ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా
Published Tue, Aug 6 2013 3:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
సాలూరు, న్యూస్‌లైన్ : ఒడిశా రాష్ట్రం సుంకి నుంచి సాలూరు వస్తున్న ఆటో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు సమీపంలో సోమవారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగెడ్డ పంచాయతీ చీడివలస గ్రామానికి చెందిన 13 మంది సాలూరు రావడానికి సుంకి వద్ద ఆటో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఘాట్ రోడ్డులో ఒకటో మైలు రాయివద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
ఆటోలో ఉన్న గణుతూరి చిన్నయ్య, జగ్గులు, సూరన్న, కన్నమ్మ, గమేలా, గున్నమ్మ, మల్లమ్మ, చిన్నమ్మి, కన్నయ్య, చిన్నమ్మి, సూరయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో గణుతూరి చిన్నయ్య, కన్నయ్యల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. పాచిపెంట ఎస్సై సీహెచ్ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో రామభద్రపురం గ్రామానికి చెందినదని, డ్రైవర్ సాలూరుకు చెందిన హరి స్వామినాయుడుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement