అనంతపురం : అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియకు చెందిన టోని అన్నేగేట్ గత కొంతకాలంగా పుట్టపర్తిలోని సాయి అపార్ట్మెంట్లో నివాసముంటుంది. అయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి టోనీ కనిపించకుండా పోవడంతో ఆమె స్నేహితురాలు గ్రైట్ డీ సుట్టర్ 20 రోజుల క్రితం పుట్టపర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బెంగళూరు, కేరళలోని పర్యాటక ప్రాంతాల్లో టోనీ ఆచూకీ కోసం గాలించారు.
అలాగే పుట్టపర్తి వివేకానందనగర్‌లోని సాయిగౌరీ అపార్టుమెంట్‌లోని టోనీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె నివాసం ఉంటున్న సాయిగౌరీ అపార్టుమెంట్ వాచ్‌మెన్... టోనీని హత్య చేసి పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వాచ్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా టోనీ హత్య విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. త్వరలోనే టోనీ అదృశ్యానికి సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉంది.