చోరీ కేసులో ఆటోడ్రైవర్ అరెస్ట్
Published Wed, Sep 4 2013 3:08 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
అర్ధవీడు, న్యూస్‌లైన్ : ఓ ఇంట్లో చోరీకి సంబంధించిన కేసులో ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్సై శశికుమార్ ఆ వివరాలు వెల్లడించారు. కాకర్ల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నల్లబోతుల నరసయ్య గత నెల 30వ తేదీ మండలంలోని అంకభూపాలెం గ్రామానికి ఆటోలో కూలీలను తీసుకొచ్చాడు. కూలీలను దించిన తర్వాత వెంటనే వెళ్లకుండా కాసేపు గ్రామంలోనే ఉన్నాడు.
ఆ సమయంలో తాళం వేయకుండా గడియ మాత్రమే వేసి పొలం వెళ్లిన గ్రామానికి చెందిన మండ్లా గాలెయ్య ఇంటిని గమనించాడు. చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో ఇంట్లోకి ప్రవేశించి ఎదురుగా కనిపించిన ట్రంకుపెట్టెను ఆటోలో వేసుకుని వెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి వచ్చిన మండ్లా గాలెయ్య కుటుంబ సభ్యులు ఇంట్లో ట్రంకుపెట్టె కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సోమవారం సాయంత్రం కంభం రైల్వేస్టేషన్ సమీపంలో సంచరిస్తున్న ఆటోడ్రైవర్ నల్లబోతుల నరసయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో తాను చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడంతో అతని నుంచి 3 గ్రాముల బంగారు లాకెట్, 5 గ్రాముల ఉంగరం, ఒక ముక్కుపుడక, దిద్దులు, పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 42 వేల రూపాయలు ఉంటుందని ఎస్సై తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement