మాచవరంలో ప్రభుత్వ బడిలో సౌకర్యాలపై తల్లిదండ్రులకు కరపత్రాలు పంచుతున్న ఉపాధ్యాయులు
రాయవరం (మండపేట): మరో ఆరు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన వేసవి సెలవులు ఈ నెల 11తో ముగియనున్నాయి. 2018–19 విద్యా సంవత్సరంలో బడి ఈడు బాల బాలికలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘మన ఊరు–మన బడి’కి విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఆ గట్టునుంటారా.. ఈ గట్టుకొస్తారా..
ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాలోని ఆ గట్టునుంటావా..ఈ గట్టుకొస్తావా అనే సినీ గీతాన్ని ప్రభుత్వ పాఠశాలలకు అన్వయించి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ తల్లిదండ్రుల దృష్టిని ఆకట్టుకుంటోంది. 6–14 సంవత్సరాల బాల, బాలికలందరినీ పాఠశాలల్లో చేర్పించడం లక్ష్యంగా విద్యాశాఖ ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి పూనుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో ఉన్న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో అమలవుతున్న సౌకర్యాలను వివరిస్తున్నారు. పలువురు ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతిని ఫ్లెక్సీలుగా వేసి తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాణిస్తున్న విషయాన్ని వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, సైకిళ్ల పంపిణీ తదితర అంశాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పాఠశాలల్లో 30 వేల మంది విద్యార్థులను బడిలో చేర్పించగా, ఈ ఏడాది 36వేల మందిని అదనంగా చేర్పించాలని జిల్లా విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. గత విద్యా సంవత్సరంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య సంస్థల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 7లక్షల 32వేల 373 మంది విద్యార్థులు ఉండగా, నూతనంగా బడిలో చేరే విద్యార్థులతో కలిసి ఈ విద్యా సంవత్సరంలో 7లక్షల 68వేల 992 మంది ఉంటారని అంచనా.
షెడ్యూల్ ఇలా..
మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని సక్రమంగా, సమర్ధవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు, సీఆర్పీలు, ఐఈఆర్‌టీలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. బడి ఈడు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను వీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎస్‌ఎంసీ, తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం చిన్నారులను బడిలో చేర్పించాలి.
లక్ష్యాన్ని మించి..
గతేడాది బడిలో చేర్పించిన చిన్నారుల సంఖ్యకు అదనంగా 10 శాతం మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించాం. లక్ష్య సాధనకు మించి చిన్నారులను చేర్పించేలా చర్యలు చేపడుతున్నాం. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు అందరినీ భాగస్వాములను చేస్తున్నాం. – ఎస్.అబ్రహం, డీఈవో, కాకినాడ.
Comments
Please login to add a commentAdd a comment