సాక్షి, నల్లగొండ: వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం చేసింది. ఆదివారం 278 కేంద్రాల్లో జరగనున్న వీఆర్‌ఓ పరీక్షకు 85,431 మంది, 14 కేంద్రాల్లో జరగనున్న వీఆర్‌ఏ 4,997 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జిల్లాకేంద్రంలోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షల నిర్వహణలో మొత్తం 4,815 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు.
అంతా వీడియో చిత్రీకరణ...
ప్రశ్నపత్రాలు తెరిచింది మొదలు పరీక్ష అనంతరం ఓఎమ్మార్ షీట్లు సీల్ చేసేంత వరకు వీడియో చిత్రీకరిస్తారు. అంతేగాక అభ్యర్థుల జేబులను చెక్ చేయడం, స్క్రైబ్స్(సహాయకులు)ని సైతం వీడియోలో బంధిస్తారు. ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు ఈ పద్ధతిని చేపడుతున్నారు.
స్క్రైబ్స్....
చేతులులేని, దృష్టిలోపం, మస్తిష్క పక్షవాతం ఉన్న అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరవుతున్నారు. ఇలా వీఆర్‌ఓ పరీక్ష 26, వీఆర్‌ఏ పరీక్ష 10 మంది అభ్యర్థులు రాస్తున్నారు. వీరికి సహాయకులుగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కి అప్పజెప్పారు. సహాయకులకు ఇన్విజిలేటర్‌తో సమానంగా వేతనం అందజేస్తారు. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు గంటకు 10 నిమిషాల అదనపు సమయాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.
అనుమతి లేకుండా పరీక్షకు హాజరైతే చర్యలే.. : ఉపాధ్యాయులకు డీఈఓ హెచ్చరిక
నల్లగొండ అర్బన్ : అనుమతి పొందకుండా వీఆర్‌ఓ పరీ క్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరిపై సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ జగదీష్ హెచ్చరించారు. పరీక్షా హాలులో ఐ స్కానింగ్, ఫొటోగుర్తింపు, ముఖాన్ని సరిపోల్చడం, వేలిముద్రల సేకరణ, వీడియో టెక్నాలజీ తదితర ఆధారాలతో పరీక్షకు హాజరైనట్లు గుర్తిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని చెప్పారు. జైలు జీవితం తథ్యమని పేర్కొన్నారు.
నేడు వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు
Published Sun, Feb 2 2014 5:12 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement