ప్రభుత్వ భూములున్న చోటే రాజధాని..
* రాజధాని అంశం మరో విభజనకు బీజం కారాదు
* మాజీ మంత్రి మైసూరారెడ్డి సూచన
సాక్షి ప్రతినిధి, కడప: యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యమయ్యే ప్రాంతంలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కల్పించిన సౌలభ్యం వల్ల ప్రభుత్వ, అటవీ భూములు సేకరించడం సులభమన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల ప్రైవేట్ భూములను సేకరించడం తలకు మించిన భారమవుతుందన్నారు. రాష్ర్ట ఖజానా అంత భారాన్ని మోసే పరిస్థితుల్లో లేదని, కేంద్రం కూడా నిధులు సమకూర్చదని చెప్పారు.
రాజధాని అంశం తెలుగుజాతి మరో విభజనకు బీజం కారాదన్నారు. రాజధాని అంశంపై ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఈనెల 14న తాను రాసిన లేఖలను గురువారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మైసూరారెడ్డి విడుదల చేశారు. ‘సింగపూర్ లాంటి రాజధాని నిర్మించుకుందామంటూ చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.
సింగపూర్ నగర వైశాల్యం లక్షా 50వేల ఎకరాలు. అంతటి మహానగరం కాకపోయినా అందులో సగం నిర్మించాలన్నా 50వేల ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమవుతుందని’ మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆమేరకు భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయడం అమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు.