అదుపుతప్పి ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలైన సంఘటన మండల కేంద్రంలోని కావేరి రైస్‌మిల్లు
రఘునాథపల్లి, న్యూస్‌లైన్ : అదుపుతప్పి ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలైన సంఘటన మండల కేంద్రంలోని కావేరి రైస్‌మిల్లు ఎదుట వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఇబ్రహీంపూర్‌లో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రామచంద్రం మద్యం మత్తులో లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాధితమహిళ తరఫు కులస్తులు ఆరుగురు పసులాది దయానంద్ ఆటోలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఫిర్యాదు చేసి తిరిగి అదే ఆటోలో గ్రామానికి వెళుతుండగా కావేరి రైస్‌మిల్లు వద్ద ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా నిలిచిపోరుుంది.
దీంతో అయోమయానికి గురైన ఆటో డ్రైవర్ బస్సును తప్పించబోతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దోరగొల్ల చంద్రయ్య(51), దోరగొల్ల పర్వతాలు, దోరగొల్ల మల్లయ్య, ల్యాగల మల్లేష్, దోరగొల్ల యాదగిరి, ఆటో డ్రైవరు దయానంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న దోరగొల్ల చంద్రయ్య, దోరగొల్ల పర్వతాలును సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా చంద్రయ్య మార్గమధ్యలో మృతిచెందాడు. పర్వతాలు పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ దయానంద్‌ను ఎంజీఎంకు తరలించగా మిగతా ముగ్గురు జనగామ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
ఇబ్రహీంపూర్‌లో విషాద ఛాయలు
రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఒకరు మృతిచెంది, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనగామ మార్చురీలో ఉన్న చంద్రయ్య మృతదేహాన్ని సందర్శించేందుకు గ్రామస్తులు పెద్దఎత్తున వెళ్లి కన్నీటిపర్వంతమయ్యారు. మృతుడి భార్య భారతమ్మ, కుమారుడు సురేష్ రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. ఏఎస్సై దామెర సురేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.