అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
గుంటూరు రూరల్: అత్తింటి ఆరళ్లకు ఓ వివాహిత మహిళ బలైంది. భర్తతో కలిసి వేరు కాపురం ఉంటున్న కోడలి దగ్గరికి మరో ఇద్దరితో కలసి వచ్చిన ఆమె మామ తిరిగి వెళ్లే సరికి ఆమె విగ తజీవిగా మారింది. ఇంట్లో ఫ్యానుకు వేలాడుతున్న తల్లిని చూసి ఏడు నెలల చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తోంది. అది విన్న ఇరుగుపొరుగు అక్కడికి చేరుకుని, ఆమె బంధువులకు సమాచారం చేరవేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి వారే తమ కుమార్తెను హతమార్చారని ఆరోపించారు. ఈ విషాద ఘటన గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది.
మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ళకు చెందిన కటారి వెంకటేశ్వర్లు, ప్రభుకుమారిలకు ముగ్గురు సంతానం. మూడో కుమార్తె రమాదేవికి గుంటూరు శ్రీనగర్ 7వ లైన్‌కు చెందిన సత్తెనపల్లి కోటేశ్వరావు కుమారుడు అమోస్‌తో ఏడాదిన్నర క్రితం పెళ్లయింది. వీరికి ఏడు నెలల కుమారుడు జాన్‌మోజెస్ ఉన్నాడు. రమాదేవి తండ్రి వివాహ సమయంలోనే స్వర్ణభారతినగర్‌లో ఉన్న ఒక ప్లాట్‌ను విక్రయించి వరకట్నం కింద రూ.3.5 లక్షల నగదు, 15 సవర్ల బంగారం ఇచ్చాడు.
అయినా పెళ్లయినప్పటి నుంచి భర్త, మామ రమాదేవిని వే ధించసాగారు. కోటేశ్వరరావుతో వివాహేతర సంబంధం నెరుపుతున్న మహిళ బాజీ, ఆమె అక్క కుమారుడు మహమ్మద్ కూడా వీరికి తోడయ్యారు. వివాహ సమయంలో అమోస్ తల్లి మరణించినట్టు, తండ్రి మరో మహిళలతో ఉంటున్నట్లు కూడా రమాదేవి కుటుంబసభ్యులకు తెలియనివ్వలేదు. స్వర్ణభారతినగర్‌లో రమాదేవి పేరుతో ఉన్న రెండో ప్లాట్‌ను విక్రయించాల్సిందిగా తరచూ వేధిస్తున్నారు.
పథకం ప్రకారం ఇంటికి వచ్చి..
వీరి గొడవల విషయం తెలుసుకున్న రమాదేవి కుటుంసభ్యులు ఆర్నెల్ల కిందట పెద్దల సమక్షంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి వివాదం చోటు చే సుకోకుండా ఉండేలా మాట్లాడి శ్రీనగర్ 5/2లో ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టించారు. ఈ క్రమంలో బాజీ మనవరాలితో అమోస్‌కు మరో వివాహం చేయాలని కోటేశ్వరరావు పథకం వేశాడు. వేరు కాపురం ఉంటున్న కొడుకు నుంచి రమాదేవిని దూరం చేయాలని పథకం వేశాడు. పథకం ప్రకారం బుధవారం రాత్రి కోటేశ్వరరావు, బాజీ, మహమ్మద్‌లు రమాదేవి ఇంటికి వచ్చారు.
ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్న రమాదేవి అదేసమయంలో క్షేమ సమాచారం తెలుసుకునేందుకు తల్లి ఫోన్ చేయగా ఇంటికి ముగ్గురూ వచ్చారని, తాను మరలా మాట్లాడతానని చెప్పి, పెట్టేసింది. ఆ వచ్చిన ముగ్గురూ రమాదేవిని తీవ్రంగా కొట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసి వెళ్లిపోయారు. పసిబాలుడి ఏడ్పు విని, అక్కడి చేరుకున్న ఇరుగుపొరుగు రమాదేవి ఫ్యాన్‌కు వేలాడటం గమనించారు. ఆమె బంధువులకు సమాచారం అందజేశారు.
హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకున్న ఆమె బంధువులు మృతదేహన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. రమాదేవిని అత్తింటి వారే హతమార్చారంటూ విలపించారు. అరండల్‌పేట సీఐ శివప్రసాద్, సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు భర్త అమోస్, మామ కోటేశ్వరరావు, బాజీ, మహమ్మద్‌లపై కేసు నమోదు చే శారు. మృతదేహన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్టషన్‌కు త రలించి విచారిస్తున్నారు.