
డీఈఓ రాజ్యలక్ష్మి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సోమవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు జిల్లాలో మనఊరు – మనబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మి ఆదివారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారని చెప్పారు.
వీటితో పాటు ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ తరగతుల ద్వారా బోధన చేస్తారన్నారు. ఆటలు, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, వ్యాయామం లాంటి అదనపు తరగతులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మార్షల్‌ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఒకేషనల్ విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జూన్ 5న అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటం, 6న ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 7న ఏడు, 8 తరగతులు పూర్తిచేసి బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తామన్నారు. 8న ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తామని చెప్పారు. 9న మురికివాడల్లోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పింస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment