
కదిరి టౌన్ : ప్రేమించాలంటూ యువకుడి నుంచి వేధింపులు పెరగడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. కదిరి పట్టణ ఎస్‌ఐ మగ్బుల్‌బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణమ్మ కాలనీకి చెందిన శ్రీనివాసులు, గోరంట్ల ఆశావర్కర్ శ్రీవాణి దంపతులు. వీరికి నిరతిశ్రీ (13) అనే కుమార్తె ఉంది. కదిరిలోని ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇదే కాలనీకి చెందిన బేల్దారి పని చేసుకునే హరి ప్రేమిస్తున్నానంటూ ఏడాది కాలంగా నిరతిశ్రీ వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి తిరస్కరించినా ప్రేమించాలంటూ ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో హరిని మందలించారు. తప్పయిపోయిందని, ఇక వెంటపడనని నమ్మబలికాడు.
కొన్ని రోజులు స్తబ్దుగా ఉండి తర్వాత తిరిగి వేధించడం మొదలుపెట్టాడు. తన ప్రేమను ఆమోదించాలని, పెళ్లి చేసుకుని హాయిగా బతుకుదామని ఒత్తిడి పెంచాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకుంటే రచ్చ చేస్తానని బెదిరించాడు. తమ పరువు పోతుందని భావించిన నిరతిశ్రీ అర్ధరాత్రి సమయంలో తండ్రి నిద్రపోతుండగా.. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి విధి నిర్వహణలో భాగంగా ఆ రోజు గోరంట్లలో ఉంది. విషయం తెలియగానే ఆదివారం ఇంటికి చేరుకుని బోరున విలపించింది. ఒక్కగానొక్క కుమార్తెను ప్రేమ పేరుతో పొట్టన పెట్టుకున్నాడంటూ రోదించింది. అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలియగానే బేల్దారి హరి పరారయ్యాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మగ్బుల్‌బాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment