mana ooru mana badi
-
‘మనఊరు–మనబడి’ స్కూళ్ల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మన ఊరు–మన బడి పథకం కింద పనులు పూర్తి చేసిన స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.తారకరామారావు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సంబంధిత నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు మొదటి విడతలో పూర్తయిన పాఠశాలలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం ప్రజా ప్రతి నిధులను కోరింది. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు–మనబడి పథకాన్ని 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి మొత్తంగా రూ.7,289 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశా రు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్ల లో తొలి విడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేశారు. రూ.3,497.62 కోట్లను మొదటి విడతలో ఖర్చు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటి వరకు 1,200 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల్లో భవనాలకు మరమ్మతులు చేపట్టడం, రంగులు వేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నిచర్ అమర్చడం, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానెల్స్, అధునా తన వసతుల పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభు త్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఈ పథకం కింద పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్ సదుపాయం, భోజనవసతి, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
చతికిల‘బడి’.. కూలిపోయే పైకప్పులు.. వేలాడే విద్యుత్ తీగలు!
సాక్షి, హైదరాబాద్: కూలిపోయేలా ఉన్న పై కప్పులు.. రాలిపోతున్న గోడల పైపెచ్చులు.. వేలాడుతున్న కరెంట్ తీగలు.. విరిగిపోతున్న బల్లలు, కుర్చీలు.. కొత్త గదుల నిర్మాణం దేవుడెరుగు, ఉన్న భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. వంటగదుల సంగంతి చెప్పనక్కర్లేదు. వానొస్తే బురద.. గాలొస్తే తంటా. పేద, మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కన్పిస్తున్న దృశ్యాలు. ఈ దుస్థితిని మార్చేస్తామని, కార్పొరేట్‌కు ధీటుగా సర్కార్ బడిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్పింది. 12 రకాల పనులతో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమంది. ఈ కార్యక్రమానికి ‘మన ఊరు–మనబడి’ అనే పేరు పెట్టింది. దశలవారీగా అమలు చేసే ఈ కార్యక్రమంలో తొలిదశను ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. కొన్నిచోట్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. పనులు మొదలైన చోట్లా సవాలక్ష అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మోకాలెత్తు పునాదులు.. మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. నిధుల ప్రకటనలతోనే సరి.. మన ఊరు– మనబడి కార్యక్రమాన్ని 2021 మార్చి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ళల్లో రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలిపింది. కానీ 2021–22లో నిధులు కేటాయించలేదు. 2022 మార్చి బడ్జెట్లో రూ.7,289 కోట్లు మూడు విడతలుగా పాఠశాలల్లో మౌలిక వసతులకు కేటాయిస్తామని ప్రకటించింది. అదే నెలలో సీఎం కేసీఆర్ వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూళ్ళు తెరిచే నాటికే పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కానీ స్కూళ్ళకు మళ్ళీ సెలవులొస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తొలిదశ స్కూళ్లకే.. రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ స్కూళ్ళల్లో తొలివిడతగా ఈ సంవత్సరం 9,123 స్కూళ్ళను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి దశలో చేపట్టే పనులను రూ.3,497 కోట్లతో పూర్తి చేయాలని భావించారు. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు, రంగులు వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ బోర్డులు, ప్రహరీ గోడలు కట్టడం, వంటగది ఏర్పాటు, మరమ్మతులు, శిధిల భవనాల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, డిజిటల్ సౌకర్యాల వంటి 12 రకాల పనులు ఈ నిధులతో చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇప్పటివరకు 8,833 బడులకు పరిపాలన అనుమతులు రాగా 7,211 బడుల్లో పనులు మొదలయ్యాయి. ఇప్పటివరకు 1,200 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. ముందుకురాని కాంట్రాక్టర్లు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్ని స్కూళ్లకైనా మరమ్మతులు చేసి, మెరుగ్గా చూపించాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో భావించింది. ఈ దిశగా వివిధ శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సమీక్ష జరిపారు. కానీ ప్రతిచోట ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. రూ.30 లక్షల లోపు పనులన్నీ స్థానిక విద్యా కమిటీ నేతృత్వంలో చేయించే అవకాశం ఉంది. అంతకు మించితే టెండర్లు పిలవాలి. ఇలాంటి పనులు 2 వేల వరకు ఉన్నాయి. విద్యా కమిటీ నేతృత్వంలో ఎక్కువగా చిన్నా చితక పనులే చేపడుతున్నారు. కరెంట్ వైర్లు సరి చేయడం, గోడలకు రంగులేయడం, పెచ్చులూడితే ప్లాస్టింగ్ చేయడం వంటివే ఉంటున్నాయి. నిర్మాణాలు, శౌచాలయాల (మరుగుదొడ్లు) ఏర్పాటు వంటి పనులు ఎక్కడా మొదలవ్వలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలైనా నిధులు అందక ఆగిపోతున్నాయి. దీంతో చాలాచోట్ల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించ లేదు. సకాలంలో బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదంటూ వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు. ఎక్కడైనా ఇదే పరిస్థితి... ►ఆదిలాబాద్ జిల్లా మావల–1 మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మాణానికి మన ఊరు–మన బడి పథకం కింద టెండర్లు పిలిచారు. కానీ ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. మావల–2 మండల కేంద్రంలోని మరో ప్రైమరీ స్కూల్ నిర్మాణం పనులు మొదలైనా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పని ఆపేశాడు. బజార్ హత్నూర్ మండలం కోల్హారిలో రూ.12 లక్షలతో ప్రతిపాదించిన స్కూల్ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తవ్వలేదు. ►హనుమకొండ సుబేదారిలోని హైస్కూల్లో తరగతి గదుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ పనుల మాత్రమే మొదలు పెట్టారు. పగిలిపోయిన ఫ్లోరింగ్ గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రమాదకరంగా మారిందని మన ఊరు–మనబడి సమీక్షల్లో చెప్పినా స్పందన కరువైందని స్థానికులు తెలిపారు. సుబేదారి ప్రైమరీ స్కూల్లో శౌచాలయాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ►మంచిర్యాల జిల్లా జన్నారంలో పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. పొన్నెకల్ ప్రాథమిక స్కూల్ భవన నిర్మాణం పిల్లర్ల దశలో ఉంది. ధర్మారంలోని స్కూల్ బిల్డింగ్ ఇంకా రూఫ్ లెవల్లోనే ఉంది. కలమడుగు గ్రామంలోని స్కూల్లో శౌచాలయాల నిర్మాణం పునాదుల దశలోనే పురిటినొప్పులు పడుతోంది. ►నిర్మల్ జిల్లా కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చోవాల్సిన పరిస్థితి. అదే గదిలో విద్యార్థులకు వంట చేయడం జరుగుతోంది. పాడుబడ్డ మరుగుదొడ్ల కారణంగా ఆరుబయలే దిక్కవుతోంది. ►జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నత పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. గదుల నిర్మాణం కోసం ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. -
‘మన ఊరు–మనబడి’ పనుల వేగం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన ఊరు–మనబడి’తొలిదశలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, దీనివల్ల పాఠశాలల రూపురేఖలే మారిపోతాయని స్పష్టచేశారు. ‘మన ఊరు–మన బడి’పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం వీడియో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఈ నెలాఖరుకు ప్రతీ మండలంలో కనీసం రెండు పాఠశాలల్లోనైనా పనులుపూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి రూ.7,289 కోట్లను కేటాయించామని, తొలిదశలో భాగంగా 9,123 స్కూళ్లకు 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించామని వెల్లడించారు. ఈ పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులను వేగవంతం చేయాలని కోరారు. పనులను పర్యవేక్షిస్తున్న ఏజెన్సీలతోను, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ చివరి నాటికి 1,210 పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను కోరారు. వీటికీ డ్యూయల్ డెస్క్‌లను అందజేయాలని, గ్రంథాలయాలను, ఆట స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
RS Praveen Kumar: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మెహిదీపట్నంలోని భోజగుట్ట బస్తీలో ప్రభుత్వ పాఠశాలను ఇటీవల సందర్శించాను. అక్కడ పాఠశాల ప్రాంగణంలోనే అంగన్ వాడీ కేంద్రం కూడా ఉంది. అందులో 20 మంది చిన్నపిల్లలున్నారు. కానీ ఆ గదిలో కనీసం కరెంటు లేదు. పాఠశాల విద్యార్థులు తరగతి గదులు లేక నాలుగు, ఐదవ తరగతుల పిల్లలు ఒకే గదిలో కూర్చోగా, ఒకటవ తరగతి పిల్లలు బయట వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు. ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థికి కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. యూనిఫాం అందలేదు. పాఠశాల పక్కనే కాలనీవాసులు చెత్తను పడేస్తున్నారు. ఇదీ తెలంగాణలో విద్యావ్యవస్థ పరిస్థితి. రాజధాని నగరంలోనే ఇలా ఉందంటే ఇక గ్రామాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. బడులను బాగుచేస్తామని చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ పథకం వంటివి ఇప్పుడు అయినవారికీ, బడాబాబులకూ దోచిపెట్టే మార్గాలుగా మారడం దారుణం. ‘మన ఊరు– మన బడి’ పథకం కింద రూ.7,200 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. గత మే నెలలో పాఠశాలల్లో చిన్న, పెద్ద మరమ్మత్తుల కోసం రూ.1,539 కోట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి 24 గంటల లోపే రద్దు చేశారు. తిరిగి రాత్రికి రాత్రే నోటిఫికేషన్ లోని విధివిధానాలు మార్చారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఏడాదికి రూ. 180 కోట్ల రాబడి ఉన్న సంస్థలే అర్హమైనవి. ఈ ఆదాయం, అర్హత ఎవరికి ఉంటుంది? కచ్చితంగా బహుజన వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణపేదలు) ప్రజలకు అయితే ఉండదు. కేవలం బడా కాంట్రాక్టర్లకు మాత్రమే అర్హత ఉంటుంది. పెద్ద కాంట్రాక్టర్లయినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండేవారికే టెండర్లు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని, పేదలకు ఉపయోగపడాల్సిన బడ్జెట్‌ను కేవలం ఆయనకు సన్నిహితులైన ఒకరిద్దరికే దోచిపెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నది. కాకపోతే ఏమిటి? కేవలం రూ.4,500కు వచ్చే డ్యూయల్ డెస్క్ ధరను అమాంతం రూ. 12,000కు పెంచి, వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అధికారికంగా చెల్లించే పనికి ఒడిగట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జైళ్లలో ఉండే ఖైదీలు తయారుచేసిన వస్తువులను కూడా అతితక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతోంది. గ్రీన్ బోర్డు ఒక చదరపు ఫీట్ ధరను రూ. 280 నుండి రూ. 370కి పెంచారు. అయితే మొదటిసారి టెండర్ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందిస్తూ టెండర్ దాఖలు చేసిన సంస్థలు... తాము అర్హులమైనా తమను అనర్హులుగా ప్రభుత్వం ఎలా తమ టెండర్లను తిరస్కరిస్తుందని ప్రశ్నిస్తూ హైకోర్టుకు ఎక్కాయి. కోర్టులో ఈ వివాదంపై వాదనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం రెండోసారి పిలిచిన టెండర్లనూ రద్దు చేస్తున్నట్లు కోర్టుకు తెలియచేసింది. దీనర్థం ఏమిటి? మేం మొదటి నుంచీ ‘మన ఊరు– మన బడి’ పనుల టెండర్లలో అవకతవకలూ, ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని ఆరోపిస్తున్న విషయాలు నిజమే అని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా. అంతా సజావుగా ఉంటే రెండోసారీ టెండర్లను ఎందుకు రద్దుచేసినట్లు? ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాల భవనాలకు పెయింటింగ్ వేసే కాంట్రాక్టులనూ బడా కాంట్రాక్టర్లే దక్కించుకునేలా నిబంధనలు రూపొందిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పారిశ్రామికవేత్తల గతేం కావాలి? ఇదంతా చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగా ఎంఎస్ఎంఈలు మూతపడేలా ప్రభుత్వమే పాటుపడుతున్నదని అర్థమవుతోంది. ఒకపక్క విదేశాలకు వెళ్ళి, అనేక రాయితీలు ప్రకటించి అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్... ఇదే రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు, రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు. 5,000 ఎంఎస్ఎంఈలు మూత బడుతుంటే ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లతోపాటూ ఎంఎస్ఎంఈలనూ టెడర్ల ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే చిన్నాచితక కంపెనీలు నడుపుతున్న బహుజనులకూ అభివృద్ధి చెందే అవకాశం దక్కుతుంది. తెలంగాణలోని పేద ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను అర్థం చేసుకోవాలి. మోసానికి గురవుతున్న మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ‘మన ఊరు – మన బడి’ పథకానికి కావా ల్సిన నిధులను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి కూడా సేకరిస్తున్నది కానీ, జీఓ నం. 59/2018, జీఓ నం. 32/2022లు చెప్పిన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇవ్వాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మోసం చేస్తోంది. ఒక్క విద్యా వ్యవస్థలోనే కాదు మిగతా రంగాలలోనూ ఈ దోచిపెట్టే పని కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన 1.15 లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులో గానీ, రూ. 36 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో గానీ ఒక్క బహుజనుడు కూడా కాంట్రాక్టరుగా లేడు. ఈ అన్యాయాన్ని మిగతా పార్టీలవారు ఎవరూ ప్రశ్నించడం లేదు. బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే కాంట్రాక్టుల్లో మా బహుజనుల వాటా ఏదని ప్రశ్నిస్తోంది. గత 70 ఏళ్లుగా బహుజన సమాజం మోసపోతున్నది. ఆధిపత్య పార్టీల నాయకులు బహుజనులను కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు. సంపద ఉన్న చోటికి వారిని రానివ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఒక బహుజనుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోకపోతే, తెలంగాణ రాష్ట్ర ఆస్తి, వనరులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకే పేద ప్రజల సొమ్మును ఎత్తుకుపోయే రాబందుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. బహుజన తెలంగాణను సాధించాలి, తెలంగాణ అమరుల ఆశయాలను నిజం చేయాలి. (క్లిక్: పోడు రైతుకు హరితహారం గండం) - డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ -
తెలంగాణకు కేంద్రం మొండిచేయి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్నింటా మొండి చేయి చూపుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘మన ఊరు – మన బడి’ కోసం మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.3,497 కోట్లలో రూ.2,700 కోట్లు కేంద్రం నిధులేనంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధారాలతో సహా నిరూపించాలని మంత్రి సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’కి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని, దానికి అధిక మొత్తంలో నిధులిచ్చి పనులను చేపట్టిందని, ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిని మించి రూపొందిస్తుంటే చూసి ఓర్వలేక బండి సంజయ్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం రాష్ట్రానికి ఒక్క కేంద్ర విద్యా సంస్థనూ ఇవ్వలేదని, ఈ అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులెవ్వరికీ ధైర్యం లేదని ఆమె ధ్వజమెత్తారు. ‘బేటీ బచావో– బేటీ పడావో’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూళ్లను ఎత్తివేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని మంత్రి ఎద్దేవా చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బడిబాటలో బీజేపీ నాయకులు కూడా పాల్గొనాలని ఆమె కోరారు. విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడుతోందని, విద్యార్థుల సౌలభ్యం కోసం ద్విభాషా పుస్తకాలను ముద్రించి ఇస్తోందని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరై పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొల్పాలని ఆమె కోరారు. -
బాగు‘బడి’నవి
రంగులతో కళకళలాడుతున్న ఈ భవనం రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న చల్లా లింగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మన ఊరు–మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం ఈ పాఠశాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది. ఇది సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలికల పాఠశాల. ఇది మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా తయారైంది. ఈ పాఠశాలకు ప్రత్యేకంగా రూ.3.50 కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి చేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : .. ఈ రెండు స్కూళ్లే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ బడులన్నింటి రూపుమార్చేందుకు ‘మన ఊరు– మన బడి’తో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడుబడిన భవనాలు, శిథిలాస్థకు చేరిన బెంచీలు, కుర్చీలు, జాడలేని ల్యాబ్‌లు, టాయిలెట్లు, మంచినీటి వసతికీ కరువు ఉండే పరిస్థితులకు చెక్ పెట్టే చర్యలు చేపట్టింది. దశలవారీగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వందలాది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైంది. దశల వారీగా.. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పక్కా భవనాలు, ప్రహరీలు, టాయిలెట్లు, వంట గది, భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, ల్యాబ్‌లు.. ఇలా 12 రకాల సదుపాయాలను కల్పించేలా చర్యలు చేపట్టింది. ‘మన ఊరు– మనబడి’ కింద మొత్తంగా రాష్ట్రంలోని 26,072 ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో రూ.7,300 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటి దశ కింద ఈ ఏడాది 9,123 స్కూళ్లలో రూ.3,497 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో 40శాతం (రూ.2 కోట్లు) పాఠశాలల అభివృద్ధికే వెచ్చించేలా చర్యలు చేపట్టింది. ఇందులో ఇప్పటికే ఒక్కో పాఠశాలలో రూ.30లక్షలలోపు విలువైన పనులకు గత నెలలో శంకుస్థాపనలు చేశారు. కొన్నిజిల్లాల్లో పనులు వేగంగా సాగుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఎక్కువ నిధులు అవసరమయ్యే పనులను త్వరలోనే చేపట్టనున్నారు. పాఠశాలకు కొత్త రూపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంతో పాఠశాలకు కొత్త రూపు వస్తోంది. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందనున్నాయి. – తాండ్ర నర్సింహ, జిల్లెలగూడ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ -
త్వరలో 21 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: సబిత
సాక్షి, హైదరాబాద్: విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశామని, కేజీ టు పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ‘మన ఊరు మన బడి... మన బస్తీ మన బడి’ పథకంపై సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. మంత్రి సబిత ఏమన్నారంటే.. ►మూడు దశల్లో స్కూళ్లను ఆధునీకరిస్తాం. రూ. 7,289.54 కోట్ల మొత్తం బడ్జెట్ ఖర్చుతో 26,065 పాఠశాలల్లో పనులు చేపడతాం. ►మొదటి దశలో రూ. 3,497.62 కోట్ల అంచనా బడ్జెట్‌తో బడులను బాగు చేస్తాం. మొదటి దశలోనే 9,123 స్కూళ్లను ఎంపిక చేశాం. మన ఊరు–మన బడి పథకంలో పూర్వ విద్యా ర్థులను, దాతలను భాగ స్వాములను చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆయన చది విన స్కూలుకు రూ.3.5 కోట్ల విరాళం ఇచ్చారు. ►ఎవరైనా రూ.2 లక్షలు ఖర్చు చేస్తే స్కూలు సభ్యుడిగా ఉంచుతాం. రూ.10 లక్షలు ఖర్చు చేస్తే వారి పేరు పెడతాం. ►ప్రాథమికపాఠశాలకు రూ.25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.50 లక్షలు, ఉన్నత పాఠశాలకు కోటి ఖర్చు చేస్తే దాతల పేర్లు పెడతాం. ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ... టీచర్లకు 14 నుంచి ఆంగ్లభాషపై శిక్షణ ఇస్తామని సబిత తెలిపారు. విద్యాశాఖలో త్వరలోనే 21 వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 973 గురు కులాలను ఏర్పాటు చేస్తే అడ్మిషన్లు కావాలని ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు. -
మారనున్న బడుల స్వరూపం.. ‘మన ఊరు- మన బడి’కి సీఎం కేసీఆర్ శ్రీకారం
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయనకు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఏర్పాటు చేసిన నూతన మార్కెట్ యాడ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం పైలాన్ బాలుర ప్రభుత్వం పాఠశాలలో ఆవిష్కరించారు. చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసే కార్యక్రమానికి వనపర్తి వేదికగా శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. సర్కారు బడుల్లో చక్కటి వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులంతా శ్రద్దగా చదువుకోవాలని సీఎం సూచించారు. మేమంతా సర్కారు బడుల్లో చదివామన్నారు ‘‘వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్‌లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో ఏర్పాటవుతాయన్నారు. భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: బడి.. బాగు.. కాగా, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.2,477 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.7,289 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహిళా యూనివర్సిటీకి, అటవీ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించింది. గత ఏడాది విద్యారంగం కేటాయింపులు రూ.13,608 కోట్లు ఉంటే.. ఈసారి ఈ పద్దు రూ.16,085 కోట్లకు చేరింది. ఉన్నత విద్యకు గత ఏడాది రూ.1,873 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.2,357.72 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు గత ఏడాది రూ.11,735 కోట్లు ఉంటే, ఈసారి ఇది 13,725.97 కోట్లకు పెరిగింది. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగం వాటా గత ఏడాది 6.1 శాతంగా ఉంటే, ఈసారి 6.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
ఇది బాల రచయితల ఒడి!
తెలంగాణ సాహిత్య అకాడమీ మరొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాహిత్యాన్ని యూనివర్సిటీ లైబ్రరీల నుండీ, అకాడమీ ప్రాంగణాల నుండీ పల్లె బాట పట్టించనున్నది. బహుజన వాడల నుండి గిరిజన గూడేలదాకా పరుగు పెట్టించ నుంది. అందులో భాగంగా అకాడమీ మరో ముఖ్యమైన మైలురాయిని ఈరోజు (మార్చ్ 4) దాటుతోంది. తెలంగాణలోని ప్రతి బడిలోని పిల్లలూ ‘మన ఊరు–మన చెట్టు’ వస్తువుగా కథలు రాయనున్నారు. తమ మాతృభాషలో తమ సృజన శక్తులకు మెరుగు పెట్టుకోను న్నారు. ఈ కథల యజ్ఞానికి వెన్నుదన్నుగా ఉన్నది తెలంగాణ సాహిత్య అకాడమీ. పిల్లలు రాసిన కథల నుండి ఉత్తమమైన 1000 కథలతో ఒక బృహత్ సంకలనం తీసుకు రానున్నది అకాడమీ. కథా రచన ద్వారా పిల్ల ల్లోని సృజనకి పదును పెట్టి వాళ్ళలోని క్రియే టివ్ స్కిల్స్‌కి ఒక చోదక శక్తిలా నిలుస్తున్నది. కేసీఆర్ దార్శనికతతో నిర్మితమవుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్న పురో భివృద్ధిలో భాగంగా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత, కొత్త తరాలకు వారధిగా తెలంగాణ మట్టి పునాదులతో సాహిత్య రంగం ముందుకు సాగాలని కేసీఆర్ సాహిత్య అకాడమీని పునరుద్ధరించారు. ఆయన ఆదేశాలతో సాహిత్య అకాడమీ తన పనిని విస్తృతం చేసుకొని ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే సాహిత్య అకాడమీ తొలి సారిగా 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ‘మన ఊరు – మన చెట్లు’ అన్న అంశంపై కథలు రాయించే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీసు కున్న శ్రద్ధ కూడా తోడైంది. దీంతో పాఠశాల విద్యాశాఖ, సాహిత్య అకాడమీ సంయుక్త భాగ స్వామ్యంలో విస్తృత స్థాయిలో తెలంగాణలో బాల రచయితలందరూ కలాలు పడుతున్నారు. పిల్లల్లో తమ ఊరుపై ఉన్న అవగాహనను బయటకు తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. తన ఊరు, తాను నివసించే ప్రాంతంలోని చెరువు, చెట్లు, అందాలు, మత సామరస్యం, పండుగలు, ఆనందాలు, ఉత్స వాలు, ఉత్సాహాలు అన్నీ పిల్లలు మర్చిపోలే నివి. అదే పట్నంలోనైతే తన బస్తీ, తాను జీవించే ప్రదేశంలో నేటివిటీ వారిలో చెదిరి పోనిదే. పాఠశాలల్లో చదువుకునే పిల్లల్లో సొంత ఊరు లేదా పట్టణం... అందులో చెట్ల ప్రాము ఖ్యంపై ఉన్న అవగాహనను సృజనాత్మకంగా వెలికితీయడానికి వారి దగ్గరకే వెళ్లి, తరగతి గదినే కార్యశాలను చేసుకుంది సాహిత్య అకా డమీ. ఆ కథల బడిలో మంత్రి సబితతోపాటూ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్ పాల్గొంటున్నారు. సర్వశిక్షా అభియాన్ పర్య వేక్షణలో సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమానికి రూపురేఖలు దిద్దింది. ఈ కథల బడిలో పాల్గొనే విద్యార్థులు వారి వారి మాతృభాషల్లోనే కథలు రాస్తున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూల నుంచి ఏ భాషలోనైనా రాయవచ్చును. ఆదివాసీ తెగలకు చెందిన పిల్లలు తాము మాట్లాడే భాషలకు లిపి లేనం దున వారి మాతృభాషలోనే తెలుగు లిపిలో రాయవచ్చును. మాతృభాషకు లిపిలేక పోయినా ఆ పిల్లలు అద్భుతమైన ఆవిష్క రణలు చేయగలరు. అందుకే మాతృభాషలో రచన చేసేందుకు అవకాశం ఇచ్చాము. వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్ ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ -
వసతులతో కొత్త వన్నెలు..
సాక్షి, హైదరాబాద్: ‘మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి’ పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టడం, ఇందుకోసం రూ.7,289.54 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం కావడంతో సర్కారీస్కూళ్ల రూపురేఖలు మారతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి దశలో విద్యార్థుల హాజరు ఎక్కువ ఉన్న 9,123 స్కూళ్లను ఎంపిక చేసిన అధికారులు, వీటికి రూ.3,497 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి చాలా ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్ల ల్లోనే విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలూ ఉన్నాయి. కానీ అవి ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. అనేక పాఠశాలల భవనాలు కూలి పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మూత్ర శాలలు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు బల్లలు, టీచర్లకు కుర్చీలు వంటి సదుపాయాలు లేక ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ సర్కారీ స్కూలు విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని గత ఏడాది ప్రభుత్వం జరిపిన సర్వేలోనే వెల్లడైంది. దీని ఆధారంగానే ఇప్పుడు ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు పెరిగినా.. కరోనాతో పేద, మధ్య తరగతి వర్గాల ఆర్థిక స్థితి గ తులు చితికిపోవడం, ప్రైవేటు స్కూళ్లు ఫీజుల వసూళ్లకు అనుసరిస్తున్న వైఖరితో కొన్ని వర్గాలు ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లారు. దీంతో కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు దాదాపు 2.5 లక్షల వరకూ పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం 26,072 ప్రభుత్వ పాఠశాలు ఉంటే, ఇందులో 22.93 లక్షల మంది విద్యార్థులున్నారు. చేరికలు పెరుగుతున్నా ఉన్న వనరులు, సదుపాయాలతోనే ప్రభుత్వ బడులు నెట్టుకురావాల్సి వస్తోంది. మోక్షం కలిగినట్టేనా? డిజిటల్ విద్యకు, అలాగే స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యల వారీగా నిధులు ఖర్చు చేయనుండటంతో ఆయా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పథకానికి కొన్ని సవరణలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు దీనిపై పెదవి విరుస్తున్నారు. నిర్మాణ పనులకు గతంలో వేసిన అంచనాల ఆధారంగా నిధుల కేటాయింపు జరిగిందని, ప్రస్తుతం చాలా వస్తువుల ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతతో కూడిన నిర్మాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిధుల కొరత కారణంగా వంట గదులు చిన్నగా నిర్మించారు. దీంతో ఆయా గదుల్లో పెద్ద పాత్రలు కూడా పెట్టలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. వీటిని విశాలంగా నిర్మిస్తారా? ఉన్నవాటినే మెరుగుపరుస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయం ప్రభుత్వ స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పన ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయం. అయితే పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టే చోట పెరిగే విద్యార్థుల సంఖ్యను పరిగణనలోనికి తీసుకోవాలి. వంటగదుల నిర్మాణం ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. విద్యార్థులకు వసతుల కల్పన మంచి ఫలితాలనిస్తుంది. – అరుణ శ్రీ, హెచ్ఎం నల్లగొండ హంగులు పెంచితే అంతా సర్కారు బడికే వసతుల్లేక, బోధన సరిగా జరగడం లేదనే భావనతోనే తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లను ఇష్టపడుతున్నారు. నిజానికి అక్కడా ఇరుకు గదుల్లోనే బోధన సాగుతోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఎక్కువమంది ముందుకొస్తారు. – కె గోపాల్ చక్రవర్తి, హేమచంద్రాపురం, భద్రాద్రి కొత్తగూడెం (విద్యార్థి తండ్రి) -
బడుల బాగుకు రూ.7 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: బడుల్లో మౌలిక వసతులను పెంచేందుకు చేపట్టిన ‘మన ఊరు–మన బడి’, ‘మన బస్తీ–మన బడి’కార్యక్రమాలకు తొలిదశలో రూ.7,289.54 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, టాయిలెట్ల ఏర్పాటు వంటివాటిని ఈ నిధులతో సమకూర్చనున్నారు. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడాన్ని ల క్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘మన ఊరు–మనబడి’, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ–మన బడి’పేరుతో ఈ పథకం అమలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో.. ► వచ్చే మూడేళ్లలో అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొ లిదశ కింద అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లలో రూ.3,497.62 కోట్లతో పనులు చేస్తారు. ఒక కేంద్రంలో రెండు పాఠశాలలున్నా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. పథకం నిర్వహణను (టెండర్లు, ఇతర నిధుల ఖర్చు) మొత్తం ఆన్లైన్ ద్వారానే చేపడతారు. ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసే ఉపకరణాలను రాష్ట్రస్థాయిలో ఎంపిక చేస్తారు. ► నీటి వసతితో టాయిలెట్ల ఏర్పాటు, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన ఫర్నిచర్, స్కూల్ మొత్తానికి రంగులు వేయడం, అన్నిరకాల మరమ్మతులు చేయడం, గ్రీన్ చాక్‌బోర్డ్‌ల ఏర్పాటు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్ల నిర్మాణం, ఆధునిక హంగులతో కొత్త క్లాసు రూముల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్యకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. ► ఈ పథకం కింద పనులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. వారే పాలనా పరమైన అనుమతులిస్తారు. అవసరమైన ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. సాంకేతికపరమైన అనుమతులను సంబంధిత ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పనులన్నీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల భాగస్వామ్యంతో చేపడతారు. పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఏసీడీపీ, జెడ్పీపీ, ఎంపీపీ తదితర సంస్థల ద్వారా సమకూరుస్తారు. ► పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)లు ఒకవేళ పనులు చేయడానికి ఆసక్తి చూపని పక్షంలో కలెక్టర్ ఆధ్వర్యంలోనే చేపడతారు. పనులు పూర్తయినట్లుగా ఎంబీ రికార్డు అయ్యాకే ఆన్లైన్లో నిధులు చెల్లిస్తారు. ఎస్ఎంసీలకు నిధుల విడుదలకు సంబంధించి.. ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అసిస్టెంట్ ఇంజనీర్, సర్పంచ్ నలుగురూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ► పాఠశాలలకు రూ.రెండు లక్షలు దానం చేసే దాతలను కూడా కమిటీలో భాగస్వాములను చేస్తారు. పదిలక్షలు ఇస్తే.. వారు కోరిన పేరును ఒక క్లాస్‌రూమ్‌కు పెడతారు. ► ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేస్తారు. అందులో చురుకుగా ఉండే ఇద్దరిని, ఎస్‌ఎంసీలోని ఇద్దరు, సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడితో పాఠశాలల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తారు. పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు..: సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, సరికొత్త ఒరవడితో ముందుకు తీసుకెళ్లేందుకు మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఈ కార్యక్రమంపై విద్యా శాఖ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని టీసీఎస్ సంస్థకు మంత్రి సూ చించారు. పాఠశాలల సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు–మనబడి కార్యక్రమం కింద రూ.7,289 కోట్లు వెచ్చించి.. 12 రకాల కనీస సౌకర్యాలను కల్పించనున్నట్టు తెలిపారు. అందులో తొలిదశ కింద 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. -
తెలంగాణలో సర్కారీ స్కూళ్లు సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.7,289 కోట్ల ఖర్చుతో రెండేళ్ళ కాలపరిమితితో స్కూళ్ళలో మరమ్మతులు చేపట్టాలని, కనీస వసతులు కల్పించా లని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సర్కార్ ‘మన ఊరు– మన బడి’పథకానికి ప్రాణం పోసింది. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు సరైన భవనాలు లేవు. కనీస సదుపాయాలు అంతకన్నా లేవు. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. తరగతి గదుల కొరత.. దీంతో చెట్ల కిందే చదువులు. హెచ్ఎంతో మాట్లాడేందుకు వెళ్లే టీచర్ నిలబడే మాట్లాడాలి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అవసరమైన ఫర్నిచరే లేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఎంపిక చేసి పనులు కొనసాగిస్తున్న హైదరాబాద్ పరిసరాల్లోని నాలుగు స్కూళ్ళతో పాటు రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలూ ప్రైవేటుకు దీటుగా తయారు కానున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన చేరికలు ► కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. 2021లో ఏకంగా 2.50 లక్షల మంది కొత్తగా చేరారు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. తరగతులు జరగక పోయినా ఆయా స్కూళ్లు ఫీజులు వసూలు చేయడం, మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపారు. అయితే ఇప్పటికే పాత భవనాలు, చాలీచాలని వసతులతో సర్కారీ స్కూళ్లలో ఇబ్బందులెదురవుతున్నాయి. తాజాగా లక్షల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యతో ఇక్కట్లు మరీ తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. దాదాపు 9,123 ప్రభుత్వ స్కూళ్ళల్లో తీవ్రమైన సమస్యలున్నట్టు గుర్తించింది. ► పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,285 స్కూళ్లున్నాయి. 2018–19 లెక్కల ప్రకారం 10,230 పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేవు. చాలా క్లాసులకు ఉపాధ్యాయులు చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. కొన్ని స్కూళ్ళల్లో వరండాల్లో చదువులు చెబుతున్నారు. ► శిథిలావస్థకు చేరిన స్కూళ్ళ సంఖ్య 4 వేలకు పైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 5 వేల స్కూళ్ళకు తాత్కాలిక మరమ్మతులు అవసరం. ఏ చిన్న వానొచ్చినా గదుల్లోకి నీళ్ళొస్తున్నాయి. కొన్ని స్కూళ్ళలో ఎప్పటికప్పుడు ఎక్కడ పై కప్పు పెళ్లలు మీద పడతాయోననే ఆందోళనతోనే గడుపుతున్నారు. ► 2018 లెక్కల ప్రకారమే 8,725 పాఠశాలలకు ప్ర హరీ గోడల్లేవు. ఇప్పుడీ సంఖ్య మరో 4 వేలకు పెరిగిందని ఓ అధికారి తెలిపారు. ప్రహరీలు లే క పశువులు స్కూళ్లలోనే మకాం పెడుతున్నాయి. ► ఇప్పటికీ 9 వేలకు పైగా స్కూళ్ళల్లో మరుగుదొడ్లు లేవు. స్కూలు పరిసరాల్లో చిన్నాచితకా దు కాణాలు, జన సముదాయం ఉండటంతో శౌచా లయ కార్యకలాపాల కోసం విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. బాలికలకు ఇంటికెళ్ళ డం మినహా ప్రత్యామ్నాయం కన్పించడం లేదు. నిధుల కొరతే అడ్డంకి.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరతే ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్రావతరణ తర్వాత తొలి బడ్జెట్లో విద్యా రంగానికి 10.89 శాతం కేటాయిస్తే... ఇప్పుడది 6.79 శాతానికి తగ్గింది. బడుల్లో మౌలిక వసతుల కోసం ఏటా రూ. 2 వేల కోట్ల చొప్పున రెండేళ్ళ పాటు ఖర్చు చేస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రటించింది. అయితే ఇది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. రాష్ట్రంలో 3,634 పాఠశాలలకు రూ.109 కోట్లతో మెరుగులు దిద్దేందుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదననలు సిద్ధం చేసింది. ఈ ఖర్చులో 60 శాతం సమకూరుస్తానని చెప్పిన కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ‘మన ఊరు–మనబడి’పేరుతో నిధులు మంజూరు చేసి పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై అన్నివర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చెట్ల కింద పాఠాలు.. ప్రహరీ గోడలకు బ్లాక్ బోర్డులు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో చాలా తరగతులు చెట్ల కిందే సాగుతున్నాయి. గతంలో ఐదవ తరగతి వరకే ఉన్న ఈ పాఠశాలను కొన్నేళ్ల క్రితం 8వ తరగతి వరకు పెంచారు. దీంతో విద్యార్థుల సంఖ్య 120 నుంచి 152 అయింది. పాఠశాల శిథిలావస్థకు చేరటంతో 2016లో కొన్ని గదులు కూల్చివేశారు. కానీ ఇప్పటివరకు కొత్తగా పాఠశాలను నిర్మించలేదు. కొత్త గదులూ ఏర్పాటు చేయలేదు. దీంతో టీచర్లు, విద్యార్థులు వేసవి, వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రహరీ గోడలకే బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి పాఠ్యాంశాలు నేర్పిస్తున్నారు. ఇక పాఠశాలలో తాగునీరు, మూత్రశాలల వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన మూత్రశాలలనే బాలికలు వాడుకుంటున్నారు. బాలురు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ‘ఆలియా’కు కొత్త అందాలు హైదరాబాద్ నగరం నడిబొడ్డున గన్‌ఫౌండ్రీలో శిథిలావస్థలో ఉన్న ఏళ్లనాటి ఆలియా ప్రభుత్వ మోడల్ పాఠశాల భవనం ఆధునిక హంగులు అద్దుకుం టోంది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో 148 మంది, ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.‘మన ఊరు–మన బడి’ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో 2 నెలలుగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనాల్లో ఒక భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మరో భవనంలోని తరగతి గదులన్నీ పెచ్చులూడిపోయాయి. వర్షాకాలంలో గదుల్లోకి తేమ వస్తోంది. కాగా పైలట్ ప్రాజెక్టు కింద రెండో భవనం మరమ్మతు పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాల కింద ఆధునీకరించిన మరుగుదొడ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు కల్పించనున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విజ్ఞానం పెంపొందించే చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్‌లు సిద్ధంకానున్నాయి. -
30 వరకు మన ఊరు–మనబడి
ఒంగోలు: విద్యా సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఎట్టకేలకు మన ఊరు–మనబడి ఉత్తర్వులను విద్యాశాఖ కమిషనర్ కన్నెగంటి సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 23 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని పేర్కొంటూ ఒక్కో విభాగానికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. పిల్లలు లేని పాఠశాలల మూసివేత, పిల్లలు అత్యంత తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం లేదా మూసివేయడం తదితరాలకు అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపా«ధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు సంయుక్తంగా పాఠశాలల్లో ప్రవేశాలను పెంచేందుకు శ్రద్ధ చూపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న పలు పథకాల గురించి కూడా వివరించి ప్రైవేటు విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమాల వివరాలు: 23వ తేదీ అంటే ఉత్తర్వులు వెలువడిన తొలిరోజు పాఠశాల యాజమాన్య కమిటీలు, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులతో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సమీక్షలు పాఠశాలల వారీగా జరగాలి. అంతేకాకుండా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ విధిగా అవసరమైన ప్రచార సామగ్రి, అడ్మిట్ కార్డులు, రిజిస్టర్లు పాఠశాలలకు పంపించాలి. 24వతేదీ: అంగన్వాడీ పాఠశాలల్లోని 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించాలి. 25వతేదీ: ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులను ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతిలో చేర్పించాలి. 26వ తేదీ: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7/8 పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో 8/9 తరగతిలో చేర్పించాలి. 27వతేదీ: ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఆకర్షించి వారిని ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు కృషి చేయాలి. ఇందుకు పోస్టుకార్డులు కూడా విద్యార్థుల గృహాలకు పంపించాలి. 29వ తేదీ: మురికివాడలు, శివారు కాలనీలు, మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు బడిలోకి చేరేందుకు కృషి చేయాలి. 30వతేదీ: ప్రభుత్వ/ మండల పరిషత్/ జిల్లా పరిషత్ పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల ప్రవేశ వివరాలను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ప్రచారం ఇలా: ప్రచారం సమయంలో ప్రధానంగా బడి బయట పిల్లలను, బడి మానిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు దృష్టి సారించాలి. ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులు బడి మానకుండా వారు తదుపరి చదువు కోసం పాఠశాలలో చేరేలా కృషి చేయాలి. ఉచిత విద్య, ఉచిత యూనిఫాం, నిపుణులైన ఉపాధ్యాయులు, అందుబాటులో డిజిటల్ క్లాసురూంలు/వర్చువల్ క్లాసురూంల నిర్వహణ, ఉచిత మధ్యాహ్న భోజనం (వారానికి 5 కోడిగుడ్లు), ప్రయోగశాల/గ్రం«థాలయం సౌకర్యం, రక్షిత తాగునీరు, టాయిలెట్ సౌకర్యం, సీసీఈ విధానంలో మానసిక ఒత్తిడిలేని విద్యాబోధన, ఆర్టీసీ లాంటి సర్వీసులలో ఉచిత/రాయితీతో కూడిన ప్రయాణం, శారీరక సామర్థ్యం పెంపు కోసం క్రీడలు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగ, బడికొస్తా పథకం కింద విద్యార్థినులకు సైకిళ్లు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు, బాలికల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు మార్షల్ ఆర్ట్స్, కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్, వృత్తి విద్య, కౌమారదశలోని బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ, కరువు మండలాల్లోని విద్యార్థినీ విద్యార్థులకు వేసవికాలంలో కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమలు వంటివాటిపై తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరించి ప్రవేశాలు పెంచాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ఉత్తర్వులు జారీచేశారు. ప్రవేశాల కోసం ప్రతిరోజు హెడ్మాస్టర్, ఉపాధ్యాయుడు ఒకరు తప్పనిసరిగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తల్లిదండ్రులను, గ్రామస్తులను, విద్యార్థులను కలుసుకోవాలి. కమిటీలు ఇలా: పాఠశాల స్థాయి కమిటీ: హెడ్మాస్టర్/ ఒక ఉపాధ్యాయుడు (చైర్మన్), పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ (వైస్ చైర్మన్), ప్రాథమిక పాఠశాల/ప్రాథమికోన్నత పాఠశాల/ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు(కన్వీనర్), సభ్యులుగా అంగన్వాడీ వర్కర్ ఉంటారు. మండల స్థాయి కమిటీ: ఎంపీడీవో/ ప్రత్యేక అధికారి (చైర్మన్), మండల విద్యాశాఖ అధికారి (వైస్ చైర్మన్), ఒక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ (కన్వీనర్), సభ్యులుగా క్లస్టర్ పాఠశాల హెడ్మాస్టర్, ఒక ఉపాధ్యాయుడు జిల్లాస్థాయి కమిటీ: జిల్లా కలెక్టర్ (చైర్మన్), జిల్లా విద్యాశాఖ అధికారి (వైస్ చైర్మన్), సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ (కన్వీనర్), సభ్యులుగా జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఐటీడీఏ ప్రాజెక్టుఆఫీసర్లు ఉంటారు. -
ఈ గట్టునే మనబడి
రాయవరం (మండపేట): మరో ఆరు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన వేసవి సెలవులు ఈ నెల 11తో ముగియనున్నాయి. 2018–19 విద్యా సంవత్సరంలో బడి ఈడు బాల బాలికలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘మన ఊరు–మన బడి’కి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆ గట్టునుంటారా.. ఈ గట్టుకొస్తారా.. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాలోని ఆ గట్టునుంటావా..ఈ గట్టుకొస్తావా అనే సినీ గీతాన్ని ప్రభుత్వ పాఠశాలలకు అన్వయించి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ తల్లిదండ్రుల దృష్టిని ఆకట్టుకుంటోంది. 6–14 సంవత్సరాల బాల, బాలికలందరినీ పాఠశాలల్లో చేర్పించడం లక్ష్యంగా విద్యాశాఖ ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి పూనుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో ఉన్న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో అమలవుతున్న సౌకర్యాలను వివరిస్తున్నారు. పలువురు ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతిని ఫ్లెక్సీలుగా వేసి తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్న విషయాన్ని వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, సైకిళ్ల పంపిణీ తదితర అంశాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పాఠశాలల్లో 30 వేల మంది విద్యార్థులను బడిలో చేర్పించగా, ఈ ఏడాది 36వేల మందిని అదనంగా చేర్పించాలని జిల్లా విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. గత విద్యా సంవత్సరంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య సంస్థల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 7లక్షల 32వేల 373 మంది విద్యార్థులు ఉండగా, నూతనంగా బడిలో చేరే విద్యార్థులతో కలిసి ఈ విద్యా సంవత్సరంలో 7లక్షల 68వేల 992 మంది ఉంటారని అంచనా. షెడ్యూల్ ఇలా.. మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని సక్రమంగా, సమర్ధవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లు, సీఆర్పీలు, ఐఈఆర్టీలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. బడి ఈడు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను వీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎస్ఎంసీ, తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం చిన్నారులను బడిలో చేర్పించాలి. లక్ష్యాన్ని మించి.. గతేడాది బడిలో చేర్పించిన చిన్నారుల సంఖ్యకు అదనంగా 10 శాతం మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించాం. లక్ష్య సాధనకు మించి చిన్నారులను చేర్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు అందరినీ భాగస్వాములను చేస్తున్నాం. – ఎస్.అబ్రహం, డీఈవో, కాకినాడ. -
నేటి నుంచి ‘మనఊరు–మనబడి’
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సోమవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు జిల్లాలో మనఊరు – మనబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మి ఆదివారం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారని చెప్పారు. వీటితో పాటు ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ తరగతుల ద్వారా బోధన చేస్తారన్నారు. ఆటలు, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, వ్యాయామం లాంటి అదనపు తరగతులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మార్షల్‌ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఒకేషనల్ విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జూన్ 5న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించటం, 6న ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 7న ఏడు, 8 తరగతులు పూర్తిచేసి బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తామన్నారు. 8న ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తామని చెప్పారు. 9న మురికివాడల్లోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పింస్తామని వివరించారు. -
ప్రభుత్వ స్కూళ్లలోనే చదివే కలెక్టర్‌నయ్యా
– విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ కర్నూలు సిటీ: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, వాటిలో చదివే తాను కలెక్టర్‌నయ్యానని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలపై కలెక్టర్ సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, మౌలిక సదుపాయలు కల్పించాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉంటుందన్నారు. అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే ఉన్నారనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ఐదేళ్లున్న పిల్లలందరినీ స్కూళ్లలో చేర్పించాలన్నారు. దీనిపై ఎంఈఓలు తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. జడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో చాలా ప్రైవేటు స్కూళ్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయని, తక్షణమే వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈఓ తాహెరా సుల్తానా, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.