సాక్షి, నల్లగొండ: జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్య అటకెక్కింది. ఎంతసేపున్నా తరగతిగది బోధనకే విద్యార్థులు పరిమితమవుతున్నారు. విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ప్రయోగశాలలు అలంకారప్రాయంగా తయారయ్యాయి. ల్యాబ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. పరికరాలు తుప్పు పట్టి అల్మారాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ప్రయోగాలపై అవగాహన లేకుండా ఇంటర్ విద్యకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
ఇదీ దుస్థితి..
జిల్లాలో 600కుపైగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 180పైగా స్కూళ్లలో ప్రయోగశాలలు లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. కొన్ని పాఠశాలల్లో ప్రయోగశాలలు ఉన్నా, పరికరాల కొరత నెలకొంది. ఉన్న పరికరాల ద్వారా ప్రయోగాలు చేయించకపోవడంతో అవి బీరువాలకే పరిమితమవుతున్నాయి. మరికొన్ని చోట్ల పరికరాలను భద్రపరిచేందుకు బీరువాలు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.
అన్నీ సరిగా ఉంటే, ప్రయోగాల పట్ల ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. పాఠ్యపుస్తకంలో ఫలానా అంశంపై విద్యార్థులకు ప్రయోగం ద్వారా వివరించాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దాదాపు 80 శాతం బడుల్లో దీన్ని ఆచరించిన దాఖలాలు లేవన్నది వాస్తవం. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ప్రయోగాల ద్వారా సైన్స్ సబ్బెక్టులపై అవగాహన పెంపొందించాలి. ముఖ్యంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వారానికి నాలుగు చొప్పున జీవ, రసాయనశాస్త్రాలకు సంబంధించి ప్రయోగాత్మక విద్యనందించాలి. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రమే అప్పుడప్పుడు పరికరాలను చూపెట్టి వివరిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇదీ కూడా దిక్కులేదు.
అలసత్వం....
విద్య కోసం ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రయోగశాలల ఏర్పాటు విషయంలో సర్కారు, నిర్వహణ విషయంలో విద్యాశాఖాధికారులు అశ్రద్ధ వహిస్తుండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వం ఆయిల్ చార్ట్‌లను పంపేది, ప్రస్తుతం బడ్జెట్ కేటాయించి చేతులెత్తేస్తుండడంతో స్థానికంగా ఉండే నాణ్యత లేని చార్ట్‌లతో టీచర్లు సరిపెడుతున్నారు.
దిక్కులేని పరికరాలు...
సైన్స్ ఉపాధ్యాయులు ఉన్నా... పరికరాలు పూర్తిస్థాయిలో లేక విద్యాబోధన చేయలేని పరిస్థితి నెలకొంది. ఉన్న అరకొర సైన్స్ పరికరాలు ఉంచేందుకు ప్రత్యేకమైన ల్యాబ్ సదుపాయం లేదు. వేడిచేయడం, కరిగించడానికి గ్యాస్ తప్పనిసరి. కానీ గ్యాస్ వ్యవస్థను హైస్కూల్‌లో ఏర్పాటు చేయకపోవడంతో అందుకు దూరమవుతున్నారు. మైక్కోస్కోప్‌లు, స్ప్రింగ్ తాసులు పనిచేయడం లేదు. సల్ఫ్యూరిక్ ఆసిడ్, హైడ్రోజన్ పెరాకై ్సడ్, హైడ్రోజన్ క్లోరైడ్ వంటి రసాయనాలు కరువయ్యాయి. కనీసం లిట్మస్ పేపర్, పీరియాడిక్ టేబుల్‌కే దిక్కులేదు. దీంతో గత్యంతరం లేక చిత్రపటాలతో, బోర్డులపై పటాలు గీసి ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.
ప్రయోగానికి బూజు
Published Sun, Dec 15 2013 4:15 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement