పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ హత్య
Published Sat, Nov 8 2014 2:45 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ టోనీ అన్నెల్ గేట్(75) దారుణ హత్యకు గురైంది. పోలీసుల సమాచారం మేరకు... సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ అపార్ట్‌మెంట్‌లోని 304 నంబర్ గదిలో నివసిస్తోంది. ఆమెకు ఇక్కడే ఉంటున్న గ్రైట్ డీ సుట్టర్ అనే మరో విదేశీ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆగస్టు 28న వస్తువుల కొనుగోలు విషయమై బెంగళూరు వెళ్తున్నానని తన మిత్రురాలు సుట్టర్‌కు సమాచారం ఇచ్చింది.
ఆ మరుసటి రోజు నుండి టోనీ కనిపించలేదు. అనుమానం వచ్చిన సుట్టర్ అక్టోబర్ 12వ తేదీన పుట్టపర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న టోనీ కుమార్తె, కుమారులకు సమాచారం అందించింది. టోనీ కుమార్తె వెంటనే ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేసింది. సాయిగౌరీ ఆపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ భగవంతుడిని పోలీసులు విచారించారు. డబ్బు కోసం ఆగస్టు 29న ఉదయం 11.30 గంటలకు ఎదుటి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ పోతులయ్య సహకారంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోతులయ్య, తన బావమరిది నాగరాజు సహకారంతో టోనీ మృతదేహాన్నిసుమో వాహనంలో కొత్తచెరువు మండలంలోని తన స్వగ్రామమైన తలమర్ల సమీపంలోని ఈతచెట్ల వనం వద్దకు తరలించి పూడ్చిపెట్టారు. శుక్రవారం రాత్రి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు.
Advertisement
Advertisement