MV Mysoora reddy
-
'సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బానుకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ఇక్కడ నీళ్లు ఇస్తానంటాడు.. అక్కడ నీళ్లు ఇస్తానంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సీమ ప్రజల కష్టాలు తీరుస్తానంటూ బాబు చెప్పే మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. గాలేరు - నగరి ప్రాజెక్టు గోవింద అవుతుదేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు నిరర్థక ఆస్తులగా మారతాయని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం ఉండదన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ను గోదావరి, కృష్ణా డెల్టా రైతులు వ్యతిరేకిస్తున్నారని మైసూరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా చంద్రబాబు పట్టిసీమను పూర్తి చేయాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టులన్నీ చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పోలవరం కట్టండి... పట్టిసీమను ఆపండి... రాయలసీమను ఆదుకోండి అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
'రైతుల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర '
హైదరాబాద్: రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీతోపాటు కేంద్రప్రభుత్వం అందజేసిన మార్గదర్శకాలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మైసూరారెడ్డి మాట్లాడుతూ.... ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు 25 శాతమే లబ్ది చేకూరుతుందని తెలిపారు. రైతుల నుంచి తీసుకున్న భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భూములతో చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటోందని ఆయన విమర్శించారు. ఇది మంచి సంప్రదాయం కాదని మైసూరారెడ్డి... చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. అలాగే రాజధాని పేరుతో విచ్చలవిడిగా ప్రజల డబ్బును ఖర్చు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో మరోసారి పునారాలోచన చేయాలని మైసూరా ఈ సందర్భంగా చంద్రబాబుకు హితవు పలికారు. -
భుక్తిపోరు
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో 600 మెగావాట్ల ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు సోమవారం ఆర్టీపీపీని ముట్టడించారు. తమకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కదలి వచ్చారు. ప్రాజెక్టు గేటు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గేట్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య, వైస్ ఛైర్మన్ సుభాష్‌రెడ్డిలతో పాటు కౌన్సిలర్లు కూడా ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీఐ పీటీ కేశవరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి ఏపీ జెన్కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు భూ నిర్వాసితులు, నాయకులు కొందరు రావాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ డెరెక్టర్, సీఈ ఇక్కడికే వచ్చి నేరుగా భూ నిర్వాసితులతో చర్చలు జరపాలని కోరారు. ఎస్ఈ శేషారెడ్డి వచ్చి భూ నిర్వాసితులు చర్చలకు రావాలని విన్నవించడంతో సీఈ ఛాంబర్లో చర్చలు జరిపారు. ఏపీ జెన్కో డెరైక్టర్‌తో చర్చలు ఏపీ జెన్కో డెరైక్టర్‌తో జరిగిన చర్చల్లో సుధీర్‌రెడ్డి, శివనారాయణరెడ్డిలతో పాటు భూ నిర్వాసితులు, మహిళలు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన వారిందరికి ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన భూ నిర్వాసితులకు 95 ఉద్యోగాలు ఇస్తామని డెరైక్టర్ వైవీ రావు హామీ ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు. పది రోజుల్లో జాబితాను విడుదల చేస్తామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. మళ్లీ నిరసనలు చేయమని భూ నిర్వాసితులు హామీ ఇవ్వాలని డెరైక్టర్ కోరారు. కాగా తమకు చెప్పిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని, మాట తప్పితే మళ్లీ ఉద్యమ బాట పడతామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా.. ‘ఆర్టీపీపీ అధికారులు మా భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం అడుక్కునే పరిస్థితి కల్పించారు’ అని భూ నిర్వాసితుడు సునీల్ వాపోయారు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తుండగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. తిప్పుకుంటున్నారు.. ‘మొదట్లో భూములు తీసుకునేటప్పుడు మమ్మల్ని నమ్మించారు. ఇప్పుడేమో మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు’ అని భూ నిర్వాసిత మహిళ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీపీపీ అధికారులు భూములు తీసుకుని తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇవ్వడం దారుణమన్నారు. -
ప్రభుత్వ భూములున్న చోటే రాజధాని..
* రాజధాని అంశం మరో విభజనకు బీజం కారాదు * మాజీ మంత్రి మైసూరారెడ్డి సూచన సాక్షి ప్రతినిధి, కడప: యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యమయ్యే ప్రాంతంలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కల్పించిన సౌలభ్యం వల్ల ప్రభుత్వ, అటవీ భూములు సేకరించడం సులభమన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల ప్రైవేట్ భూములను సేకరించడం తలకు మించిన భారమవుతుందన్నారు. రాష్ర్ట ఖజానా అంత భారాన్ని మోసే పరిస్థితుల్లో లేదని, కేంద్రం కూడా నిధులు సమకూర్చదని చెప్పారు. రాజధాని అంశం తెలుగుజాతి మరో విభజనకు బీజం కారాదన్నారు. రాజధాని అంశంపై ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఈనెల 14న తాను రాసిన లేఖలను గురువారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మైసూరారెడ్డి విడుదల చేశారు. ‘సింగపూర్ లాంటి రాజధాని నిర్మించుకుందామంటూ చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సింగపూర్ నగర వైశాల్యం లక్షా 50వేల ఎకరాలు. అంతటి మహానగరం కాకపోయినా అందులో సగం నిర్మించాలన్నా 50వేల ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమవుతుందని’ మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆమేరకు భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయడం అమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. -
లగడపాటి మారీచ రాజకీయం
* రాజకీయ ఒత్తిళ్లతో సర్వే అంటూ కాకిలెక్కలు: మైసూరా * పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టే కుయుక్తులని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో లేనంటూనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సర్వేల పేరుతో మారీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్లకు లొంగో, వారితో కుమ్మక్కయ్యో ఆ పార్టీకి ప్రయోజనం కలిగించేలా సర్వే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి విమర్శించారు. తన సర్వే ఫలితమంటూ కాకి లెక్కలు చెబుతూ, పోలింగ్ ముంగిట్లో పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టే ఈ కుయుక్తులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనైతికమే కాకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కూడా మైసూరా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నీ సర్వే ఏంటి? శాంపిల్ ఎంత? మెథడాలజీ ఏమిటి? ఇవేమీ లేకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలించే ప్రకటనలు చేయడం ఏ రకంగా సమంజసం?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇటువంటి ప్రకటనలు చేయడాన్ని తాము సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణలో తెరాస ఆధిక్యత ఉందనేదే నీ సర్వే ఫలితమైతే, 30 తేదీన అక్కడ పోలింగ్ అయిన వెంటనే ఎందుకు చెప్పలేదు?’ అని నిలదీశారు. సర్వేల పేరుతో రాజకీయ దురుద్దేశాల్ని వెల్లడించడం ఆయనకు కొత్తేమీ కాదని, లోగడ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారని, ఆయన సర్వేలోని విశ్వసనీయత ఎంతో ఆనాటి ఫలితాలతోనే సుస్పష్టంగా తేలిపోరుుందని గుర్తు చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ సొంతంగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయని తన సర్వేలో తేలిందని లగడపాటి శనివారం మీడియూ సమావేశంలో చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 270కి పైగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. -
‘ఓట్ ఫర్ జగన్’
మొబైల్ యాప్ ఆవిష్కరణ 12 అంశాలతో అధునాతన అప్లికేషన్ హైదరాబాద్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్రత్యేకమైన అప్లికేషన్‌ను రూపొందించింది. ఆ పార్టీ ఐటీ విభాగం రూపొందించిన ‘ఓట్ ఫర్ జగన్’ మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి బుధవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ అప్లికేషన్లో పార్టీ మేనిఫెస్టోతో పాటు వైఎస్ఆర్ సీపీ రూల్స్, పర్యటనల ప్రణాళిక, అభ్యర్థుల ప్రొఫైల్స్, వీడియోలు, రింగ్టోన్లు, వాల్పేపర్లు, సభ్యత్వ నమోదు, ఈవీఎం డెమో, ఫేస్బుక్, సూచనలు, పార్టీని సంప్రదించడం లాంటి మొత్తం 12 అంశాలను పొందుపరిచారు. ఈ అప్లికేషన్‌ను ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా పార్టీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఫేస్బుక్, వీడియోలు, టూర్ షెడ్యూల్ మినహా మిగతా అంశాలను ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన మాచినేని కిరణ్‌కుమార్‌ను మైసూరారెడ్డి అభినందించారు. పార్టీ లక్ష్యాలను మరింత విస్తృతంగా గడప గడపకు తీసుకెళ్లడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మైసూరా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, నారు మహేష్, దేవేంద్ర, జయరామ్, హర్షవర్ధన్‌రెడ్డి, కేతు మాల్యాద్రి, గోపినాథ్, ఆదిత్య, బ్రహ్మారెడ్డి, శ్రీవర్ధన్, కోటిరెడ్డి, పలువురు ఐటీ నిపుణులు పాల్గొన్నారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేలా సీఎం వ్యవహరిస్తున్నారు: ఎం.వి.మైసూరా రెడ్డి
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చేలా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వి.మైసూరా రెడ్డి విమర్శించారు. 74 రోజుల నుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని అన్నారు. సమైక్యవాదినని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి ఉద్యోగుల ఆందోళనల్ని పట్టించుకోవడంలేదని మైసూరా రెడ్డి చెప్పారు. కిరణ్‌కుమార్ రెడ్డి తీరు ఏమాత్రం బాగాలేదని ఆక్షేపించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని మైసూరా రెడ్డి ఆరోపించారు. ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'సమైక్య శంఖారావం' సభను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించినా హైకోర్టు మంజూరు చేసింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్లో సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు సమన్యాయం పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం రమేష్ ఢిల్లీలో పథక రచన చేశారని, అందులో భాగంగానే సమన్యాయం అంటూ ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీక్ష చేశారని మైసూరా రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు కూడా ఢిల్లీ పెద్దల ఆదేశాలమేరకే నడుచుకుంటున్నారని విమర్శించారు. -
అన్యాయం..అనైతికం
సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. పోలీసు అధికారులు రాజకీయపరంగా నిర్ణయం తీసుకుంటే అది తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఈ నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభను నిర్వహించాలని నిర్ణయించిన విషయం, దానికి పోలీసులు అనుమతి నిరాకరించడం తెలిసిందే. ఆదివారం మైసూరారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ సభ్యుడు కె.శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు డీసీపీ ఇచ్చిన ఆర్డర్‌ను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘తమకు నచ్చిన వారు సభలు పెట్టుకుంటే వారికి సకల సౌకర్యాలు కల్పిస్తారు. అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తారు. తమకు నచ్చని వారు సభలు నిర్వహించాలనుకుంటే మాత్రం పోలీసులకు శాంతిభద్రతలు గుర్తొస్తాయి. పోలీసులంటే అధికార పార్టీకి ‘ఎస్ బాస్’ లే కదా. వారు ఏం చెబితే దానికి వంతపాడటం పోలీసులకు రివాజుగా మారింది. ఇప్పుడు డీసీపీ ఆదేశాలు కూడా అందులో భాగమే’ అని మైసూరా మండిపడ్డారు. సీడబ్ల్యూసీ తీర్మానం గురించి పోలీసు ఆర్డర్లో పేర్కొన్నారని, అసలు దానికీ పోలీసులకూ ఏం సంబంధమని ఆయన సూటిగా ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అనేది కాంగ్రెస్ కమిటీ అని, కాంగ్రెసేం పోలీసులకు బాస్ కాదు కదా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం కూడా ప్రభుత్వ అంతర్గత వ్యవహారం. అది చట్ట సభకు వచ్చి ఆమోదం పొందిన తరువాత దానిని అమలు చేయాలి. అంతేకానీ ఇప్పుడే అధికార పార్టీ వైఖరిని పేర్కొంటూ వ్యవహారాలను నడపడం పోలీసుల బాధ్యతారాహిత్యం’ అని విమర్శించారు. అధికార పార్టీకి కొమ్ము కాశారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మైసూరారెడ్డి ప్రశ్నించారు. భావ ప్రకటన హక్కును కాదంటారా? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉందనీ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాదే ఉందనీ, ఈ రాజధానిలో వివిధ పార్టీలు, వ్యక్తులు తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో సమైక్యం, విభజన కోరుకునే వారిద్దరూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుంది. వినడానికి వచ్చే వారిని విచ్ఛిన్నకర శక్తులనడం చూస్తే పోలీసులే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ఉంది. ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు లేవు. భావాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఆ భావాలను చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ, వారి భావాలను చెప్పుకోవడానికి వస్తున్న వారిని విధ్వంసకారులని అనడం తప్పు. సమైక్యవాదాన్ని కోరుకుంటున్న ముఖ్యమంత్రికి ఇది తగునా?’ అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రాజకీయ వైఖరిని మార్చుకుందనడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ స్టాండ్ అపుడూ ఇపుడూ ఎల్లప్పుడూ ఒకటేనని అయన స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి షిండే సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించే అధికారం, కలిపి ఉంచే అధికారం కేంద్రానికి ఉందని మేం గుర్తు చేస్తే... కొందరు దానిని పట్టుకుని తమ స్థాయికి దిగజారి మాట్లాడ్డం ఏమాత్రం సరికాదు. ఇది అన్యాయం’ అన్నారు. ఇది కేవలం తమ పార్టీపై బురద జల్లడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే అవుతుందన్నారు. ఎవరికీ అన్యాయం జరక్కుండా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించాలని కోరితే మీ ఇష్ట ప్రకారం చేయమని అర్థమా? అని ఆయన ప్రశ్నించారు. తాము అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పామో పూర్తిగా చదవమని దిగ్విజయ్, షిండేలకు ఆయన సూచించారు. ‘మీకు ఇంగిత జ్ఞానం లేదు, మీ కింద ఉండే పోలీసులకు మోకాళ్లలో మెదడుంది. మా స్టాండ్ ఏమిటో తెలుసుకోకుండా కళ్లు మూసుకుని ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుందా’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన అందరికీ నష్టమే... కలిసుంటే బలంగా ఉంటాం విభజన వల్ల ఇరుప్రాంతాల ప్రజలూ నష్టపోతారనేది వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి అని మైసూరారెడ్డి మరోసారి స్పష్టంచేశారు. ఐకమత్యంగా ఉంటేనే జాతీయ స్థాయిలో బలంగా ఉండగలమనేది తమ పార్టీ అభిప్రాయమని ఆయన అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు ప్రాంతాల ప్రజల అభివృద్ధిని ఆశించి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టారని, దానివల్ల అందరూ లబ్ధి పొందారని ఆయన గుర్తుచేశారు. అందువల్లనే తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక సమైక్యవాదం బలంగా వినిపించేందుకు హైదరాబాద్‌లో సభ పెట్టాలనుకున్నామని, అంతే తప్ప ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశంతోనో, విద్వేషాలు రెచ్చగొట్టడానికో కాదని మైసూరా అన్నారు. వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఇక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేస్తూ.. అలాంటి పార్టీ తలపెట్టిన సభకు రక్షణ కల్పించాల్సింది పోయి నిరాకరించడం అనైతికం అని వ్యాఖ్యానించారు. ‘తాను సమైక్యవాదినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాదా..! లేక సోనియా తలపెట్టిన విభజన ఎజెండాను అమలు చేయడానికి ఆమె ఏజెంటుగా పని చేస్తున్నారా...?’ అని మైసూరా ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిని ఇచ్చారు, ఆ తరువాత సకల జనుల సభకూ అవకాశం ఇచ్చారు. ఇపుడు ప్రజల్లోకి వచ్చి సమైక్యవాదం గురించి మేం చెబుతామంటే ఎందుకు అనుమతిని ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ‘బహుశా అశోక్‌బాబు వారికి నచ్చినవాడు కనుక ఆయన సభకు పూర్తి రక్షణ కల్పించినట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. సభ విజయవంతం అయితే అధికారపార్టీ నామరూపాల్లేకుండా పోతుందనే భయంతోనే అనుమతిని ఇవ్వలేదని మైసూరా విమర్శించారు. యూటర్న్ కాంగ్రెస్‌దే! తమను వైఖరి మార్చుకున్నారని చెబుతున్న దిగ్విజయ్‌సింగ్, సుశీల్‌కుమార్ షిండేలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మైసూరా హెచ్చరించారు. ‘మమ్మల్ని యూటర్న్ తీసుకున్నామని వీళ్లంటున్నారు, వాస్తవానికి యూటర్న్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీయే. ఆ విషయం వీళ్లిద్దరికీ తెలియదా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ప్రణబ్‌ముఖర్జీ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం రాష్ట్రాల పునర్విభజనకు మరో కమిటీని(రెండో ఎస్సార్సీ) వేయాలని 2001, అక్టోబర్ 30వ తేదీన సీడబ్ల్యూసీ చేసిన తీర్మానంలో పేర్కొన్నారు. 2004 ఎన్నికల ప్రణాళికలోనూ విదర్భ, తెలంగాణ వంటి చోట్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయని వాటి కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు’ అని ఆయన కాంగ్రెస్ నేతలకు గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్తో చేసుకున్న అవగాహనలో కూడా రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలనే ఉందన్నారు. అది నాటి సీఎల్పీ నేత వైఎస్‌కు ఇష్టంలేకపోయినా గులాంనబీ ఆజాద్ వైఎస్‌ను ఒప్పించారని మైసూరా వెల్లడించారు. ఆ అవగాహనపై అప్పటి టీఆర్ఎస్ నేత నరేంద్ర సంతకం చేశారన్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి తాను చెప్పినవన్నీ కాంగ్రెస్ వెబ్సైట్లో ఉన్నాయని దిగ్విజయ్ వాటిని చూడవచ్చని వాటి ప్రతులను ఆయన పత్రికలకు విడుదల చేశారు. -
'దిగ్విజయ్,షిండేలు నిజాలు వక్రీకరిస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలైన దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండేలు నిజాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు గురువారం న్యూఢిల్లీలో ఆరోపించారు. తెలంగాణాకు అనుకూలమని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని వారు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మాత్రం ప్రస్తావించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎస్పార్సీ గురించి మాత్రమే చెప్పారని వారు గుర్తు చేశారు. కోర్ కమిటీలో ఉన్న నేతలంతా కేంద్ర మంత్రివర్గ బృందంలో ఉన్నారని చెప్పారు. తమకు మంత్రుల కమిటీపై నమ్మకం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోబియాలో ఉన్నారని ఎద్దెవా చేశారు. సమైక్యమా లేక తెలంగాణాకు అనుకూలమా అనేది ముందుగా చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.