ఘాట్ ఇక్కడ.. నీళ్లు అక్కడ..!
పుష్కర స్నానం.. ఓ ప్రహసనం
అధికారుల ఇష్టారాజ్యం
కనీస సర్వే చేయకుండా ఇంజినీర్ల నిర్వాకం
ఇసుకలో కిలోమీటరు నడిస్తేనే నీళ్లు
ఒడ్డుకు చేరువగా నీళ్లున్న ప్రాంతాలను పట్టించుకోని అధికారులు
హైదరాబాద్: ఓ అభివృద్ధి పనిచేపట్టే సమయంలో ముందుగా సర్వే చేయడం తప్పనిసరి... అదీ లక్షలాది నమ్మకంతో కూడుకున్నది అయినప్పుడు మరింత ముందుచూపు అవసరం. కానీ, ఇంజనీరింగ్ అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఇష్టారీతిగా పనులు చేపట్టడం వల్ల అటు డబ్బు వృథా కావడమే కాక.. భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. కుంభమేళా తరహాలో జరుపుతామంటూ ఆర్భాటం చేస్తున్న గోదావరి పుష్కరాల విషయంలో అధికారుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. దీంతో పుష్కర భక్తులకు పుణ్యస్నానం ఈసారి ఓ ప్రహసనమే కాబోతోంది.
వరంగల్ జిల్లా ఏటూరునాగారం ముళ్లకట్ట వద్ద అధికారులు దాదాపు రూ.4.50 కోట్లు వెచ్చించి 168 మీటర్ల పొడవుతో భారీ ఘాట్‌ను నిర్మించారు. కానీ, ఇక్కడ నీళ్లజాడేలేదు. భక్తులు నదీ స్నానం చేయాలంటే ఘాట్ దిగి ఇసుకలో కిలోమీటర్ దూరంలోని అవతలి ఒడ్డుకు వెళ్లాల్సిందే. రోడ్డుకు చేరువగా ఉంటుందన్న ఒకేఒక్క కారణంతో ఇక్కడ ఘాట్లు కట్టేశారు. ఈ ప్రాంతానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఒడ్డును ఆనుకునే నీటి ప్రవాహం ఉంది. ఎండాకాలంలోనూ అక్కడ నీటి ప్రవాహం ఉంటుందనే విషయం స్థానికంగా అందరికీ తెలుసు. కానీ, వానలు పడకుంటే ముళ్లకట్ట వద్ద నీళ్లుండవనే కనీస విషయాన్ని కూడా గుర్తించకుండా అక్కడ ఘాట్‌ను కట్టారు. పోనీ ఒడ్డుకు నీటి ప్రవాహం ఉన్నచోటే స్నానం చేద్దామంటే.. అక్కడ మూడు మీటర్ల ఎత్తుతో ఒడ్డు ఉంటుంది. దిగడం చాలా కష్టం. పొలాలు ఉండడంతో అక్కడి వరకు వెళ్లడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముందే ఆ ప్రాంతాన్ని గుర్తించి రైతుల అనుమతితో అప్రోచ్ రోడ్డు వేసి ఘాట్లు కట్టి ఉంటే బాగుండేదని స్వయంగా మంత్రులే పేర్కొంటుండడం విశేషం. ఆవలివైపు వెళ్తే గట్టునానుకునే భారీ నీటి ప్రవాహం ఉంది. అయితే అక్కడ ఒడ్డు చాలా ఎత్తుగా ఉండడంతో నీటిలో దిగటం ప్రమాదకరం. ఘాట్ల వద్ద నీళ్లు లేవన్న ఉద్దేశంతో భక్తులెవరైనా అక్కడ స్నానం చేసే ప్రయత్నం చేస్తే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉంది.
ఇక రామన్నగూడెం వద్ద గతంలో నిర్మించిన పాత ఘాట్లున్నాయి. అక్కడ నీటి జాడ లేకపోయినా రూ.50 లక్షలు వెచ్చించి పాతవాటిని కొత్తగా మార్చారు. భక్తులు నీటికోసం ఆ ఘాట్లు దిగి నదిలోకి కనీసం అరకిలోమీటరు దూరం వెళ్లాలి. ఇసుకలో నడక కష్టమన్న ఉద్దేశంతో మంత్రుల సూచన మేరకు అధికారులు తాజాగా ఇసుకబస్తాలు వేసి బాట ఏర్పాటు చేశారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌నగర్ వద్ద ఒడ్డును ఆనుకునే భారీగా నీటి ప్రవాహం ఉంది. కొత్త ఘాట్లు అక్కడే నిర్మించి ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉండేది. మంగపేట వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించిన ఘాట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి. 50 మీటర్ల మేర ఇసుకలో నడిస్తే తప్ప నీటి జాడలేదు.