అవస్థలు పడుతూ తహసీల్దార్ కార్యాలయం మెట్లు ఎక్కుతున్న ఆటోడ్రైవర్ నీలకంఠ
అసలే అనారోగ్యం.. శరీరం సహకరించడం లేదు. తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆ యువకుడు అతి కష్టం మీద ఆటో నడుపుతూ వచ్చిన సంపాదనతో మందులు తెచ్చుకుని వాడుతున్నాడు. చౌకబియ్యం అక్రమంగా తరలించారనే కారణంతో అధికారులు ఆటో సీజ్ చేశారు. ఎంతమంది చెప్పినా ఆటో మాత్రం వదల్లేదు. జీవనోపాధి కోల్పోవడంతో మందులు కొనలేని స్థితికి చేరాడు. ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు కనికరించడం లేదు.
గుంతకల్లు రూరల్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసే చౌకబియ్యం, పంచదార తదితర రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నా, చౌకడిపోల్లో బహిరంగంగా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నా పట్టించుకోని పౌరసఫరాల అధికారులు అమాయకుడిపై తమ ప్రతాపం చూపారు. గొల్లలదొడ్డికి చెందిన నీలకంఠ అనే యువకుడు ఏడేళ్ల క్రితం కిడ్నీ సంబంధిత జబ్బుబారిన పడ్డాడు. ఈ క్రమంలోనే రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. చికిత్స చేయించినా పూర్తిస్థాయిలో నడవడానికి కాళ్లు సహకరించలేదు. తల్లే అతడికి సపర్యలు చేసేది. అయితే మద్యం తాగి వచ్చే తండ్రికి మంచంపై పడి ఉన్న కుమారుడిని చూసి జాలి కలగకపోగా.. అతడిని మాటలతో హింసిచేవాడు. అడ్డుచెప్పబోయిన నీలకంఠ తల్లినీ చితకబాదేవాడు. మనస్తాపం చెందిన నీలకంఠ ఐదేళ్ల క్రితం ఇల్లు వదిలి గుంతకల్లుకు వచ్చేశాడు. దోనిముక్కల కాలనీలో అద్దె ఇంట్లో ఉండేవాడు. ఇరుగుపొరుగు వారి సహకారంతో నాలుగు నెలల కిందట ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేశాడు. రోజూ ఆటోకు వెళ్లి నెలనెలా కంతులు సక్రమంగా చెల్లిస్తూ వచ్చేవాడు.
నేరం చేయకున్నా శిక్ష..
ఈ నెల పదో తేదీన గుంతకల్లులోని భాగ్యనగర్‌లో ఇంటింటా తిరిగి చౌకబియ్యం సేకరించుకుని బస్తాల్లో నింపుకున్న కొందరు మహిళలు బస్టాండ్‌కు వెళ్లడం కోసం నీలకంఠ ఆటోను బాడుగకు మాట్లాడుకున్నారు. అలా ఆటోలో బయల్దేరారు. ఇంతలో సమాచారం అందుకున్న సీఎస్‌డీటీ ఈరమ్మ, వీఆర్వో గురుప్రసాద్‌లు అక్కడికి చేరుకుని ఆటోను నిలిపారు. అక్రమంగా 150 కిలోల చౌక బియ్యం రవాణా చేస్తావా అంటూ డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. అవి స్టోర్ బియ్యం అని తనకు తెలీదని నీలకంఠ తెలిపినా సీఎస్‌డీటీ, వీఆర్వో వినలేదు. బియ్యంతోపాటు ఆటోనూ సీజ్ చేశారు.
ఆదాయం కోల్పోయి..
పట్టుమని పది అడుగులు కూడా నడవలేని నీలకంఠ తన ఆటోను విడిపించుకునేందుకు రోజూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాడు. ఆటో లేకపోవడంతో ఆదాయం కోల్పోయాడు. పదమూడు రోజులుగా ఖాళీగా ఉండటంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. మందులు కొనేందుకు డబ్బు లేక.. అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. మరో వారం గడిస్తే ఆటో ఫైనాన్స్ నెలకంతు కట్టాలి. అధికారులు దయాదాక్షిణ్యం లేకుండా మాట్లాడుతుండటంతో ఏమిచేయాలో దిక్కుతోచడం లేదు.
గాడిదపైనైనా కేసు నమోదు చేయాల్సిందే!
నీలకంఠ పరిస్థితి చూసి పలువురు సీఎస్‌డీటీ ఈరమ్మను కలిసి ఆటోను వదిలేయండని కోరితే.. అందుకు ఆమె ససేమిరా అన్నారు. అక్రమంగా సరుకును తరలిస్తే కేసు నమోదు చేయాలన్న నిబంధనలు ఉన్నాయని తెలిపారు. గాడిదపై సరుకు అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే.. గాడిదపై కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment