ఒంగోలు: విద్యా సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఎట్టకేలకు మన ఊరు–మనబడి ఉత్తర్వులను విద్యాశాఖ కమిషనర్ కన్నెగంటి సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 23 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని పేర్కొంటూ ఒక్కో విభాగానికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. పిల్లలు లేని పాఠశాలల మూసివేత, పిల్లలు అత్యంత తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం లేదా మూసివేయడం తదితరాలకు అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపా«ధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు సంయుక్తంగా పాఠశాలల్లో ప్రవేశాలను పెంచేందుకు శ్రద్ధ చూపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న పలు పథకాల గురించి కూడా వివరించి ప్రైవేటు విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
కార్యక్రమాల వివరాలు:
23వ తేదీ అంటే ఉత్తర్వులు వెలువడిన తొలిరోజు పాఠశాల యాజమాన్య కమిటీలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులతో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సమీక్షలు పాఠశాలల వారీగా జరగాలి. అంతేకాకుండా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ విధిగా అవసరమైన ప్రచార సామగ్రి, అడ్మిట్ కార్డులు, రిజిస్టర్లు పాఠశాలలకు పంపించాలి.
24వతేదీ: అంగన్‌వాడీ పాఠశాలల్లోని 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించాలి.
25వతేదీ: ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులను ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతిలో చేర్పించాలి.
26వ తేదీ: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7/8 పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో 8/9 తరగతిలో చేర్పించాలి.
27వతేదీ: ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఆకర్షించి వారిని ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు కృషి చేయాలి. ఇందుకు పోస్టుకార్డులు కూడా విద్యార్థుల గృహాలకు పంపించాలి.
29వ తేదీ: మురికివాడలు, శివారు కాలనీలు, మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు బడిలోకి చేరేందుకు కృషి చేయాలి.
30వతేదీ: ప్రభుత్వ/ మండల పరిషత్/ జిల్లా పరిషత్ పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల ప్రవేశ వివరాలను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
ప్రచారం ఇలా: ప్రచారం సమయంలో ప్రధానంగా బడి బయట పిల్లలను, బడి మానిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు దృష్టి సారించాలి. ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులు బడి మానకుండా వారు తదుపరి చదువు కోసం పాఠశాలలో చేరేలా కృషి చేయాలి. ఉచిత విద్య, ఉచిత యూనిఫాం, నిపుణులైన ఉపాధ్యాయులు, అందుబాటులో డిజిటల్ క్లాసురూంలు/వర్చువల్ క్లాసురూంల నిర్వహణ, ఉచిత మధ్యాహ్న భోజనం (వారానికి 5 కోడిగుడ్లు), ప్రయోగశాల/గ్రం«థాలయం సౌకర్యం, రక్షిత తాగునీరు, టాయిలెట్ సౌకర్యం, సీసీఈ విధానంలో మానసిక ఒత్తిడిలేని విద్యాబోధన, ఆర్టీసీ లాంటి సర్వీసులలో ఉచిత/రాయితీతో కూడిన ప్రయాణం, శారీరక సామర్థ్యం పెంపు కోసం క్రీడలు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగ, బడికొస్తా పథకం కింద విద్యార్థినులకు సైకిళ్లు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు, బాలికల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకు మార్షల్ ఆర్ట్స్, కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్, వృత్తి విద్య, కౌమారదశలోని బాలికలకు శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ, కరువు మండలాల్లోని విద్యార్థినీ విద్యార్థులకు వేసవికాలంలో కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమలు వంటివాటిపై తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరించి ప్రవేశాలు పెంచాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ఉత్తర్వులు జారీచేశారు. ప్రవేశాల కోసం ప్రతిరోజు హెడ్మాస్టర్, ఉపాధ్యాయుడు ఒకరు తప్పనిసరిగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తల్లిదండ్రులను, గ్రామస్తులను, విద్యార్థులను కలుసుకోవాలి.
కమిటీలు ఇలా: పాఠశాల స్థాయి కమిటీ: హెడ్‌మాస్టర్/ ఒక ఉపాధ్యాయుడు (చైర్మన్), పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ (వైస్ చైర్మన్), ప్రాథమిక పాఠశాల/ప్రాథమికోన్నత పాఠశాల/ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు(కన్వీనర్), సభ్యులుగా అంగన్‌వాడీ వర్కర్ ఉంటారు.
మండల స్థాయి కమిటీ: ఎంపీడీవో/ ప్రత్యేక అధికారి (చైర్మన్), మండల విద్యాశాఖ అధికారి (వైస్ చైర్మన్), ఒక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ (కన్వీనర్), సభ్యులుగా క్లస్టర్ పాఠశాల హెడ్మాస్టర్, ఒక ఉపాధ్యాయుడు
జిల్లాస్థాయి కమిటీ: జిల్లా కలెక్టర్ (చైర్మన్), జిల్లా విద్యాశాఖ అధికారి (వైస్ చైర్మన్), సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ (కన్వీనర్), సభ్యులుగా జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఐటీడీఏ ప్రాజెక్టుఆఫీసర్‌లు ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment