కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : నగరంలో విద్యార్థినిపై ఓ ఆటోడ్రైవర్ లైంగికదాడికి యత్నించాడు. బాధిత విద్యార్థిని కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ ఆ పాఠశాల హాస్టల్‌లోనే ఉంటోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన ఆమె బాబాయితో కలిసి బుధవారం మధ్యాహ్నం కరీంనగర్‌కు వచ్చింది. ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్లి లగేజీ పెట్టి ఫీజు కట్టి వచ్చారు. ఆకలిగా ఉండడంతో బస్టాండ్ ఎదురుగా టిఫిన్ చేశారు.
అనంతరం 3.50 గంటలకు ఆమె బాబాయి అక్కడే ఓ ఆటో మాట్లాడి విద్యార్థినిని పాఠశాల వద్ద దింపమని చెప్పి అతడు ఆదిలాబాద్ వెళ్లేందుకు బస్టాండ్ లోనికి వెళ్లాడు. ఆటో ఎక్కిన విద్యార్థినిని డ్రైవర్ మాటల్లో పెట్టి దారి మళ్లించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెకు అనుమానం వచ్చి ‘అంకుల్ మా స్కూల్ ఇటు కాదు’ అని చెప్పగా ఇటునుంచి కూడా వెళ్లవచ్చు అంటూ రేకుర్తి కంటి ఆస్పత్రి పక్కన చెరువు వద్దకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. అమ్మాయి తీవ్రంగా ప్రతిఘటించి అతడిని తోసివేసి అక్కడినుంచి పారిపోయింది. డ్రైవర్ ఆమె వెంట పడి పట్టుకునే ప్రయత్నం చేసినా చిక్కకుండా చెట్లపొదల్లో దాక్కుని చాకచక్యంగా తప్పించుకుంది. ఇక ఆమె లేదనుకుని డ్రైవర్ ఆటోతో వెళ్లిపోయాడు.
అనంతరం 4.30 ప్రాంతంలో అక్కడినుంచి భయంగా నడుచుకుంటూ రోడ్డుపైకి రాగా అటుగా వెళ్తున్న రేకుర్తి సర్పంచ్ భర్త నందెల్లి ప్రకాశ్ గమనించి వివరాలు కనుక్కుని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించారు. బాధితురాలినుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ కమాలాకర్‌రెడ్డి, ఎస్సై సృజన్‌రెడ్డి, నాగార్జునరావు, రవీందర్‌తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆటోడ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. అనుమానితుడిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమో దు చేయనున్నట్లు రూరల్ ఎస్సై సృజన్‌రెడ్డి తెలిపారు.
సీసీ కెమెరాల్లో ఆటో చిత్రాలు
బస్టాండ్ ఎదురుగా విద్యార్థిని ఆటో ఎక్కుతున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు మరింత నాణ్యత కోసం ల్యాబ్‌కు పంపించారు. అక్కడి వివరాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
నిఘా కరువు
నిత్యం ఏదో సంఘటన జరుగుతున్నా ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన పోలీసులకు, పాలకులకు రావడం లేదు. ఎస్పీ క్యాంపు కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ మెయిన్‌గేటు వైపు సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదు. ఇవి పనిచేసి ఉంటే ఆటో డ్రైవర్ పూర్తి వివరాలు రికార్డయి, నిందితుడు త్వరగా పట్టుబడే అవకాశముండేది. కనీసం బస్టాండ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం సీసీ కెమెరాల ఆవశ్యకతపై మాట్లాడే అధికారులు కనీసం నగరంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
గతంలోనూ ఇక్కడే ఘటన
రెండేళ్ల క్రితం రేకుర్తిలోని ఇదే ప్రాంతంలో ఇద్దరు ఆటోడ్రైవర్లు ఓ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ అమ్మాయిని తరలించేందుకు యత్నించగా అక్కడి నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన అప్పుడు కలకలం సృష్టించింది. దీనిపై విచారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మళ్లీ ఇదే ప్రాంతంలో బుధవారం ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పటికైనా ఈ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరముంది.
అవగాహన లేని ‘డయల్ 100’
డయల్ 100 సేవల విషయంలో పోలీసులు అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం లేదు. అపాయాల్లో డయల్ 100 సేవలు వినియోగించుకోవాలని నామమాత్రంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పించడంలో వెనకబడ్డారు. తాజా ఘటనలోనూ డయల్ 100కు ఫోన్ చేయాలనే ఆలోచన సదరు విద్యార్థినికి కలగలేదు. ఇప్పటికైనా పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విద్యార్థులకు ఆత్మరక్షణ, పోలీసు సేవలపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
కలకలం
Published Thu, Oct 24 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement