గాయాలపాలయ్యారు. దీంతో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే స్పందించి రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని కృష్ణా పుష్కరాలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 దుర్గాఘాటే కీలకం సుమా..
 కృష్ణా పుష్కరాలకు దుర్గాఘాటే కీలకం. ఇంద్రకీలాద్రి దిగువనే ఉన్న ఈ ఘాట్‌లో స్నానం ఆచరించి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక ప్రాధాన్యతనిస్తారు. దీంతో ఘాట్‌కు రోజూ లక్షలమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దుర్గాఘాట్‌తో పాటు భవానీ, పున్నమి, పద్మావతి, సీతమ్మవారి పాదాల ఘాట్లను ఇప్పటినుంచే అభివృద్ధి చేయడం ప్రారంభించాలి. చివరి నిమిషంలో పనులు తల పెడితే తూతూమంత్రంగా ముగించే అవకాశం ఉంది.

ఇక పనులు ప్రారంభించాలి
►ప్రతి ఘాట్‌లోనూ రోజూ కనీసం 10వేల నుంచి 25వేల మంది భక్తులు పుణ్యసాన్నాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఘాట్లలో సౌకర్యాలు కల్పించడం తప్పనిసరైన విషయం.
► వీఐపీలు వారికి కేటాయించిన ఘాట్లలోనే స్నానాలు ఆచరించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి.
► ఘాట్ల వద్ద ఒకేసారి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తొక్కిసలాట జరగకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటుచేసి భక్తుల్ని క్రమపద్ధతిలో నదిలో వదిలేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
► వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు నదిలో దిగి ప్రమాదాలకు గురికాకుండా జల్లు సాన్నాలు ప్రతి స్నాన          ఘట్టంలోనూ కనీసం వంద చొప్పున ఏర్పాటు చేయాలి. నదిలోకి వెళ్లి స్నానం చేద్దామనే వికలాంగుల కోసం ర్యాంపులు అవసరం.
►మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మొబైల్ టాయిలెట్లు ఒక్కో ఘాట్‌లోనూ కనీసం 50 చొప్పున ఏర్పాటుచేయాలి. ఘాట్‌లలో తాగేందుకు మంచినీటి పంపులు సిద్ధం చేయాలి.
►ఇక విద్యుత్ సదుపాయాలు, జనరేటర్లు, క్యూలైన్లు ఇప్పటి నుంచే ప్రారంభిస్తే నాణ్యతతో కూడిన ఏర్పాట్లు భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి.
► ఘాట్‌లు లేని ప్రదేశాల్లో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రయత్నించకుండా నో ఎంట్రీ బోర్డులు సిద్ధం చేయాలి. అప్రాన్ వంటి ప్రదేశాల్లో స్నానాలకు దిగినప్పుడు, నదిలో సుడిగుండాలు ఉన్న ప్రదేశాలను ఇప్పటినుంచే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. భక్తులను హెచ్చరించాలి.
 
 
 ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు కీలకం
 
కృష్ణానదిలో స్నానాలు చేసిన భక్తులు ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైన కీలక ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలి.
►దర్శనం కోసం వచ్చే వారికోసం ఐదువరసల క్యూలు ఏర్పాటుచేయాలి.
►దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదం తీసుకునే సౌకర్యం కల్పించాలి.
►దుర్గాఘాట్ నుంచి వచ్చే భక్తులు కొండపైకి చేరుకునేందుకు ట్రాఫిక్  సమస్యలు అడ్డుకాకుండా చూడాలి.
►ఉచిత భోజనం వద్ద తొక్కిసలాట జరగకుండా చూడాలి.
 
ఈ జాగ్రత్తలు అవసరం

దేశం నలుమూలల నుంచి కనీసం 50లక్షల మంది భక్తులు కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే, బస్‌స్టేషన్ల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం ఉత్తమం. రైల్వే, బస్సు ప్లాట్‌ఫాంలపై వేలసంఖ్యలో భక్తులు నిలిచిపోతారు. తొక్కిసలాట జరగకుండా ప్లాట్‌ఫాంలను విస్తరించాలి. లేదా ప్రయాణికులను వేర్వేరు ప్రాంతాల్లో దిగేలా ఇప్పటి నుంచే   ప్రణాళికలు తయారుచేయాలి.

 ఠపోలీస్ సిబ్బందిని ఎక్కడెక్కడ నియమించాలి, భక్తులకు ఏయే సలహాలు ఇవ్వాలి, సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటుచేయాలి.. వంటి విషయాలను ఇప్పటినుంచే కూలంకషంగా చర్చించుకోవడం ఉత్తమం.ప్రత్యేక రైళ్లు, బస్సుల సమాచారాన్ని పుష్కర ఘాట్ల వద్ద, ఇంద్రకీలాద్రి వద్ద, నగరంలోని ముఖ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి.దుర్గాఘాట్ ఒక్కటే కాకుండా అన్ని ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించేలా ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహించాలి.
 
 ముందస్తు ప్రణాళిక అవసరం
 ఏ కార్యక్రమానికైనా సరే ముందస్తు ప్రణాళిక, దాని అమలు అవసరం. మొదటి రోజే కాదు.. 12 రోజులూ పవిత్రమైన రోజులేనని, నది ప్రారంభమైన ప్రాంతం నుంచి చివరి వరకు అంతా పవిత్రమైన ప్రాంతమేనని ప్రచారం చేయాలి. అధికార యంత్రాంగం కూడా పెద్దలు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
 - డాక్టర్ ఎంసీ దాస్, విద్యావేత్త, విశ్లేషకుడు
 
 రెండు సమావేశాలు నిర్వహించాం..
 కృష్ణా పుష్కరాల విజయవంతం కోసం ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించాం. దుర్గాఘాట్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వెయ్యిమందికి జల్లు స్నానాలు, పిండ ప్రదానాలకు వేరే ఏర్పాట్లు చేస్తాం. 50 బాత్‌రూమ్‌లు, 50 లెట్రిన్స్ అదనంగా ఉంటాయి. ఘాట్‌రోడ్డులో ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేస్తాం. కొండపైకి రాలేని భక్తుల కోసం ఐదు ఘాట్లలో అమ్మవారి, అయ్యవారి నమూనా దేవాలయాలు ఏర్పాటుచేస్తాం. మూడు షిప్టులలో అర్చకులు, గుమస్తాలను ఏర్పాటుచేసి ప్రసాదాలు విక్రయిస్తాం.
 - సీహెచ్ నర్సింగరావు, దుర్గగుడి ఈవో
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement