రంగులతో కళకళలాడుతున్న ఈ భవనం రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న చల్లా లింగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మన ఊరు–మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం ఈ పాఠశాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది.
ఇది సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలికల పాఠశాల. ఇది మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా తయారైంది. ఈ పాఠశాలకు ప్రత్యేకంగా రూ.3.50 కోట్ల నిధులను కేటాయించి అభివృద్ధి చేశారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : .. ఈ రెండు స్కూళ్లే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ బడులన్నింటి రూపుమార్చేందుకు ‘మన ఊరు– మన బడి’తో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడుబడిన భవనాలు, శిథిలాస్థకు చేరిన బెంచీలు, కుర్చీలు, జాడలేని ల్యాబ్‌లు, టాయిలెట్లు, మంచినీటి వసతికీ కరువు ఉండే పరిస్థితులకు చెక్ పెట్టే చర్యలు చేపట్టింది. దశలవారీగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వందలాది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైంది.
దశల వారీగా..
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పక్కా భవనాలు, ప్రహరీలు, టాయిలెట్లు, వంట గది, భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, ల్యాబ్‌లు.. ఇలా 12 రకాల సదుపాయాలను కల్పించేలా చర్యలు చేపట్టింది. ‘మన ఊరు– మనబడి’ కింద మొత్తంగా రాష్ట్రంలోని 26,072 ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో రూ.7,300 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో మొదటి దశ కింద ఈ ఏడాది 9,123 స్కూళ్లలో రూ.3,497 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో 40శాతం (రూ.2 కోట్లు) పాఠశాలల అభివృద్ధికే వెచ్చించేలా చర్యలు చేపట్టింది. ఇందులో ఇప్పటికే ఒక్కో పాఠశాలలో రూ.30లక్షలలోపు విలువైన పనులకు గత నెలలో శంకుస్థాపనలు చేశారు. కొన్నిజిల్లాల్లో పనులు వేగంగా సాగుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఎక్కువ నిధులు అవసరమయ్యే పనులను త్వరలోనే చేపట్టనున్నారు.
పాఠశాలకు కొత్త రూపు
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంతో పాఠశాలకు కొత్త రూపు వస్తోంది. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందనున్నాయి.
– తాండ్ర నర్సింహ, జిల్లెలగూడ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment