పి.గన్నవరం: మండలంలోని రాజవరం–పొదలాడ రోడ్డులో 11 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ ప్రధాన పంటలోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్.గన్నవరం శివారు నడిగాడి, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంక గ్రామాలకు చెందిన 11 మంది కూలీలు వరికోతల నిమిత్తం ఎల్.గన్నవరం నుంచి ఆటోలో జి.పెదపూడికి వెళ్తున్నారు. ఈదరాడకు చెందిన కాండ్రేగుల సత్య హేమంత్, పొదలాడ గ్రామానికి చెందిన కె.సింహాచలం మోటారు సైకిల్‌పై రావులపాలెం నుంచి మేకను తీసుకువస్తున్నారు. బెల్లంపూడి పెట్రోలు బంకు సమీపంలో మేక కదలడంతో మోటారు సైకిల్‌ను ఆపారు. దీంతో వెనుక వస్తున్న మరో మోటారు సైకిల్ మేక ఉన్న మోటారు సైకిల్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
అదే సమయంలో ఎదురుగా కూలీలతో వస్తున్న ఆటో మోటారు సైకిల్‌ను ఢీకొట్టి పంట కాలువలోకి బోల్తా పడింది. ఈక్రమంలో ఈతకోట నుంచి వస్తున్న నర్శింహరాజు, ఊడిమూడికి చెందిన కొల్లు గోవింద్, కొల్లు చిన్న కాల్వలోకి దూకి నీట మునిగిపోతున్న డ్రైవర్ రామకృష్ణతో సహా 11 మందిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వీరికి మోటారుసైక్లిస్టు సత్యహేమంత్ సాయం అందించాడు. ఈ ప్రమాదంలో నీటమునిగిన నడిగాడికి చెందిన రాపాక ఆదిలక్ష్మి (65) మరణించింది. గాయాలపాలైన అయోధ్యలంక కూలీలు మోసుగంటి సుహాసిని, మానుకొండ ఆదిలక్ష్మి, మానుకొండ భాగ్యవతి, డ్రైవర్ రామకృష్ణను అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రాణాలకు తెగించి కూలీలను కాపాడిన ముగ్గురినీ పలువురు అభినందించారు. ఆదిలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పి.గన్నవరం ఎస్సై పి.వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment