కర్నూలు జిల్లా టీడీపీలో ముసలం
కర్నూలు : కర్నూలు జిల్లా టీడీపీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి ... మంత్రి అఖిలప్రియపై తిరుగుబాటుతో టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో నంద్యాల కౌన్సిలర్లతో ఆయన శుక్రవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. తనవైపు ఉన్నారా? అఖిలప్రియ వైపు ఉన్నారో తేల్చుకోవాలని సూచించారు.
ఏవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమ నాగిరెడ్డి తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, ఆయన తనకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం అఖిలప్రియ పాతిక శాతం కూడా ఇవ్వడం లేదన్నారు. నంద్యాలలో భూమా వర్గాన్ని తానే తయారు చేశానని ఆయన అన్నారు. అసలు తనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని ఏవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.
కాగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నాయకుల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరడంతో ఈ పంచాయితీ కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. దీంతో జిల్లా నేతలు అంతా అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబు తన నివాసంలో కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. శిల్పా మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు, ఏవీ సుబ్బారెడ్డి వ్యవహారంపై కూడా ఆయన ప్రత్యేకంగా సమీక్ష జరపనున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రికి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బుధవారం ఫోన్ చేసినట్టు సమాచారం.
అందరితో సఖ్యతగా ఉండి.. కలిసి మెలిసి పనిచేసుకుపోకుండా ఒంటెద్దుపోకడలు సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మునిసిపాలిటీలోని మొత్తం కౌన్సిలర్లు పార్టీ మారడం.. మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రారంభమయ్యింది. అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా పార్టీ మారడంతో నంద్యాల నియోజకవర్గంలో మెజార్టీగా టీడీపీ ఖాళీ కావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.
ఈ నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏవీ సుబ్బారెడ్డితో వివాదం, పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం అఖిలప్రియ మాట్లాడుతూ ఏవీ సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తమ ఇంటి మనిషి అని, మామా అని పిలిచే చనువు ఉందన్నారు.
తమ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటామన్నారు. తన వైపు ఏమైనా పొరపాట్లు ఉంటే దిద్దుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అఖిలప్రియ అన్నారు. తమ మధ్య ఉన్నది జనరేషన్ గ్యాప్ మాత్రమే అని ఆమె పేర్కొన్నారు. ఎవరినీ దూరం చేసుకునే పరిస్థితిలో తాను లేనని, సుబ్బారెడ్డి తమ కుటుంబ మనిషి అని అన్నారు.