తెలంగాణలో సర్కారీ స్కూళ్లు సరికొత్తగా.. | Telangana To Modernise 9123 Schools Under Phase I Of Mana Ooru-Mana Badi | Sakshi
Sakshi News home page

శిథిలావస్థ నుంచి ఆధునికత వైపు ప్రభుత్వ బడుల అడుగులు

Published Thu, Jan 20 2022 1:49 AM | Last Updated on Thu, Jan 20 2022 2:01 AM

Telangana To Modernise 9123 Schools Under Phase I Of Mana Ooru-Mana Badi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.7,289 కోట్ల ఖర్చుతో రెండేళ్ళ కాలపరిమితితో స్కూళ్ళలో మరమ్మతులు చేపట్టాలని, కనీస వసతులు కల్పించా లని ఇటీవల కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సర్కార్‌ ‘మన ఊరు– మన బడి’పథకానికి ప్రాణం పోసింది. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు సరైన భవనాలు లేవు. కనీస సదుపాయాలు అంతకన్నా లేవు. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. తరగతి గదుల కొరత.. దీంతో చెట్ల కిందే చదువులు. హెచ్‌ఎంతో మాట్లాడేందుకు వెళ్లే టీచర్‌ నిలబడే మాట్లాడాలి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అవసరమైన ఫర్నిచరే లేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే ఎంపిక చేసి పనులు కొనసాగిస్తున్న హైదరాబాద్‌ పరిసరాల్లోని నాలుగు స్కూళ్ళతో పాటు రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలూ ప్రైవేటుకు దీటుగా తయారు కానున్నాయి. 

ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన చేరికలు
కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. 2021లో ఏకంగా 2.50 లక్షల మంది కొత్తగా చేరారు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. తరగతులు జరగక పోయినా ఆయా స్కూళ్లు ఫీజులు వసూలు చేయడం, మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపారు. అయితే ఇప్పటికే పాత భవనాలు, చాలీచాలని వసతులతో సర్కారీ స్కూళ్లలో ఇబ్బందులెదురవుతున్నాయి. తాజాగా లక్షల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యతో ఇక్కట్లు మరీ తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. దాదాపు 9,123 ప్రభుత్వ స్కూళ్ళల్లో తీవ్రమైన సమస్యలున్నట్టు గుర్తించింది. 

 పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,285 స్కూళ్లున్నాయి. 2018–19 లెక్కల ప్రకారం 10,230 పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేవు. చాలా క్లాసులకు ఉపాధ్యాయులు చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. కొన్ని స్కూళ్ళల్లో వరండాల్లో చదువులు చెబుతున్నారు. 
 శిథిలావస్థకు చేరిన స్కూళ్ళ సంఖ్య 4 వేలకు పైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 5 వేల స్కూళ్ళకు తాత్కాలిక మరమ్మతులు అవసరం. ఏ చిన్న వానొచ్చినా గదుల్లోకి నీళ్ళొస్తున్నాయి. కొన్ని స్కూళ్ళలో ఎప్పటికప్పుడు ఎక్కడ పై కప్పు పెళ్లలు మీద పడతాయోననే ఆందోళనతోనే గడుపుతున్నారు.
 2018 లెక్కల ప్రకారమే 8,725 పాఠశాలలకు ప్ర హరీ గోడల్లేవు. ఇప్పుడీ సంఖ్య మరో 4 వేలకు పెరిగిందని ఓ అధికారి తెలిపారు. ప్రహరీలు లే క పశువులు స్కూళ్లలోనే మకాం పెడుతున్నాయి.
 ఇప్పటికీ 9 వేలకు పైగా స్కూళ్ళల్లో మరుగుదొడ్లు లేవు. స్కూలు పరిసరాల్లో చిన్నాచితకా దు కాణాలు, జన సముదాయం ఉండటంతో శౌచా లయ కార్యకలాపాల కోసం విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. బాలికలకు ఇంటికెళ్ళ డం మినహా ప్రత్యామ్నాయం కన్పించడం లేదు. 

నిధుల కొరతే అడ్డంకి..
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరతే ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్రావతరణ తర్వాత తొలి బడ్జెట్‌లో విద్యా రంగానికి 10.89 శాతం కేటాయిస్తే... ఇప్పుడది 6.79 శాతానికి తగ్గింది. బడుల్లో మౌలిక వసతుల కోసం ఏటా రూ. 2 వేల కోట్ల చొప్పున రెండేళ్ళ పాటు ఖర్చు చేస్తామని గత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ప్రటించింది. అయితే ఇది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. రాష్ట్రంలో 3,634 పాఠశాలలకు రూ.109 కోట్లతో మెరుగులు దిద్దేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదననలు సిద్ధం చేసింది. ఈ ఖర్చులో 60 శాతం సమకూరుస్తానని చెప్పిన కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ‘మన ఊరు–మనబడి’పేరుతో నిధులు మంజూరు చేసి పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై అన్నివర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

చెట్ల కింద పాఠాలు.. ప్రహరీ గోడలకు బ్లాక్‌ బోర్డులు
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో చాలా తరగతులు చెట్ల కిందే సాగుతున్నాయి. గతంలో ఐదవ తరగతి వరకే ఉన్న ఈ పాఠశాలను కొన్నేళ్ల క్రితం 8వ తరగతి వరకు పెంచారు. దీంతో విద్యార్థుల సంఖ్య 120 నుంచి 152 అయింది. పాఠశాల శిథిలావస్థకు చేరటంతో 2016లో కొన్ని గదులు కూల్చివేశారు. కానీ ఇప్పటివరకు కొత్తగా పాఠశాలను నిర్మించలేదు. కొత్త గదులూ ఏర్పాటు చేయలేదు. దీంతో టీచర్లు, విద్యార్థులు వేసవి, వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రహరీ గోడలకే బ్లాక్‌ బోర్డులు ఏర్పాటు చేసి పాఠ్యాంశాలు నేర్పిస్తున్నారు. ఇక పాఠశాలలో తాగునీరు, మూత్రశాలల వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన మూత్రశాలలనే బాలికలు వాడుకుంటున్నారు. బాలురు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 

‘ఆలియా’కు కొత్త అందాలు
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున గన్‌ఫౌండ్రీలో శిథిలావస్థలో ఉన్న ఏళ్లనాటి ఆలియా ప్రభుత్వ మోడల్‌ పాఠశాల భవనం ఆధునిక హంగులు అద్దుకుం టోంది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో 148 మంది, ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.‘మన ఊరు–మన బడి’ పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో 2 నెలలుగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనాల్లో ఒక భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మరో భవనంలోని తరగతి గదులన్నీ పెచ్చులూడిపోయాయి. వర్షాకాలంలో గదుల్లోకి తేమ వస్తోంది. కాగా పైలట్‌ ప్రాజెక్టు కింద రెండో భవనం మరమ్మతు పనులు చేపట్టారు. మౌలిక సదుపాయాల కింద ఆధునీకరించిన మరుగుదొడ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు కల్పించనున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విజ్ఞానం పెంపొందించే చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్‌ తరగతులు, ఇంగ్లిష్‌ క్లబ్‌లు సిద్ధంకానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement