ఆంక్షలు పెడితే..మరో ఉద్యమం | If restrictions on the movement .. | Sakshi
Sakshi News home page

ఆంక్షలు పెడితే..మరో ఉద్యమం

Published Wed, Feb 12 2014 2:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

If restrictions on the movement ..

సాక్షి, నల్లగొండ: ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణను ప్రకటించాలని కోరుతూ ప్రజాసంఘాలు, విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం బంద్ విజయవంతంగా, ప్రశాం తంగా జరిగింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి.

న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అన్నిచోట్ల నిరసనలు  మిన్నంటాయి. సీమాంధ్రుల దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఎటువంటి ఆంక్షలు పెట్టినా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సీమాంధ్రుల కుట్రలకు లొంగకుండా తక్షణమే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

 జిల్లాకేంద్రంలో....
 జిల్లాకేంద్రంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి క్లాక్‌టవర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. బీడీఎస్‌ఎఫ్, డీవీఎస్, టీవీఎస్, పీడీఎస్‌యూ, టీఆర్‌ఎస్‌వీ, టీవీవీ, టీఎంయూఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. బస్‌డిపో ఎదుట నిర్వహించిన ధర్నాను పోలీసులు విరమింపచేశారు. అనంతరం బైకు ర్యాలీతో విద్యాసంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలను, పెట్రోల్ బంకులను మూసి వేయించారు.
 
 జిల్లావ్యాప్తంగా....
 భువనగిరిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ప్రజాప్రంట్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. విద్యాసంస్థలను మూసివేశారు. బార్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. వలిగొండ, పోచంపల్లిలో విద్యాసంస్థలను మూసివేశారు.
 
 ఆలేరు నియోజకవర్గ కేంద్రంతోపాటు యాదగిరిగుట్ట, రాజపేట మండలాల్లో విద్యాసంస్థలు తెరచుకోలేదు. మిర్యాల గూడలో బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యం లో సీమాంధ్రుల దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. హుజూ ర్‌నగర్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ చేయించి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహిం చారు. స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు.
 
 సూర్యాపేట పట్టణంలో టీవీవీ, పీడీఎస్‌యూ (విజృంభణ) ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ నిర్వహించారు. కోదాడలో విద్య, వాణిజ్య సంస్థల బంద్ నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రాస్తారోకో చేశారు. తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో విద్యాసంస్థలు మూతబడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement