అన్యాయం..అనైతికం
సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. పోలీసు అధికారులు రాజకీయపరంగా నిర్ణయం తీసుకుంటే అది తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఈ నెల 19న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభను నిర్వహించాలని నిర్ణయించిన విషయం, దానికి పోలీసులు అనుమతి నిరాకరించడం తెలిసిందే. ఆదివారం మైసూరారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ సభ్యుడు కె.శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు డీసీపీ ఇచ్చిన ఆర్డర్‌ను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘తమకు నచ్చిన వారు సభలు పెట్టుకుంటే వారికి సకల సౌకర్యాలు కల్పిస్తారు. అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తారు.
తమకు నచ్చని వారు సభలు నిర్వహించాలనుకుంటే మాత్రం పోలీసులకు శాంతిభద్రతలు గుర్తొస్తాయి. పోలీసులంటే అధికార పార్టీకి ‘ఎస్ బాస్’ లే కదా. వారు ఏం చెబితే దానికి వంతపాడటం పోలీసులకు రివాజుగా మారింది. ఇప్పుడు డీసీపీ ఆదేశాలు కూడా అందులో భాగమే’ అని మైసూరా మండిపడ్డారు. సీడబ్ల్యూసీ తీర్మానం గురించి పోలీసు ఆర్డర్‌లో పేర్కొన్నారని, అసలు దానికీ పోలీసులకూ ఏం సంబంధమని ఆయన సూటిగా ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అనేది కాంగ్రెస్ కమిటీ అని, కాంగ్రెసేం పోలీసులకు బాస్ కాదు కదా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం కూడా ప్రభుత్వ అంతర్గత వ్యవహారం. అది చట్ట సభకు వచ్చి ఆమోదం పొందిన తరువాత దానిని అమలు చేయాలి. అంతేకానీ ఇప్పుడే అధికార పార్టీ వైఖరిని పేర్కొంటూ వ్యవహారాలను నడపడం పోలీసుల బాధ్యతారాహిత్యం’ అని విమర్శించారు. అధికార పార్టీకి కొమ్ము కాశారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మైసూరారెడ్డి ప్రశ్నించారు.
భావ ప్రకటన హక్కును కాదంటారా?
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉందనీ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాదే ఉందనీ, ఈ రాజధానిలో వివిధ పార్టీలు, వ్యక్తులు తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో సమైక్యం, విభజన కోరుకునే వారిద్దరూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుంది. వినడానికి వచ్చే వారిని విచ్ఛిన్నకర శక్తులనడం చూస్తే పోలీసులే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ఉంది. ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు లేవు. భావాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఆ భావాలను చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ, వారి భావాలను చెప్పుకోవడానికి వస్తున్న వారిని విధ్వంసకారులని అనడం తప్పు. సమైక్యవాదాన్ని కోరుకుంటున్న ముఖ్యమంత్రికి ఇది తగునా?’ అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రాజకీయ వైఖరిని మార్చుకుందనడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ స్టాండ్ అపుడూ ఇపుడూ ఎల్లప్పుడూ ఒకటేనని అయన స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి షిండే సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించే అధికారం, కలిపి ఉంచే అధికారం కేంద్రానికి ఉందని మేం గుర్తు చేస్తే... కొందరు దానిని పట్టుకుని తమ స్థాయికి దిగజారి మాట్లాడ్డం ఏమాత్రం సరికాదు. ఇది అన్యాయం’ అన్నారు. ఇది కేవలం తమ పార్టీపై బురద జల్లడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే అవుతుందన్నారు. ఎవరికీ అన్యాయం జరక్కుండా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించాలని కోరితే మీ ఇష్ట ప్రకారం చేయమని అర్థమా? అని ఆయన ప్రశ్నించారు. తాము అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పామో పూర్తిగా చదవమని దిగ్విజయ్, షిండేలకు ఆయన సూచించారు. ‘మీకు ఇంగిత జ్ఞానం లేదు, మీ కింద ఉండే పోలీసులకు మోకాళ్లలో మెదడుంది. మా స్టాండ్ ఏమిటో తెలుసుకోకుండా కళ్లు మూసుకుని ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుందా’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన అందరికీ నష్టమే... కలిసుంటే బలంగా ఉంటాం
విభజన వల్ల ఇరుప్రాంతాల ప్రజలూ నష్టపోతారనేది వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి అని మైసూరారెడ్డి మరోసారి స్పష్టంచేశారు. ఐకమత్యంగా ఉంటేనే జాతీయ స్థాయిలో బలంగా ఉండగలమనేది తమ పార్టీ అభిప్రాయమని ఆయన అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు ప్రాంతాల ప్రజల అభివృద్ధిని ఆశించి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టారని, దానివల్ల అందరూ లబ్ధి పొందారని ఆయన గుర్తుచేశారు. అందువల్లనే తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక సమైక్యవాదం బలంగా వినిపించేందుకు హైదరాబాద్‌లో సభ పెట్టాలనుకున్నామని, అంతే తప్ప ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశంతోనో, విద్వేషాలు రెచ్చగొట్టడానికో కాదని మైసూరా అన్నారు.
వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఇక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేస్తూ.. అలాంటి పార్టీ తలపెట్టిన సభకు రక్షణ కల్పించాల్సింది పోయి నిరాకరించడం అనైతికం అని వ్యాఖ్యానించారు. ‘తాను సమైక్యవాదినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాదా..! లేక సోనియా తలపెట్టిన విభజన ఎజెండాను అమలు చేయడానికి ఆమె ఏజెంటుగా పని చేస్తున్నారా...?’ అని మైసూరా ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిని ఇచ్చారు, ఆ తరువాత సకల జనుల సభకూ అవకాశం ఇచ్చారు. ఇపుడు ప్రజల్లోకి వచ్చి సమైక్యవాదం గురించి మేం చెబుతామంటే ఎందుకు అనుమతిని ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ‘బహుశా అశోక్‌బాబు వారికి నచ్చినవాడు కనుక ఆయన సభకు పూర్తి రక్షణ కల్పించినట్లుగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. సభ విజయవంతం అయితే అధికారపార్టీ నామరూపాల్లేకుండా పోతుందనే భయంతోనే అనుమతిని ఇవ్వలేదని మైసూరా విమర్శించారు.
యూటర్న్ కాంగ్రెస్‌దే!
తమను వైఖరి మార్చుకున్నారని చెబుతున్న దిగ్విజయ్‌సింగ్, సుశీల్‌కుమార్ షిండేలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మైసూరా హెచ్చరించారు. ‘మమ్మల్ని యూటర్న్ తీసుకున్నామని వీళ్లంటున్నారు, వాస్తవానికి యూటర్న్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీయే. ఆ విషయం వీళ్లిద్దరికీ తెలియదా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘ప్రణబ్‌ముఖర్జీ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం రాష్ట్రాల పునర్విభజనకు మరో కమిటీని(రెండో ఎస్సార్సీ) వేయాలని 2001, అక్టోబర్ 30వ తేదీన సీడబ్ల్యూసీ చేసిన తీర్మానంలో పేర్కొన్నారు. 2004 ఎన్నికల ప్రణాళికలోనూ విదర్భ, తెలంగాణ వంటి చోట్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయని వాటి కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు’ అని ఆయన కాంగ్రెస్ నేతలకు గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌తో చేసుకున్న అవగాహనలో కూడా రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలనే ఉందన్నారు. అది నాటి సీఎల్పీ నేత వైఎస్‌కు ఇష్టంలేకపోయినా గులాంనబీ ఆజాద్ వైఎస్‌ను ఒప్పించారని మైసూరా వెల్లడించారు. ఆ అవగాహనపై అప్పటి టీఆర్‌ఎస్ నేత నరేంద్ర సంతకం చేశారన్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి తాను చెప్పినవన్నీ కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో ఉన్నాయని దిగ్విజయ్ వాటిని చూడవచ్చని వాటి ప్రతులను ఆయన పత్రికలకు విడుదల చేశారు.